– పవన్ వ్యాఖ్యలకు పొలికేకలెందుకు?
– పవన్‌కు మహిళా హక్కుల కమిషన్ నోటీసు
– 10 రోజుల్లోగా రుజువులు సమర్పించాలని ఆదేశం
– వాలంటీర్లపై ఇప్పటికే మహిళల కిడ్నాప్, అత్యాచార ఆరోపణలు
– యాచకురాలిపైనా అత్యాచారం చేసిన వాలంటీర్లు
– వింతతులనూ వదలిపెట్టని వాలంటీర్ల వేధింపుల పర్వం
– ఆరేళ్ల చిన్నారి పైనా అత్యాచార యత్నం
– దళిత మహిళపై అత్యాచారంతో గర్భం దాల్చిన వైనం
– అనేకచోట వాలంటీర్లపై పోక్సో కేసులు, అరెస్టులు
– ఆడవారిపై అసభ్య ప్రవర్తన ఆరోపణలు
– మీడియాలోనూ వెలుగుచూస్తున్న కేసులు
– 458 మంది లబ్దిదారుల నకిలీ వేలిముద్రలతో సొమ్ములు మాయం చేసిన వాలంటీర్లు
– ఎమ్మెల్యేలకూ ఇష్టం లేని వాలంటరీ వ్యవస్థ
– కొంపముంచుతున్నారంటూ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వ్యాఖ్యలు
– వాలంటీర్ల రాకతో పలచబడిన ఎమ్మెల్యేల పలుకుబడి
– జనంలో ఎమ్మెల్యేల కంటే వాలంటీర్లకే ఇమేజ్
– తాజాగా పవన్ వ్యాఖ్యలతో వాలంటీర్ల ఇమేజీకి డ్యామేజీ
– దానితో వాలంటీర్లంటేనే భయపడుతున్న మహిళలు
– పవన్ ఆరోపణలతో మహిళలు దూరమవుతారన్న ఆందోళన
– అందుకే రంగంలోకి మంత్రులు, ఎమ్మెల్యేలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై ఉన్న ఇమేజ్ జనసేనాధిపతి పవన్ కల్యాణ్ ఆరోపణలతో దారుణంగా డ్యామేజీ అయిందా? వేల సంఖ్యలో మహిళలు కనిపించకపోవడానికి వాలంటీర్లే కారణమన్న పవన్ ఆరోపణలు, మహిళలలో వాలంటీర్లంటే మరింత భయం పెంచాయా? జనసేనాధిపతి ఆరోపణలు, మహిళలలో మరింత జంకు కలిగించాయా? వాలంటీర్లను విలన్లుగా చూపిన వైనమే వైసీపీ నేతలకు భయం కలిగించిందా? ఇది మహిళా ఓటుబ్యాంకుపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన పాలకపార్టీలో మొదలయిందా?
అందుకే మహిళా కమిషన్‌తో పవన్‌కు నోటీసులు జారీ చేయించారా? వాలంటీర్ల ఇమేజీ నిలబట్టేందుకే మంత్రులు, మాజీ మంత్రులు రంగంలోకి దిగారా? వైసీపీకి మూలస్తంభాలుగా ఉన్న వాలంటీర్లను కాపాడుకునే వ్యూహంలో భాగంగానే, యావత్ పార్టీ యంత్రాగం వారికి దన్నుగా నిలిచిందా? ఇదీ.. పవన్‌కల్యాణ్ ఆరోపణల నేపథ్యంలో తెరపైకి వచ్చిన చర్చ.
‘‘నాలుగేళ్లలో ఏపీలో 29 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారు. వారిలో 14 వేలమంది ఇళ్లకు చేరగా, మిగిలిన 14 వేల మంది కనిపించకుండా పోయారు, దానికి కారణం వాలంటీర్లని కేంద్ర నిఘావర్గాలు నాకు చెప్పాయి. ఒంటరిగా, భర్తలేని, బాధల్లో ఉన్న మహిళలను వెతికిపట్టుకుంటారు. వారిని ట్రాప్ చేయడం, బయటకు తీసుకువెళ్లడం, మాయం చేయడమే వారి పని. వారి హ్యూమన్ ట్రాఫికింగ్ వెనుక పెద్ద నాయకులు ఉన్నారని కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పాయి’’- ఇవీ జనసేనాధిపతి పవన్ కల్యాణ్, వైసీపీ నేతలూ- వాలంటీర్లపై చేసిన జమిలి ఆరోపణలు.
పవన్ ఆరోపణలతో వైసీపీలో అల్లకల్లోలం మొదలయింది. మంత్రులు, మాజీ మంత్రులు, వైసీపీ నేతలు హుటాహుటిన రంగంలోకి దిగి, పవన్‌పై మాటలదాడి ప్రారంభించారు. వాలంటీర్లకు దన్నుగా నిలిచారు. ఆ వెంటనే మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. పవన్ చేసిన ఆరోపణలకు పది రోజుల్లోగా ఆధారాలు సమర్పించాలని, పవన్‌కు నోటీసులు జారీ చేసింది. వైసీపీ మహిళా నేతలు పవన్ దిష్టిబొమ్మలు దగ్థం చేశారు. దానికి ప్రతిస్పందనగా జనసైనికులు కూడా, సీఎం జగన్‌పై ఎదురుదాడి ప్రార ంభించారు.
నిజానికి ఏపీలో ఎమ్మెల్యేలకంటే, వాలంటీర్లకే ఇమేజ్ ఎక్కువ. ఎమ్మెల్యేలతో కాని పనులు కూడా వాలంటీర్లు చెబితేనే అవుతున్న వైచిత్రి. పెన్షన్లు, ప్రభుత్వ పథకాలకు అర్హుల పేర్లు గుర్తించి, సిఫార్సు చేసేది వాలంటీర్లే. వారి పరిథిలో ఏ జరుగుతుందో, వెంటనే వాలంటీర్ల దృష్టికి వచ్చేస్తాయి. ఆ సమస్యలకు పరిష్కార మార్గం సూచించేది కూడా వాలంటీర్లే. సూటిగా చెప్పాలంటే.. జగన్‌కు వాలంటీర్లే ఎన్నికల్లో సైన్యం. అందుకే వాలంటీర్ల వ్యవస్థపై నమ్మకం సడలకుండా ఉండాలన్న వ్యూహంతోనే వైసీపీ నాయకత్వం, వారికి దన్నుగా నిలిచినట్లు మంత్రుల మాటలు స్పష్టం చేస్తున్నాయి.
అయితే వాలంటీర్ల వ్యవస్థతో ప్రజలకు కొంత మేలు జరుగుతున్నప్పటికీ.. వారిలో అనేకమంది దిగజారుడు చర్యలతో, మొత్తం వాలంటరీ వ్యవస్థకే చె డ్డపేరు వస్తున్న పరిస్థితి. ప్రధానంగా చాలామంది వాలంటీర్లు.. తమ పరిథిలో నివసించే మహిళలపై అత్యాచారం చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం, డబ్బులు ఎత్తుకెళ్లడం, మహిళలను మోసం చేయడం వంటి ఫిర్యాదులు పోలీసుస్టేషన్లలో వస్తూనే ఉన్నాయి. ఆ కేసుల వివరాలు ఎప్పటికప్పుడు మీడియాలో కూడా చర్చనీయాంశమవుతున్నాయి. ఏలూరులో ఆరేళ్ల చిన్నారిపై వాలంటీరు అత్యాచారయత్నం దీనికి పరాకాష్ట.
ఒక మహిళ ఖాతా నుంచి వాలంటీరు 70 వేలు కాజేయగా, మరో వాలంటీరు అంగన్‌వాడీ కార్యకర్తపై దాడి చేశాడు. మరో వాలంటీరు పించనుసొమ్ముతో ఉడాయించగా, కొమరవోలు గ్రామంలో వాలంటీరు ఆధ్వర్యంలో.. ఏకంగా పేకాట శిబిరం నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
కర్నూలు జిల్లా ఆలోరులో తన వద్దకు రాకపోతే, పథకాలు ఆపివేయిస్తానని ఓ వాలంటీరు.. ఒంటరి వింతతును బెదిరించారన్న ఆరోపణలు వచ్చాయి. చిత్తూరు జిల్లా గంగవరంలో.. తన కూతురుని వాలంటీరు కిడ్నాప్ చేశాడంటూ, ఒక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన వైనం సంచలనం సృష్టించింది.
తిరుపతి జిల్లా నాగలాపురంలో బాలికపై వాలంటీరు అత్యాచారయత్నం చేసిన కేసు నమోదయింది. శ్రీకాకుళం జిల్లా మందస పోలీసుస్టేషన్ పరిథిలో ఒక వాలంటీరు.. అనాధ దళిత యువతిపై అత్యాచారం చేయగా, ఆమె గర్భం దాల్చిన వైనం సంచలనం సృష్టించింది. యాచక వృత్తి చేసే ఆ మహిళపై వాలంటీరు దాడి చేయడం విమర్శలకు గురైంది.
ఇక ఏలూరులూఓ ఆరేళ్ల మైనర్ బాలికపై, వాలంటీర్ అత్యాచారయత్నం చేసిన ఘటన సంచలనం సృష్టించింది. శింగనమలలో సినీఫక్కీలో ఇద్దరు మైనర్ బాలికలపై మత్తుమందు చల్లి, వారిని కిడ్నాప్ చేసిన ముగ్గురు వాలంటీర్ల కిరాతకం, అధికార పార్టీని ఇబ్బందిపెట్టింది. దానితో వారిపై పోక్సో కేసు నమోదు చేశారు.
నంద్యాలలో తన కోరిక తీరిస్తేనే పథకాలు ఇస్తానని బెదిరించిన వాలంటీరుపై కేసు నమోదయింది. చెన్నే కొత్తపల్లి మండలం నాగసముద్రం గ్రామంలో, అన్నదమ్నులపై వాలంటీర్ దాడి చేయగా, బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో ఓ వాలంటీరు అక్రమ మద్యం అమ్ముతూ పట్టుబడ్డాడు. హిందూపురం లేపాక్షి మండలంలో, ఒక వాలంటీరు కర్నాటక నుంచి మద్యం అమ్ముతూ పట్టుబడ్డాడు. రామకుప్పంలోనూ అదే సీను. శ్రీకాకుళం జిల్లా కొత్తూరులోనూ ఇలాంటి కేసే నమొదయింది.
మాకవరంపాలెం మండలం లచ్చన్నపాలెం వాలంటీరు, మాంసం నరికే కత్తితో ముగ్గురిపై దాడి చేశారు. దానితో అతడిని సస్పెండ్ చేశారు. పిఠాపురంలో దొంగతనం చేసిన వాలంటీరును అరెస్టు చేసి, సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి మండలం కూండ్రంలో ఒక వాలంటీరు ఆర్‌అండ్‌బి స్థలంలో, దర్జాగా షాపుల నిర్మాణం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆయనపై గ్రామస్తులంతా ఫిర్యాదు చేశారు. అమరావతిలోని కాలచక్ర కాలనీలో ఇళ్ల పట్టాల కోసం, వాలంటీరు 28 లక్షలు వసూలు చేసిన వైనం చర్చనీయాంశమయింది.
నకిలీ వేలిముద్రలతో వాలంటీర్లు లబ్దిదారుల నిధులను స్వాహా చేశారన్న వార్తలు కలకలం రేపాయి. దీనిపై గ్రామ-వార్డు సచివాలయ శాఖ విచారణకు ఆదేశించడం గమనార్హం. ఈవిధంగా సీఎం జగన్ సొంత కడప జిల్లాలో 48 మంది లబ్దిదారుల నకిలీ వేలిముద్రతో నిధులు కాజేశారు. అదేవిధంగా పశ్చిమ గోదావరిలో 40, ప్రకాశంలో 33, తిరుపతి-ఏలూరులో 33 చొప్పున, అనంతపురంలో 22, తూర్పు గోదావరిలో 21, విజయనగరంలో 9, విశాఖలో 11, శ్రీకాకుళంలో 15, అన్నమయ్య జిల్లాలో 27 మంది లబ్దిదారుల నకిలీ ముద్రలు సేకరించి, వారి డబ్బు కాజేసినట్లు ఆధార్ విభాగం పేర్కొనడం ప్రస్తావనార్హం.
ఈవిధంగా వారంతా 458 మంది లబ్దిదారుల నకిలీ వేలిముద్రలు సంపాదించినట్లు, ఆధార్ విభాగం ప్రకటించింది. వైఎస్సార్‌బీమా, మీసేవ ద్వారా అందించే వివిధ ధృవీకరణ పత్రాల మంజూరీలో కూడా, అవకతవకలకు పాల్పడుతున్నట్లు ప్రాంతీయ ఆధార్ విభాగం.. గ్రామ-వార్డు సచివాలయ శాఖకు పంపిన నివేదికలో ఇవన్నీ తేలడం విశేషం.
అటు ఎమ్మెల్యేలలో కూడా, వాలంటీరు వ్యవస్థపై అసంతృప్తి పాతుకుపోయింది. పథకాలన్నీ వారి ద్వారానే మంజూరు కావడంతో, ప్రజలు ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లటం తగ్గించేశారు. అసలు ప్రభుత్వ పథకాలన్నీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కాకుండా వాలంటీర్లే ఇస్తున్నారన్న భావన, ప్రజల్లో బలంగా నాటుకుని పోయింది.
వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అయితే వాలంటీర్లు తమ కొంపముంచుతున్నారని, వాళ్లే పథకాలు ఇస్తున్నట్లు ఫోజులు కొడుతున్నారని, మీడియా సమక్షంలోనే వ్యాఖ్యానించారు. పథకాలన్నీ వాలంటీర్లే ఇస్తున్నారని జనం చెప్పడమే ఆయన ఆగ్రహానికి కారణం.
ఏపీలో గత నాలుగేళ్ల నుంచి మహిళలు, మైనర్ బాలికలపై వాలంటీర్ల అత్యాచారాలు, అత్యాచార యత్నాలు, కిడ్నాపు కేసులను దృష్టిలో పెట్టుకునే.. పవన్ కల్యాణ్ బహుశా ఈ ఆరోపణలు చేసినట్లు కనిపిస్తోంది. అయితే రాష్ట్రంలో జరుగుతున్న యువతుల అక్రమ రవాణా వెనుక.. వాలంటీర్లు, వైసీపీ నేతలు ఉన్నట్లు, తనకు కేంద్ర నిఘా వర్గాలే చెప్పాయని పవన్ వెల్లడించడం చర్చనీయాంశమయింది.
ఈ పరిణామాలు సహజంగానే, అధికార వైసీపీకి ప్రాణసంకంటంలా పరిణమించాయి. ముఖ్యంగా వైసీపీకి గట్టి మద్దతుదారుగా ఉన్న మహిళలు, పార్టీకి దూరమయ్యే అంశాలను పవన్ ప్రస్తావించడమే దానికి కారణంగా కనిపిస్తోంది. దానికితోడు తమ కళ్లెదుటే సాటి మహిళలను, చివరకు యాచకులను సైతం వదిలిపెట్టకుండా.. వాలంటీర్లు చేస్తున్న అత్యాచారాలు, మహిళలను పార్టీకి దూరం చేసే ప్రమాదం ఉందన్నది నేతల అసలు ఆందోళనగా స్పష్టమవుతుంది. పవన్ ఆరోపణల ప్రభావం, క్షేత్రస్థాయిలో చర్చనీయాంశమయితే, మహిళల ఓట్లపై ఆశలు వదులుకోకతప్పదని వైసీపీ పార్టీలు ఆందోళనలో ఉన్నట్లు కనిపిస్తోంది.