Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రం అల్లకల్లోలం అవుతోంటే విజయమ్మకు, షర్మిలకు బాధ్యతలేదా?

• ప్రజల బతుకులు మారాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని విజయమ్మ చెప్పారు
• మరిప్పుడు, తన బిడ్డ పాలనలో రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే, రాష్ట్రంలో ఇప్పుడు సాగుతున్న జగన్ అరాచక పాలనపై తల్లీచెల్లీ కూడా పోరాడాలని నేడు తాను డిమాండ్ చేస్తున్నా
• గతంలో తనమామ రాజారెడ్డిని చంపారని, ఇప్పుడేమో (2019 ఎన్నికలవేళ) తనమరిది వివేకానందరెడ్డిని చంపారని, చంద్రబాబునాయుడు విచారణజరిపించడంలేదని కూడా విజయమ్మగారు ఎన్నికలప్రచారంలో చెప్పారు
• అవ్వాతాతలకు పింఛన్ రావాలన్నా, రాజన్న రాజ్యం రావాలన్నా, ఇసుక, మట్టి, బొగ్గు కుంభకోణాలు పోవాలన్నా, అమరావతి అభివృద్ధిచెందాలన్నా, రాబోయే 5ఏళ్లలో మద్యనిషేధం జరగాలన్నా తన కుమారుడికి ఓటేయాలని విజయమ్మ గారు ప్రచారం చేశారు
• ఉద్యోగాలురావాలంటే, వ్యవసాయం పండగ కావాలంటే, రాష్ట్రంలో రాక్షసరాజ్యం పోవాలంటే తన అన్న జగన్ రావాలని షర్మిల ప్రచారం చేసింది
• మాటమార్చడం తమ రక్తంలో లేదని కూడా షర్మిల చెప్పారు
• ఆ విధంగా చెప్పిన వారు , నేడు జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న అరాచక, ఆకృత్యాలపై ఎందుకు పోరాడరు?
• తల్లీ కూతుళ్లిద్దరూ తక్షణమే జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసగించిన తీరుపై విజయవాడ ధర్నాచౌక్ లో ధర్నాకు దిగాలి
• అవసరమైతే వారికి మద్ధతుగా తాము కూడా ధర్నాకు కూర్చుంటాము
* టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య
మానసికంగా బలహీనంగా ఉన్నవారిని మోసంచేయడం చాలా తేలికని, మోసగించడంలో చాలాఆరితేరినవ్యక్తి జగన్మోహన్ రెడ్డి 2019ఎన్నికల్లో ప్రజలను మోసగించాడని, ఒక్కఛాన్స్ ఒక్కఛాన్స్ అంటూ జగన్మోహన్ రెడ్డికి ధీటుగా గతఎన్నికల్లో విజయమ్మ, షర్మిలగార్లు ప్రచారంచేసి, ఓటర్లను ప్రలోభపెట్టడంలో విజయవంతమయ్యారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య స్పష్టంచేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలే కరులతో మాట్లాడారు.
ఆ వివరాలు ఆయన మాటల్లోనే … 2019ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డితో పాటు, ఆయన తల్లి విజయమ్మగారు, చెల్లి షర్మిల ఓటర్లను మోసగించారు. ఒక్కఛాన్స్ అంటూ ప్రజలను ప్రలోభపెట్టిన విజయమ్మ గారు, షర్మిలగారు ప్రజలను భ్రమలలోముంచి ఓటర్లను ప్రలోభపెట్టడంలో, వారిని ఊహాలోకంలో ఉంచడంలో విజయవంతమయ్యారు. ఒకరకంగా వారు ఓటర్లను మోసగించారని తాను అంటాను. ముఖ్యమంత్రి తల్లిగారైన విజయమ్మగారు 5కోట్లమందిని మోసంచేయడం తగునా అని తాను ప్రశ్నిస్తున్నా. తనబిడ్డ మాటిస్తే తప్పడని, మేనిఫెస్టోలోని ప్రతిహామీని అమలుచేస్తాడని, పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమపాలన అందిస్తాడని.. జగన్ కు ఒక్క అవకాశమివ్వాలని విజయమ్మ ఎన్నికలవేళ చెప్పారు. రాష్ట్రంఅభివృద్ధి చెందాలంటే తనకుమారుడు జగన్ ముఖ్యమంత్రి కావాలనికూడా ఆమెచెప్పారు. ప్రజల బతుకులు మారాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని విజయమ్మ చెప్పారు.
గతంలో తనమామ రాజారెడ్డిని చంపారని, ఇప్పుడేమో (2019 ఎన్నికలవేళ) తనమరిది వివేకానందరెడ్డిని చంపారని, చంద్రబాబునాయుడు విచారణజరిపించడంలేదని కూడా విజయమ్మగారు ఎన్నికలప్రచారంలో చెప్పారు. అవ్వాతాతలకు రూ.3వేల పింఛన్ రావాలన్నా, రాజన్నరాజ్యం రావాలన్నా, ఇసుక, మట్టి, బొగ్గు కుంభకోణాల్లో టీడీపీవారు చేస్తున్న అవినీతిపోవాలన్నా, పోలవరం ప్రాజెక్ట్ పూర్తికావాలన్నా, అమరావతి అభివృద్ధి చెందాలన్నా, రైతుబీమా పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలన్నా, డ్వాక్రా మహిళలకు రుణాలు కావాలన్నా, రాబోయే 5ఏళ్లలో మద్యనిషేధం జరగాలన్నా తన కుమారుడికి ఓటేయాలని విజయమ్మగారు ప్రచారం చేశారు. ఉద్యోగాలురావాలంటే, వ్యవసాయం పండగ కావాలంటే, రాష్ట్రంలో రాక్షసరాజ్యం పోవాలంటే తన అన్న జగన్ రావాలని షర్మిల ప్రచారం చేసింది. ఆనాడు అమ్మా, కూతుళ్లిరువురూ వారి మాటలతో ప్రజలను మోసగించింది నిజంకాదా?
మరి నేడు రాష్ట్రమంతా ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు తెలియచేస్తేంటే జగన్మోహన్ రెడ్డి పోలీస్ రాజ్యాన్ని నడుపుతున్నాడనే విషయం విజయమ్మకు తెలియదా? యువత ఉద్యోగాలకోసం చేస్తున్న ధర్నాలు, ఆందోళనలు ఆమెకు కనిపించడంలేదా? అన్నవస్తేనే ఉద్యోగాలు వస్తాయన్న షర్మిలమ్మ, నేడు ఏపీలోని నిరుద్యోగుల ఆందోళలనలపై ఎందుకు స్పందించడం లేదు? రాష్ట్రం ఆర్థికవ్యవస్థలో కొట్టుమిట్టాడుతుంటే, ఒక్కరికీ ఉద్యోగం రాకపోతే, విజయమ్మ , షర్మిలలు స్పందించరా? తల్లిగా విజయమ్మకు కుమారుడిని మందలించాల్సిన బాధ్యత, అతని తప్పులను సరిదిద్దా ల్సిన బాధ్యత లేదా? రాష్ట్రప్రజలందరూ ఇబ్బందులుపడుతుంటే, కుమారుడికి బుధ్దిచెప్పాల్సిన బాధ్యత విజయమ్మకు లేదా? తప్పుచేసిన కుమారుడి చెంపలువాయించి, అతన్ని సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత విజయమ్మగారికి లేదా?
మండుటెండలో తిరిగి తాముహామీలిస్తే , నువ్వుఇలా చేయడమేంటన్నా, విద్యార్థులకు ఉచితంగా విద్యనందిస్తాను అన్నావు.. ఇప్పుడిలా చేస్తావేంటని షర్మిలమ్మ తన అన్నను అడగరా? అడగాల్సిన బాధ్యత ఆమెకు లేదా? లేని దిశాచట్టాన్ని ఉన్నట్లుగా తనఅన్నప్రజలను మాయచేస్తుంటే, ఆడబిడ్డలను మోసగిస్తుంటే, షర్మిలమ్మ స్పందిం చరా? తనమరిదిని ఎవరు చంపారో విజయమ్మ గారికి తెలియదా అని తాను ప్రశ్నిస్తున్నాను. ఆమె తన గుండెలమీద చెయ్యేసి, ప్రమాణం చేసిమరీ, వివేకానందరెడ్డిని చంపిందెవరో తనకు తెలియదని చెప్పగలరా? ఎవరి ప్రమేయంతో ఆయన హత్య జరిగిందో తెలియదని చెప్పగలరా? వివేకా హత్యకేసు విచారణలో జాప్యం జరగడానికి, పూర్తికాకపోవడానికి, తనకుమారుడు వేసిన కుప్పిగంతులే కారణమని విజయమ్మగారికి తెలియదా? వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో సీబీఐ విచారణకావాలనికోరిన నువ్వే, ఎందుకు మరలా హైకోర్టులో వేసిన పిటిషన్ ఎందుకు వెనక్కు తీసుకున్నావని విజయమ్మ, తనకుమారుడిని ఎందుకు నిలదీయలేదు?
కుటుంబ సంప్రదాయాల పట్ల, విజయమ్మకు, ఆమె బిడ్డలకు గౌరవముందా అన్నదే తనసం దేహం. కుటుంబవ్యవస్థ ఔన్నత్యం, బంధాలు, అనుబంధాలు విజయమ్మగారికి, ఆమె కుటుంబానికి పట్టవా అని తాను ప్రశ్నిస్తున్నాను. మాట్లాడితే ప్రతిదానికీ తనకుటుంబం, రాజశేఖర్ రెడ్డి కుటుంబం అని ఆమెఅంటూఉంటారు. ఆమె, ఆమె కుమారుడు కుటుంబానికి, కుటుంబసభ్యులకు ఎలాంటి విలువఇస్తారో ప్రజలు కూడా తెలుసుకోవాలన్నదే తనఉద్దేశం. తన పెళ్లిరోజు వేడుకలు జరుపుకోవడానికి సిమ్లా వెళ్లిన ముఖ్యమంత్రి, తనతల్లిని, చెల్లిని తనతోపాటు రమ్మని ఎందుకు పిలవలేదు? వివేకానందరెడ్డి కూతురు సునీత న్యాయంకోసం ఢిల్లీవీధుల్లో తిరుగుతూ విలపించినప్పుడు విజయమ్మగారి తల్లి హృదయం ఏమైంది?
ఆనాడు సునీతకుఎందుకు న్యాయం చేయవని ఆమె తనబిడ్డ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేకపోయారు? తనబిడ్డ అమరావతి వద్దు, మూడురాజధానులే ముద్దని చెబుతుంటే, అతనికి బుద్ధిచెప్పాల్సింది విజయమ్మగారు కాదా? రాజశేఖర్ రెడ్డి కుటుంబం గురించి పదేపదే చెప్పే, విజయమ్మ తనకుటుంబంలోని వారి నిర్వాకాలపై ఏం సమాధానం చెబుతారు? రాజశేఖర్ రెడ్డి గారు మరణించినప్పుడు, తనకుమారుడు తెల్లకాగితాలు తీసుకొని సంతకాలకోసం వెంపర్లాడినప్పుడు అతన్ని విజయమ్మ ఎందుకు మందలించలేదు? అలాంటి మానసికస్థితి ఉన్న తనకుమారుడిని విజయమ్మగారు ఆనాడే మందలిస్తే, వివేకాహత్యకేసు విచారణ నేడుపక్కదారి పట్టేదా? ఆనాడే ఆమె తనకుమారుడిని సరైన దారిలో పెట్టిఉంటే, అసలు వివేకానందరెడ్డి హత్యజరిగేదా? విలువలు, విశ్వసనీయతలకు ఓటేయాలని చెప్పిన విజయమ్మగారు, తనకుమారుడు వాటికి పెద్దపీట వేశాడంటే ఇప్పుడు ఎవరైనా నమ్ము తారా? తనకుమారుడి దగ్గర లేని విశ్వసనీయత, నైతిక విలువలను ఉన్నట్టుగా చూపించి విజయమ్మ, షర్మిల ప్రజలను మోసగించింది నిజంకాదా?
విజయమ్మ, షర్మిల చెప్పినవన్నీ నమ్మే, ప్రజలు గతఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని నమ్మారు. ఆనాడు అలాచెప్పి, ప్రజలను మోసగించిన తల్లీకూతుళ్లిద్దరూ, నేడు వారిబిడ్డ, వారిఅన్న ప్రజలను పెడుతున్న బాధలపై ఏంసమాధానంచెబుతారు? ముఖ్యమంత్రి గారి తల్లీ, చెల్లి తక్షణమే విజయవాడ ధర్నా చౌక్ కి వచ్చి, అక్కడే ప్రజల తరుపున, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తనకుమారుడు, తన అన్న ప్రజలను మోసగించాడు కాబట్టి, వారు తక్షణమే ప్రజలకోసం ధర్నాకు పూనుకోవాలి. తానెవరికీ వ్యతిరేకిని కాను. విజయమ్మగారు ఒక పార్టీకి గౌరవఅధ్యక్షురాలిగా ఉన్నారు కాబట్టే, నేడు ఆమెను తాను ప్రశ్నిస్తన్నాను. అదే ఆమె సాధారణ గృహిణిగా ఉంటే తాను స్పందించేవాడినికాను. కుటుంబం అంటూ విజయమ్మ, షర్మిలలు ప్రజలను గతంలో మోసగించిన వైనాన్నే తాము తప్పుపడుతున్నాం.
వారిద్దరూ జగన్మోహన్ రెడ్డికి లేనివి ఉన్నట్టుగా చూపించి ప్రజలను మోసగించారు. వారు చెప్పినవి జగన్ కు ఉండి ఉంటే, ఆయన ముఖ్యమంత్రి అయినవెంటనే తనబాబాయి హత్యకేసు విచారణపై సీబీఐ విచారణ జరిపించేవాడు. ఇవేవీ జరగలేదు కాబట్టే, విజయమ్మ, షర్మిలలు ఇద్దరూ అవసరమైతే జగన్మోహన్ రెడ్డి అడ్డు పెట్టుకునే పోలీస్ లాఠీలకు ఎదురొడ్డిమరీ, రాష్ట్రప్రజలకోసం పోరాడాలి. రైతే రాజని చెప్పి వారిని జగన్మోహన్ రెడ్డి మోసగించినందుకు, దళితబిడ్డలకు విద్యను దూరంచేసినందుకు, మహిళలను మోసగించినందుకు, విజయమ్మ, షర్మిలలు చెప్పినవి ఆయన అమలుచేయనందుకు నిరసనగా వారు తక్షణమే విజయవాడ ధర్నాచౌక్ లో నిరసనకు దిగాలి. వారు ఆపనిచేస్తే, వారితోపాటు తాముకూడా నిరసనలో కూర్చుంటాము. విజయమ్మ, షర్మిలలు రోడ్డుపైకి వస్తేనే జగన్మోహన్ రెడ్డికి జ్ఞానోదయం అవుతుంది.
తన కుటుంబం.. తమ కుటుంబం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి తన వివాహ రజతోత్సవవేడుకలకు తనతల్లిని, చెల్లిని ఎందుకు పిలవలేదు? వారిద్దరూ ఆయన ముఖ్యమంత్రి కావడానికిఎంతో కష్టపడ్డారు కదా.. వారిని తీసుకెళితే, ఆయనకు వచ్చిన నష్టమేమిటి? నిన్న ఆపనిచేయ కుండా నేడు తల్లిని, చెల్లిని ఆలింగనం చేసుకుంటున్నాడంటే, జగన్మోహ న్ రెడ్డి మరలా ఏదో కొత్తమోసానికి సిద్ధమవుతున్నాడనే అనుకోవాల్సి ఉంటుంది. ఏ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి తల్లి, చెల్లీ వాగ్ధానాలు ఇచ్చారో, ప్రజలను మోసగించారో, అవేవీ ఆచరణలో అమలుకానప్పుడు వారికి అన్న, బిడ్డ అయిన వ్యక్తిని నిలదీయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆలాచేయకుంటే విజయమ్మగారు తల్లిగా ఓడిపోయారనే తాము అనుకోవాల్సి ఉంటుంది.

LEAVE A RESPONSE