-బియ్యం మాఫియా పై విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్, ఏసీబీ కి పిర్యాదు చేసిన తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
కాకినాడ పోర్టు ద్వారా పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతోంది. ఆర్ధికంగా వెనకబడిన వర్గాల ఆకలి తీర్చేందుకు పంపిణీ చేయాల్సిన బియ్యం విదేశాలకు తరలిపోవడం దుర్మార్గం.
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ బియ్యం మాఫియా పురుడుపోసుకుంది.రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువనున్న పేదవారికి అందాల్సిన బియ్యం అందక పస్తులు గడుపుతున్నారు.
2020-21 లో రూ.7,972 కోట్ల విలువ గల 31.51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అక్రమంగా తరలించారు.2021-22 లో ఇప్పటికే రూ7,710 కోట్ల విలువ గల 30.3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అక్రమంగా ఎగుమతి చేశారు.కోవిడ్ ఉన్నా ఇంత పెద్ద మొత్తంలో బియ్యం ఎగుమతులు చేశారంటే దీని వెనుక మాఫియా ఉంది. ఐవరీకోస్ట్, టాంగో, సెనెగల్, బెనిన్, గునియా లాంటి ఆఫ్రికా దేశాలకు అక్రమ బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయి.
కేవలం 5 ఆఫ్రికా దేశాలకే 2020-21 లో 23.25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తరలిపోయింది.కాకినాడ ఓడరేవు నుంచి ఎగుమతి చేయబడిన బియ్యం మొత్తం మన రాష్ట్రానికి చెందినవే. ఇతర రాష్ట్రాల అవసరాలకు ఆయా రాష్ట్రాల పోర్టులు ఉన్నాయి.ఇంత పెద్ద మొత్తంలో అక్రమంగా బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయంటే అది పిడిఎస్ బియ్యం సేకరించడం ద్వారా మాత్రమే జరుగుతుంది.కాకినాడ ఓడరేవు నుంచి విదేశాలకు అక్రమంగా తరలిపోతున్న పీడీఎస్ బియ్యం వెనుక అధికార వైసీపీ నేతల పేర్లు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి.
అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యంపై సమగ్ర విచారణ జరిపించాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ, ఏసీబీ వారికి విజ్ఞప్తి చేస్తున్నాను.పిడిఎస్ బియ్యం బలహీన వర్గాల అవసరాలను తీర్చడానికి భారత ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రజా పంపిణీకి తన సహాయ హస్తాన్ని అందిస్తోంది. స్మగ్లర్లు/నిందితులపై మీరు తీసుకునే సత్వర చర్యలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో పేదలు ఆకలి మంటను చల్లార్చుతుంది.