Suryaa.co.in

Telangana

ఉత్తమ్ కుమార్ రెడ్డికి సిగ్గుండాలి

ఉత్తమ్ కుమార్ రెడ్డికి సిగ్గుండాలి

– రేవంత్ రెడ్డికి ఇక్కడికి వచ్చి చూసే టైం లేదు
– 8 మంది ప్రాణాలు ముఖ్యమా, ఎన్నికల ప్రచారం ముఖ్యమా?
– ఆంధ్ర ప్రభుత్వం కృష్ణ నీళ్లు తరలిస్తుంటే ఎందుకు అడ్డుక్కోవడం లేదు?
– శ్రీశైలం ఖాళీ అవుతుంటే ప్రభుత్వం నిద్రపోతున్నదా?
– కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో నాలుగు ప్రాజెక్టులు కుప్పకూలాయి
– గత ప్రభుత్వానికి ఇప్పటి ఘటనలు ఏం సంబంధం?
– పని ప్రారంభించేటప్పుడు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇచ్చిందా?
– ఆరు రోజుల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదు
– మంత్రులు పొద్దున వస్తున్నారు సాయంత్రం పోతున్నారు.. ఇదేమైనా టూరిస్ట్ ప్లేసా
– ఎస్ఎల్బిసి టన్నెల్ వద్ద మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి

హరీష్ రావు వ్యాఖ్యలు

హైదరాబాద్: సహాయక చర్యలు జరుగుతున్నాయనీ, కొద్ది రోజులు ఆగి వెళ్లాలని కేసీఆర్ సూచించారు. అందుకే ఇప్పటి దాకా సంయమనం పాటించాం. కానీ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. ఆరు రోజుల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదు. ఆరు రోజుల్లో 8 మంది ప్రాణాలు కాపాటంలో రాష్ట్ర ప్రభుత్వం చేసింది సున్నా పని. అందుకే మేము ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకునేందుకు వచ్చాం.

బాధిత కుటుంబాలను పరామర్శించటానికి వచ్చాము. అయినా మమ్మల్ని అడ్డుకున్నారు. ప్రజా ప్రతినిదులను అని చూడకుండా ఆపారు. అయినా మేము, మా సభ్యులు పోలీసులకు సహకరించాం. వివిధ బృందాల మధ్య సమన్వయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఎవరు ఏం పని చేయాలి? ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయంలో డైరెక్షన్ లేకుండా ఉన్నారు.

ఆరు రోజుల వరకు డైరెక్షన్ ఇవ్వకుండా ప్రభుత్వం ఉండడం ఏమిటి? లోపల ఉన్న వాళ్ళ ప్రాణాలు ఏమైపోవాలి? ఏ రకంగా ముందుకు పోవాలని నిర్ణయం తీసుకోవడానికి ఆరు రోజులు పడుతుందా? మంత్రులు పొద్దున వస్తున్నారు సాయంత్రం పోతున్నారు. ఇదేమైనా టూరిస్ట్ ప్లేసా? హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతున్నారు. హెలికాప్టర్లు వేసుకొని ఎన్నికల ప్రచారం పోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంతవరకు రాడు, డైరెక్షన్ లేదు. మంత్రిగారు రోజు పొద్దున వస్తుండు, సాయంత్రం పోతున్నాడు. ఇంతకంటే ముఖ్యమైన పని ఏముంటది రాష్ట్రంలో డైరెక్షన్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వానికి లేదా?

ఇవ్వాలా అరో రోజు. ఇప్పటికీ కన్వేయర్ బెల్టు పనిచేయడం లేదు. దాన్ని రిపేర్ చేయడానికి ఆరు రోజులు పడుతుందా? గంటల్లో పూర్తి చేసే పని. కన్వేయర్ బెల్టు పనిచేస్తే లోపల ఉన్న శిథిలాలు వంటివి బయటకు తీసుకురావడానికి సాధ్యమైతది. టన్నెల్ బోర్ మెషిన్ యొక్క పార్ట్స్ చెల్లాచెదురుగా పడి ఉన్నాయన్నారు. అవి కట్ చేసి, తీసుకురావాలా వద్దా అని నిర్ణయించడానికి నాలుగు రోజులు సమయం తీసుకున్నారు. ఆ నాలుగు రోజులు లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి?

అది కట్ చేయాలనీ తొందరగా నిర్ణయం తీసుకొని, ఫాస్ట్ గా డీ వాటరింగ్ చేసి, కన్వేయర్ బెల్ట్ ఓకే చేసి దాని ద్వారా అడ్డంకిగా ఉన్నవి బయటికి తేవాల్సి ఉండే. ఆరు రోజుల తర్వాత తట్టెడు మట్టి తెచ్చారు. 8 మంది ప్రాణాలు కాపాడటం పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా?

సహాయక బృందాలు, కంపెనీ వారు, లేబరు, అధికారులు అందరితో మాట్లాడా. కన్వేయర్ బెల్టు ఎప్పటి వరకు అవుతుంది అని అడిగితే.. రెండు రోజులను ఒకరంటారు, ఉత్తం గారేమో రెండు రోజుల్లో మొత్తం ఆపరేషన్ అయిపోతుందంటాడు. ఆరు రోజులైనా కన్వీయర్ బెల్ట్ ఇప్పటికీ ఉపయోగంలోకి రాదు, బురద, డెబ్రిస్ ని బయటికి తీసుకురారు. ఎవరితోనైనా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే అడ్డుకుంటున్నారు. టన్నెల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటున్నారు.

కాంగ్రెస్ నాయకులు టన్నెల్లోకి పోయినప్పుడు.. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా, విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశాము మాకు అనుమతి లేదా? బాధ్యతగల మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వస్తే అడ్డుకుంటారా? ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. బాధగలిగే విషయం ఏమిటంటే, మేము బాధ్యతతో సంయమనంతో ఉంటే, రెస్క్యూ కొనసాగాలే ఎనిమిది మంది ప్రాణాలతో బయటకు రావాలని కోరుకుంటే.. కాంగ్రెస్ పార్టీ వాళ్లు రాజకీయాలు చేస్తున్నారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల టన్నెల్ కూలిందని ఉత్తంకుమార్ రెడ్డి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాడు. మాట్లాడడానికి సిగ్గుండాలి. గత ప్రభుత్వానికి ఇప్పటి ఘటనలు ఏం సంబంధం? పని ప్రారంభించేటప్పుడు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇచ్చిందా? ఇస్తే అది బయట పెట్టండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్స్ మెకానిక్ పిలిచి వాళ్ళ ఒపినియన్ తీసుకున్నారా? ఉంటే ఆ రిపోర్టు బయట పెట్టండి. ఆదరా బాదరా ఆగమాగం చేసి ప్రాణాలు బలిగొన్నరు ప్రాజెక్టు కుప్పకూలిపోయే పరిస్థితి.

గత ప్రభుత్వం పనే చేయలేదని ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతున్నాడు. చదువుకున్న వారు విజ్ఞానవంతులు మంత్రిగా ఉన్నారు రికార్డులు చూసుకోండి. 9 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఎస్బీసీ లో 3300 కోట్ల రూపాయల పని జరిగితే.. 9 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో 3900 కోట్ల రూపాయల పని ఈ ప్రాజెక్టులో జరిగింది. మీకంటే 600 కోట్ల రూపాయల పని మేము ఎక్కువగా చేసినం. రెండేళ్లు వరుసగా కరోనా వచ్చినా, 10,000 లీటర్ల సీపేజి వచ్చినా ఇబ్బందులు వచ్చినా కూడా దాదాపు 12 కిలోమీటర్ల టనల్ పూర్తి చేసాము.

దిండి రిజర్వాయర్ ను, పెళ్లిపాక రిజర్వాయర్ ను ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్న వాటికి భూసేకరణ పూర్తి చేసి ఆ ప్రాజెక్టును 90% పూర్తి చేసాము. కానీ మైకుల ముందు నోటికి వచ్చినట్టు గత ప్రభుత్వం పని చేయలేదని మాట్లాడుతాడు. మంత్రి జూపల్లి 5 కిలోమీటర్లు మాత్రమే పనిచేసిన అంటడు. మా ప్రభుత్వంలో నేను నీళ్ల మంత్రిగా ఉన్నప్పుడు నాతో పాటు సహచర మంత్రిగా ఇదే టన్నెల్ కు నాతో వచ్చిండు. పార్టీ మారగానే ప్లేట్ ఫిరాయించి నాలుక మడత పెడుతున్నాడు. దివాలాకోరు దిగజారుడు రాజకీయాలు చేయకండి

చాలా విషయాలు మాట్లాడేది ఉంది. సమయం సందర్భం కాదని ఓపిక పడుతున్నాం. ఇప్పటికైనా సహాయక చర్యలు చేస్తున్న బృందాల మధ్య సమన్వయం తీసుకురండి. వేగంగా దెబ్రెస్ తీసే చర్యలు చేపట్టండి. నిపుణుల సలహాలు తీసుకోండి వేగవంతంగా చేయండి. ఆరు రోజులు అంటే ఎంత అమూల్యమైనవి. మంచినీళ్లు లేకుండా ఆహారం అందకుండా ఆక్సిజన్ లేకుండా వారి ప్రాణాలు ఏం కావాలి? ఆ దారుణమైన పరిస్థితిలో ఉన్న వారి స్థానంలో ఉండి ప్రభుత్వం ఆలోచించాలి.

కరోనా వచ్చినప్పుడు ఇతర రాష్ట్రాల వారిని ఎంతో బాగా చూసుకున్నారు. ట్రైన్ టికెట్లు ఇచ్చి భోజనాలు పెట్టి సొంత ఊళ్ళో పంపించారు. కానీ మీరు ప్రాణాలు తెగించి రాష్ట్రం కోసం ప్రాజెక్టులు కడుతున్న వారి ప్రాణాలను కాపాడటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఇక్కడికి వచ్చి చూసే టైం లేదు. ఢిల్లీ కో కరీంనగర్ కో వెళ్లి మాట్లాడుతున్నాడు. హెలికాప్టర్ వేసుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాడు మరొక మంత్రి హెలికాప్టర్ లేదని హైదరాబాదులో ఉన్నాడు.

హెలిక్యాప్టర్ దొరుకుతేనే ఇక్కడకు వస్తా అనే పరిస్థితి మంత్రి ఉత్తమ్ ది. ముఖ్యమంత్రికి మంత్రికి 8 మంది ప్రాణాలు ముఖ్యమా, ఎన్నికల ప్రచారం ముఖ్యమా? రేవంత్ రెడ్డి ఎందుకు ఇక్కడకు రావడం లేదు ఎందుకు డైరెక్షన్ ఇవ్వడం లేదు. ఎందుకు రేవంత్ రెడ్డి సమీక్షించడం లేదు? ఎందుకు ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పడం లేదు? ముఖ్యమైన ప్రాజెక్టు కుప్పకూలిపోతే పట్టించుకున్న పాపాన పోవడం లేదు ముఖ్యమంత్రి..

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో నాలుగు ప్రాజెక్టులు కుప్పకూలాయి. ఖమ్మం జిల్లాలో పెద్దవాగు కొట్టుకుపోయింది, సుంకిశాల కుప్ప కూలింది. పాలమూరు పథకంలోని వట్టెం పంప్ హౌస్ జలమయమైంది. ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలింది. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఉన్న నీళ్లను కూడా కాపాడలేని దుస్థితి మీది. శ్రీశైలం మొత్తం ఖాళీగా కనిపిస్తున్నది.

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు తాగునీరు దీనిపైన ఆధారపడి ఉంటుంది. మొత్తం శ్రీశైలం ఖాళీ అవుతుంటే ప్రభుత్వం నిద్రపోతున్నదా? చేతగానట్టు చేవ లేనట్టు ఈ ప్రభుత్వం ఎందుకు పనిచేస్తున్నది. ముచ్చుమరి నుంచి పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకుపోతుంటే ఎందుకు చోద్యం చూస్తున్నారు. ఆపే బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? సాగర్ లోనూ నీళ్లు లేని పరిస్థితి. ఆరున్నర లక్షల ఎకరాల సాగరాయకట్టు ఉంది. రెండున్నర లక్షల 50 వేల ఎకరాలు మహబూబ్నగర్ లో ఉన్నది. దాదాపు పది లక్షల ఎకరాలు ఆయకట్టు ఆధారపడి ఉన్నది.

ఆంధ్ర ప్రభుత్వం కృష్ణ నీళ్లు తరలిస్తుంటే ఎందుకు అడ్డుక్కోవడం లేదు? కె ఆర్ ఎం బి కి ఫిర్యాదు చేసి ఎందుకు అడ్డుకోవడం లేదు? టిఆర్ఎస్ పార్టీ ముళ్ళు కర్ర బట్టి పోలిస్తే తప్ప ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వదలడం లేదు. మొదటి కె ఆర్ ఎం బి మీటింగ్ లోనే ఒప్పుకొని వచ్చారు.

సెక్షన్ 3 కింద నీటి పంపకాలు అయ్యేవరకు ప్రాజెక్టులు అప్పగించేది లేదు అని కేసిఆర్ గర్జించారు. మీరు నిర్ణయాన్ని వాపస్ తీసుకుంటున్నామని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. చంద్రబాబు గోదావరి నీళ్లను బనకచర్ల లింకు ద్వారా ఆంధ్రకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. నేను ప్రెస్ మీట్ పెట్టీ ప్రశ్నిస్తే, నిలదీస్తే అప్పుడు మూడు రోజుల కింద బ్యాక్ డేట్ వేసి ఉత్తరం రాసిండు. రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవు, కుర్చీల కొట్లాట మీ మధ్య ఉంది. మొన్న కృష్ణా జలాలు కుడి కాల్వ ద్వారా రోజు 10 వేల క్యూసెక్కులు తరలిస్తున్నారని నేను మాట్లాడితే అప్పుడు ఛైర్మెన్ వద్దకు వెళ్లిండు. రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులు కాపాడడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది.

ఎస్ ఎల్ బి సి రూపకల్పన చేయడమే లోప భూయిష్టం: నిరంజన్ రెడ్డి

వీలైనంత త్వరగా నీళ్లు రా వద్దనే ఉద్దేశంతోనే నాటి పాలకులు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. నల్గొండ రైతాంగానికి నీళ్ళు రావాలని తెలంగాణ ప్రజలు బాగుపడాలని సంకల్పించింది కాదు. ఇదే విషయాన్ని కేసీఆర్ హరీష్ రావు చాలాసార్లు అసెంబ్లీలో చెప్పారు. ఎస్ ఎల్ బి సి రూపకల్పన చేయడమే లోప భూయిష్టం. పోతిరెడ్డిపాడు పనులు పూర్తి చేసి నీళ్లు తీసుకెళ్తున్నారు కానీ, ఎస్ ఎల్ బి సి పూర్తి చెయ్యలేదు. ఎస్ ఎల్ బి సి ఎన్నటికీ వొడవని ముచ్చట చేశారు.

2005 లో వై ఎస్ మొదలు పెట్టారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కేసీఆర్ , హరీష్ రావు 11.5 మీటర్ల టన్నెల్, 60 కిలోమీటర్ల పై చిలుకు రెండేళ్లలో పూర్తి చేశారు. ఫలితానికి సిద్ధం చేసినం. అవసరం అయిన చోట ఆడిట్స్ పెట్టినం. నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. సరైన జాగ్రతలు తీసుకోలేదు. 8 మంది సొరంగంలో ఇరుక్కోవడం బాధాకరం.

ప్రభుత్వ నిర్లక్ష్యం : జగదీష్ రెడ్డి

ఆరు రోజులుగా చిక్కుకున్న వారి ఆచూకీ తెలియక పోవడం బాధాకరం. ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ఒత్తిడి వల్ల జరిగింది. సరైన నిపుణుల సలహాలు తీసుకోలేదు అంటున్నారు. మంత్రులు వస్తున్నారు ఫోటోలకు ఫోజులు ఇచ్చి పోతున్నారు. ఈరోజు మాత్రమే తట్టెడు మట్టి తీసుకు వచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము సంయమనం పాటిస్తూ వచ్చాం.

LEAVE A RESPONSE