– అర్జీలు స్వీకరించిన మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, డోలా బాలవీరాంజనేయ స్వామి
మంగళగిరి: తెలుగుదేశంపార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రతిరోజు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మీకోసం కార్యక్రమానికి గురువారం వినతులతో వైసీపీ బాధితులు, ప్రజలు పోటెత్తారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాలవీరాంజనేయ స్వామి, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబులు రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకుల నుండి అర్జీలు స్వీకరించారు. గురువారం నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి దాదాపు 100కు పైగా ఫిర్యాదులు వచ్చాయి.
భూ సమస్యలు, లా అండ్ ఆర్డర్ కు సంబంధించిన సమస్యలు అత్యధికంగా ఉన్నాయి. అర్జీదారుల నుండి మంత్రులు వినతి పత్రాలు తీసుకుని, వారి సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలకు సంబంధించి మంత్రులు సంబంధిత అధికారులకు అక్కడికక్కడే ఫోన్లు చేసి పరిష్కరించాలని ఆదేశించారు. మిగిలిన వినతిపత్రాలను సంబంధిత శాఖ అధికారులకు పంపించి, వాటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా మాచర్ల నియోజకవర్గానికి చెందిన బత్తుల లక్ష్మి అనే మహిళ మాచర్ల పట్టణంలో ఉన్న తన 33 సెంట్ల స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అనుచరులు కబ్జా చేశారని ఆ స్థలం తనకి ఇప్పించాలని కోరారు.మంగళగిరి నియోజకవర్గం నూతక్కి గ్రామానికి చెందిన తోట నాగమణి అనే 64 ఏళ్ల వృద్ధురాలు.. తన చిన్న కుమారుడు ఆస్తి, నగలు లాక్కొని ఇంటి నుంచి తనను వెల్లగొట్టాడని, ఇంటి వైపు వస్తే చంపుతానంటూ బెదిరిస్తున్నాడని వాపోయింది. తన ఆస్తి నగలు ఇప్పించి తన కుమారుడి నుంచి రక్షణ కల్పించాలని వేడుకుంది.
నెల్లూరు జిల్లా కోవూరు మండలం బుడంపాడు గ్రామానికి చెందిన సురేష్ బాబు అనే వ్యక్తి.. వైసీపీ ప్రభుత్వoలో కుట్రపూరితంగా రోడ్డు ప్లానింగ్ మార్చి తన స్థలంలో రోడ్డు వేశారని, స్థానిక వైసీపీ నేతలతో పాటు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా అన్ని ఫిర్యాదులు పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని ఫిర్యాదుదారులకు మంత్రులు హామీ ఇచ్చారు.