– శతజయంతి వేడుకలలో ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ: భారతరత్న , మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్పేయి భారత్ లో అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశ గమనాన్ని మార్చారని పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) అన్నారు. వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఎంజీ రోడ్డు లోని రామ్మోహన్ గ్రంథాలయంలో వాజ్పేయి విజ్ఞాన కేంద్రాన్ని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ తో కలిసి బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అటల్ బిహారీ వాజ్పేయి దేశ గమనాన్ని మార్చిన గొప్ప నేత అని కొనియాడారు. ఆధునిక భారత్ నిర్మాణంలో అటల్ జీ కీలకపాత్ర పోషించారని రాజకీయాలలో విలువలకు పట్టం కట్టారన్నారు. ప్రధానిగా పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలకు బాటలు వేస్తే అనంతరం ఆస్ఫూర్తిని వాజ్పేయి కొనసాగించారని తెలిపారు.వాజ్పేయి దూరదృష్టి కలిగిన వ్యక్తి అని జాతీయ రహదారులు, పోర్టులు అనేకం ఆయన పాలనా కాలంలోనే ఊపిరి పోసుకున్నాయన్నారు.
తన పాలనా దక్షణ తో అజాతశత్రువుగా కీర్తింపబడ్డారని తెలిపారు.స్వాతంత్రోద్యమంలో కీలకపాత్ర పోషించిన రాజా రామ్మోహన్ రాయ్ గ్రంధాలయానికి రావడం సంతోషకరమన్నారు. 115 ఏళ్ల చరిత్ర కలిగిన గ్రంథాలయంలో 20వేల పుస్తకాలను పొందుపరచడం అభినందనీయం అని కొనియాడారు. స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన రాజా రామ్మోహన్ రాయ్ గ్రంథాలయంలో వాజ్పేయి విజ్ఞాన కేంద్రం ప్రారంభించడం అభినందనీయమని గ్రంథాలయ అభివృద్ధికి సహకరిస్తానని ఎమ్మెల్యే సుజనా చౌదరి హామీ ఇచ్చారు.
అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ.. రాజా రామ్మోహన్ రాయ్ గ్రంథాలయం శతాబ్దికాలంగా ఎన్నో లక్షల మందికి విజ్ఞానాన్ని అందించిందన్నారు. ప్రజల్లో మూఢనమ్మకాలను పోగొట్టడానికి గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలుగా ఉన్నాయన్నారు.ఈ గ్రంథాలయంలో వాజ్పేయి విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషకరమన్నారు. ఆయన చేపట్టిన అనేక ప్రాజెక్టులు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషించాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రామ్మోహన్ గ్రంధాలయ అధ్యక్షులు చింతలపూడి కోటేశ్వరరావు, కార్యదర్శి వేములపల్లి కేశవరావు, గుమ్మల రామచంద్రరావు, ప్రొఫెసర్ ఎం సి దాస్, తంగిరాల రఘురాం, కూటమి నేతలు నాగుల్ మీరా, అడ్డూరి శ్రీరామ్, ఎమ్మెస్ భేగ్, బొమ్మసాని సుబ్బారావు, ఉమ్మడి చంటి, తదితరులు పాల్గొన్నారు.