Suryaa.co.in

Andhra Pradesh

వంగవీటి మోహన రంగా బతికి ఉంటే రాష్ట్రాన్ని శాసించే తిరుగులేని నేతగా ఎదిగేవారు

– ఆయన కుమారుడు రాధాకృష్ణ నిజంగా బంగారమే
– అలాంటి మహానుభావుని కడుపున ఇలాంటి వారే పుడతారు
– రాధాకృష్ణకు రంగా, అభిమానులు, దేవుని ఆశీస్సులు ఉండాలి
– రంగా విగ్రహావిష్కరణ సభలో మంత్రి కొడాలి నాని

వంగవీటి మోహన రంగా నేటికీ బతికి ఉంటే ఆయన రాష్ట్రాన్ని శాసించే, తిరుగులేని నేతగా ఎదిగే వారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) అన్నారు.

ఆదివారం గుడ్లవల్లేరు మండలం చిన గొన్నూరు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే దివంగత వంగవీటి మోహన రంగా 33వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రంగా విగ్రహాన్ని మంత్రి కొడాలి నానితో కలిసి వంగవీటి రాధాకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ దివంగత వంగవీటి మోహన రంగా చనిపోయి 33 సంవత్సరాలు గడిచినా ఇంకా ప్రజల హృదయాల్లో జీవించే ఉన్నారని చెప్పారు. నాయకుడిగా ప్రజల మధ్యలో 15 ఏళ్ల పాటు గడిపిన రంగా ఇంతటి కీర్తి ప్రతిష్టలు సంపాదించారని, ఆయన 70 ఏళ్లపాటు జీవించి ఉంటే రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా, రాష్ట్రాన్ని శాసించే వ్యక్తిగా ప్రజల గుండెల్లో మరింత ఉన్నత స్థానంలో నిలిచి ఉండేవారన్నారు. ఆ రోజు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో వంగవీటి మోహన రంగా బతికి ఉంటే మనుగడ ఉండదని కొన్ని రాజకీయ పార్టీలు భావించాయన్నారు. దీంతో ఆయనను అత్యంత పాశవికంగా హత్య చేశారని, అయినప్పటికీ రంగాను నేటికీ గుండెల్లో నిలుపుకున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా పాదాభివందనాలు తెలియజేస్తున్నానని అన్నారు.

వంగవీటి రాధాకృష్ణ బంగారమని, అయితే ఇక్కడ చిన్న సమస్య కూడా ఉందన్నారు. కొద్దిగా రాగి కలిపితేనే ఆ బంగారానికి అందం, ఎటు కావాలంటే అటు వంగి మంచి రూపం వస్తాయన్నారు. అయినప్పటికీ రాధాకృష్ణ కొద్దిగా కూడా రాగిని కలపనివ్వడంలేదని, బంగారం ఒరిజినల్ గానే ఉండాలని అంటున్నాడన్నారు. ఎన్ని సమస్యలు, ఇబ్బందులు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ, తండ్రి వంగవీటి మోహన్ రంగా ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతోనే రాధాకృష్ణ ముందుకు నడుస్తున్నాడన్నారు. రంగా వంటి మహానుభావుడు కడుపున రాధాకృష్ణ లాంటి వ్యక్తులే పుడతారన్నారు. రాధాకృష్ణను తాను దగ్గరనుండి చూస్తున్నానని, రాధాకృష్ణ అంతటి గొప్ప వ్యక్తి అయితే ఆయనకు జన్మనిచ్చిన వంగవీటి మోహన రంగా ఇంకెంత గొప్పవారో చెప్పనక్కర లేదన్నారు. వంగవీటి మోహన రంగాను తాను దగ్గరగా చూడలేదని, ఆయన ఎంతో గొప్ప లక్షణాలు కలిగిన వ్యక్తి అని అన్నారు. గత ఎన్నికలకు ముందు కొన్ని విభేదాలు, తగాదాలు రాధాకృష్ణకు ఎదురయ్యాయని చెప్పారు. కొద్దిగా రాగి కలిగితే బెండు అవుతాడని అనుకుంటే వినలేదన్నారు. బంగారం బంగారం లాగానే ఉండాలంటాడని, స్పష్టమైన నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉంటాడన్నారు.

గత ఎన్నికల సమయంలో రాధాకృష్ణను తెలుగుదేశం పార్టీలో చేర్చుకునేందుకు ఏది అడిగినా ఇవ్వడానికి ఆ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ఆ సమయంలో ఆరు ఎమ్మెల్సీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ కూడా వస్తోందన్నారు. ఎమ్మెల్సీ తీసుకోవాలని తాను పదేపదే చెప్పానని, టిడీపి కూడా ఒత్తిడి చేయడం జరిగిందన్నారు. అయినప్పటికీ రాధాకృష్ణ మాత్రం డబ్బు, పదవులు అవసరం లేదని, బేషరతుగా వచ్చి పని చేస్తానని, ఎక్కడా పోటీ చేయనని అన్నారని తెలిపారు. వీటన్నింటిని తాను దగ్గరనుండి చూశానని, ఈ విషయాలను అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చెబుతున్నానని అన్నారు. ఎవరి నుండి ఏదీ ఆశించని గొప్ప గుణగణాలు రాధాకృష్ణలో ఉన్నాయని చెప్పారు. రాధాకృష్ణ, తాను ఏ పార్టీల్లో ఉన్నా మొదటి నుండి మిత్రులమేనని తెలిపారు. వేర్వేరు పార్టీల్లో ఉన్న సమయంలో ఆయా పార్టీల అధిష్టానాలు తనను, రాధాకృష్ణను హెచ్చరించినప్పటికీ అసెంబ్లీలో పక్కపక్కనే కూర్చునే వాళ్లమని చెప్పారు. ఆ తర్వాత ఇద్దరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పని చేసామని అన్నారు. ఇప్పటికీ కలిసే ఉన్నామని, ప్రస్తుతం తాను వైసిపిలో ఉన్నానని, రాధాకృష్ణ మాత్రం టిడిపిలో ఉన్నాడని అనుకుంటున్నానన్నారు.

రాధాకృష్ణ మనసు చాలా మంచిదని, ఎవరికీ హాని తలపెట్టాలనే ఉద్దేశం ఉండదన్నారు. డబ్బు, పదవుల కోసం బంగారం లాంటి తనలో ఒక గ్రాము రాగిని కూడా కలిపే ఉద్దేశంలో లేడన్నారు. రాధాకృష్ణకు దివంగత వంగవీటి మోహన రంగా, ఆయన అభిమానులు, దేవుని ఆశీస్సులు ఉండాలన్నారు. వంగవీటి మోహన రంగా తనయుడిగా రాధాకృష్ణ ఆయన కన్నా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని, పదిమందికి ఉపయోగపడే ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి కొడాలి నాని ఆకాంక్షించారు. రంగా విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వచ్చిన వంగవీటి రాధాకృష్ణకు చిన గొన్నూరు గ్రామస్తులు సాదర స్వాగతం పలికారు. బైక్, కార్ల ర్యాలీలతో రాధాకృష్ణను గ్రామంలోకి తీసుకువెళ్లారు. అనంతరం వంగవీటి మోహన రంగా విగ్రహ శిల్పిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, పార్టీ గుడివాడ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, నాయకులు పాలేటి చంటి, శాయన రవికుమార్, కోటప్రోలు నాగు, శేషం గోపి, పామర్తి హనుమంతరావు, మట్టా జాన్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE