– యూరియా కోసం రాత్రింబవళ్లు రైతులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి రావడం కాంగ్రెస్ వైఫల్యానికి పరాకాష్ట
– ఈ ప్రాంత వ్యక్తి సీఎంగా ఉండి ఏం లాభం ?
– కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం మూలంగా కృష్ణా నీళ్లను ఏపీకి
– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: యూరియా కోసం రైతులు తండ్లాడుతుంటే అసలు యూరియా కొరత లేదని రేవంత్, యూరియా కోసం రోడ్ల మీదకు వచ్చిన వారు రైతులు కాదని వ్యవసాయ మంత్రి, యూరియా సమస్యను పెద్దగా చిత్రీకరిస్తున్నారని ఇంకో మంత్రి అనడం వారి చిత్తశుద్ధి, నిర్లక్ష్యానికి నిదర్శనం.
90 శాతం పనులు పూర్తయిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రెండేళ్లుగా పెండింగులో పెట్టారు. వ్యక్తిగత ప్రతిష్ట కోసం కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. కొడంగల్ ఎత్తిపోతలను ఎన్జీటీలో కేసులు వేశారని రేవంత్ ఆరోపించడం హాస్యాస్పదం. వందల కేసులతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేసింది కాంగ్రెస్ పార్టీ.
నాటి పాలమూరు వలసలు, కరువు, కన్నీళ్లకు కారణమే దశాబ్దాల కాంగ్రెస్, టీడీపీ పాలన. తెలంగాణ ఉద్యమామికి పాలమూరు ప్రాతిపదిక అయింది. పాలమూరు వెతలను శ్రీకృష్ణ కమిటీ ముందు ఉంచడం జరిగింది. ఈ వెతలకు కారణం గత పాలకులు అన్న విషయం ప్రపంచానికి విదితమే
రెండేళ్లలో పాలమూరుకు ఏం చేశాడో రేవంత్ చెప్పాలి. ఏం అభివృద్ధి చేశాడని మరోసారి రేవంత్ రెడ్డికి అవకాశం ఇవ్వాలి ? కేసీఆర్ గారి హయాంలో మంజూరైన మెడికల్ కళాశాలను కొడంగల్ కు తరలించిన రేవంత్ రెడ్డి కళాశాలల మంజూరు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు, ఉన్నత విద్యాసంస్థలు ఏర్పాటు చేసింది కేసీఆర్ హయాంలోనే అన్నది మరిచిపోవద్దు. గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, సాగునీరు, పారిశుధ్యం, గ్రామాల నుండి మండలం, మండలం నుండి జిల్లాలకు రహదారులు నిర్మించడం జరిగింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్లింది పాలమూరులో నివసించి ఉంటే తెలిసేది.
52 సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లి ఒక్క రూపాయి నిధులు గానీ, ఒక కొత్త కళాశాల గానీ తీసుకురావడంలో విఫలమయ్యారు. చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం మూలంగా కృష్ణా నీళ్లను ఏపీ ఎత్తుక పోతున్నది. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను అవహేళన చేసినందుకే తెలంగాణలో టీడీపీ పార్టీ అంతర్ధానం అయింది.
ఆత్మాభిమానం, స్వయం పాలన, స్వాభిమానం ప్రతీకగా ఎగిసివచ్చిన తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఆకాంక్ష ఇప్పటికీ రేవంత్ రెడ్డికి అర్దం కాకపోవడం దురదృష్టకరం. తెలంగాణ ఆకాంక్షలను పట్టించుకోని టీడీపీ తెలంగాణ నుండి అదృశ్యం అవుతుందని చెప్పాం. అదే జరిగింది. బీఆర్ఎస్ పార్టీని రేవంత్ రెడ్డి టీడీపీతో పోల్చడం విడ్డూరంగా ఉంది.