– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్: వందేమాతర గీతం 150 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా వివేక వర్ధిని కళాశాలలో శనివారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. వందేమాతరం! వందేమాతర నినాదం.. ఈ రెండు పదాలు మాత్రమే కాదు.. దేశానికి స్వాతంత్య్రాన్ని అందించేందుకు మన పెద్దలు పడిన తపన, తాపత్రయానికి, ఇందుకోసం వారు చేసిన స్వార్థం లేని త్యాగానికి, మన భరతజాతి ఆత్మగౌరవానికి ప్రతీక.
భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో దేశభక్తి భావనను పెంపొందించేందుకు వందేమాతరం ఒక ప్రేరణాత్మకమైన రణనినాదమని కిషన్ రెడ్డి తెలిపారు.
ఆ తర్వాత దేశాన్ని నిరంతరం ముందుకు నడిపిస్తున్న స్ఫూర్తి మంత్రం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంకల్పించిన ‘వికసిత భారత’ నిర్మాణ దిశలోనూ.. వందేమాతరం కొత్త శక్తిని మనకు అందిస్తుంది.
సుమారు 150 సంవత్సరాల క్రితం మహాకవి బంకించంద్ర చటర్జీ గారు భారతమాత ఔన్నత్యాన్ని,ఆధ్యాత్మిక వైభవాన్ని, సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రతిబింబించేలా.. ‘వందేమాతరం’ పదాన్ని సృష్టించారు.
బ్రిటిష్ పాలకులు ‘విభజించి పాలించు’ విధానంతో దేశాన్ని చీల్చాలని చూసినప్పుడు, వందేమాతరం భారతీయులను ఏకం చేసింది.
కులం, మతం, ప్రాంతం అన్న భేదాల్ని మరిచిపోయి ‘దేశమే ప్రథమం.. మిగిలినవన్నీ తర్వాతే’ అన్న భావనను పెంచింది. ఈ గీతం స్వాతంత్య్ర పోరాటానికి ప్రాణం పోసింది. 1905 బెంగాల్ విభజన ఉద్యమం నుంచి, 1942 క్విట్ ఇండియా ఉద్యమం వరకు.. ప్రతి పోరాటంలోనూ వందేమాతరం గర్జన మార్మోగింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చివరి శ్వాస విడిచే క్షణంలో కూడా ఉచ్చరించిన నినాదం వందేమాతరం.
అది ఒక పాట కాదు… అది ఒక త్యాగస్ఫూర్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో వందేమాతరం ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తూ.. ‘ఈ ఒక్క పదంలో దేశభక్తి, ఐక్యత, త్యాగం అన్నీ దాగి ఉన్నాయి’ అని చెప్పారు.
దురదృష్టవశాత్తు, కొన్ని సందర్భాల్లో ఈ పవిత్ర గీతాన్ని రాజకీయంగా వివాదాస్పదం చేసే ప్రయత్నాలు జరిగాయి. వందేమాతరం అనేది ఓ పార్టీ నినాదం కాదు. దేశ సమైక్యతను ప్రతిబింబించే స్ఫూర్తివంతమైన గేయం వందేమాతరం. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13 నెలల తర్వాత మన గడ్డపై త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడేలా చేసిన సర్దార్ వల్లభ భాయ్ పటేల్ కి మనం ఎప్పటికీ రుణ పడి ఉంటాం.
నాటి హైదరాబాద్ సంస్థానంలో 1938లో వందేమాతర ఉద్యమం ప్రారంభమైంది. దీనిపై నిజాం ప్రభుత్వం వెంటనే నిషేధం విధించింది. ఓవైపు వందేమాతర ఉద్యమాన్ని అణచివేస్తూనే.. , వందేమాతర గీతం ఆలపించిన వారిని కళాశాలు, యూనివర్సిటీలనుంచి బహిష్కరించింది, వారిపై కఠినంగా వ్యవహరించింది. ‘వందేమాతరం’ నినాదంతో.. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన రామచంద్రరావు ఇంటిపేరు వందేమాతరం అయింది.
ఇలా ఎందరో మహానుభావులు.. వందేమాతరం స్ఫూర్తితో నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. ఎన్నో త్యాగాలు చేశారు.
హైదరాబాద్ సంస్థానంలో విద్యార్థులతో ప్రారంభమైన.. ఈ వందేమాతర ఉద్యమంలో.. ఆ తర్వాత..
విభిన్న భావ జాలాలు కలిగిన అనేక సంఘాలన్నీ.. రాజకీయ భావజాలాన్ని పక్కనపెట్టి మరీ ‘ఐక్యపోరాటాన్ని’ ప్రారంభించాయి. ఇంతటి ఘనమైన ‘వందేమాతరం’ చరిత్రను మనమంతా తెలుసుకోవాలి. దాని నుంచి స్ఫూర్తి పొందాలి. అందుకే, ఈ రోజు మనమందరం వందేమాతరం గీతం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకుని భారతదేశ పునర్నిర్మాణంలో భాగస్వాములం కావాలి.