– బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామ్ చందర్ రావు
హైదరాబాద్: నాగోల్ సమీపంలోని కుంట్లూరు గ్రామంలో ఉన్న శ్రీ వేదవ్యాస పాఠశాల ట్రస్ట్ ను శుక్రవారం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రామ్ చందర్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో, అధ్యాపకులతో ముచ్చటించారు. వేదవిద్య పిల్లలలో కేవలం జ్ఞానం మాత్రమే కాకుండా ధర్మబద్ధత, దేశభక్తి, సాంస్కృతిక విలువలను కూడా పెంపొందిస్తుంది. సమాజ వృద్ధి, భవిష్యత్ భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని రామ్ చందర్ రావు అభిప్రాయపడ్డారు.
వేద విద్య సమాజానికి నైతిక బలం, దేశానికి సాంస్కృతిక గర్వం, విద్యార్థులకు దేశభక్తి దారిదీపం అవుతుందని పేర్కొన్నారు. సాధారణంగా మేం తెల్లవారుజాము లేవగానే ప్రజల సమస్యలు, కార్యకర్తల ఇబ్బందులు వింటూ రాజకీయ జీవితంలో ఉంటాం. కానీ ఇక్కడకు రాగానే మన వేద సంపద, సంస్కృతి, ధర్మంలో ఉన్నట్టు అనిపిస్తోంది. ఇది ప్రత్యేకమైన అనుభవం, చాలా తక్కువ మందికి మాత్రమే లభించే అదృష్టం. పూర్వజన్మ సుకృతంగా భావించాల్సిన అదృష్టంగా చెప్పారు.
భారతదేశం గొప్ప దేశంగా ఎదగడంలో ప్రధాన కారణం ఇక్కడి వేద సంపద. నలందా, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాల కాలంలోనూ వేద సంపద దేశాభివృద్ధికి కేంద్రంగా నిలిచింది. ప్రస్తుత తరం వాటిని మరచిపోతున్న తరుణంలో.. మేం వేద పాఠశాలల్లో విద్యార్థులను దేశానికి, సంస్కృతికి ప్రతిబింబంగా, భవిష్యత్తులో భారతదేశ పరిరక్షణలో కీలక పాత్ర పోషించేలా మారుస్తున్నామని గర్వంగా చెప్పవచ్చని రామ్ చందర్ రావు అన్నారు.