Suryaa.co.in

Telangana

“దొంగే దొంగ దొంగ అన్నట్టుంది“ కేటీఆర్ తీరు

– విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్ రెడ్డి

దేవతల పేరుతో రాజకీయం చేయవద్దు అంటున్న కేటీఆర్ చేస్తున్నది ఏమిటి ..? మతాల పేరుతో కొట్టుకోమ్మని ఏ దేవుడు చెప్పాడని ప్రశ్నించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామరావు తీరు చాలా గర్హనీయంగా ఉంది. దొంగే దొంగ దొంగ అన్న చందంగా కెటీఆర్ ప్రవర్తన ఉందని విశ్వహిందూ పరిషత్ ఆరోపిస్తోంది. ప్రశాంతమైన భాగ్యనగరంలో చిచ్చు పెట్టింది ముమ్మాటికి కేటీఆరేనని స్పష్టం చేస్తోంది. కేటీఆర్ మనసునిండా హిందుత్వంపై విద్వేషం ఉన్నందునే మునావర్ ఫరూఖీ షో కు అనుమతిచ్చాడని ఆరోపించింది.

శ్రీరాముడు.. సీతామాత.. హనుమంతుడి పై విషం చిమ్మే కామెడీ తో హిందువుల మనోభావాలు గాయపరిచే స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ షో ను దేశంలోని అన్ని రాష్ట్రాలు బహిష్కరించాయి. కానీ తెలంగాణలో మాత్రం కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని.. మూడు వేల మంది పోలీసులను మోహరించి, హిందువులను తిట్టే కార్యక్రమం నిర్వహించడంలో సఫలీకృతమయ్యారు. వారి మిత్రపక్షమైన ఎంఐఎం మెప్పుకోసం హిందువులపై దాడులు చేయిస్తున్నారు. కానీ మళ్లీ దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని.. మతాల పేరుతో కొట్టుకోమ్మని ఏ దేవుడు చెప్పారని కేటీఆర్ గారు ప్రశ్నించడం నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తున్నట్టు కనిపిస్తోందన్నారు.

భాగ్యనగర్ లో గణేష్ ఉత్సవాల సందర్భంగా గొడవలు సృష్టించేందుకు ప్రధాన కారణం కేటీఆర్నని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి, కార్యదర్శి పండరినాథ్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి విమర్శించారు. హిందువులపై అసహనం పెంచుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హిందువుల పండుగ లపై అడుగడుగున ఆంక్షలు విధిస్తోందని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రస్తుతం ఢిల్లీలో కూడా మునావర్ ఫరూఖీ కార్యక్రమం నిర్వహించడానికి ప్రయత్నిస్తే… అక్కడ విశ్వహిందూ పరిషత్ ఫిర్యాదు మేరకు ఢిల్లీ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని రద్దు చేసిందని గుర్తు చేశారు. మైనార్టీల ఓట్ల కోసం, మెజార్టీ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్న కేటీఆర్… ప్రస్తుత భాగ్యనగర్ పరిస్థితికి బాధ్యత వహించాలన్నారు.

అసలు మునావర్ కార్యక్రమానికి అనుమతి ఇచ్చి ఉండకుంటే ఇంతటి పరిస్థితి నెలకొనేదే కాదని.. దీనికంతటికి కేటీఆరే కారణం అని ఇటీవల సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్ అయిన విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలని వారు సూచించారు. రాజకీయాలు రాజకీయంగా చేసుకోవాలి కానీ.. హిందూ దేవుళ్ళ పేరుకు రావద్దని విశ్వహిందూ పరిషత్ హెచ్చరించింది.

LEAVE A RESPONSE