– పురందేశ్వరి సొంత పోలింగ్ బూత్ ఓట్లపై విజయసాయి ట్వీట్
– ఆ బూత్‌లో బీజేపీకి ఆరు ఓట్లే వచ్చాయని ట్వీట్
– అసలు ఆ బూత్ కారంచే డుది కాదని బీజేపీ నేత ఎదురుదాడి
– కొల్లవారిపాలెం బూత్ అంటూ యార్లగడ్డ రాంకుమార్ కౌంటర్
– ఇప్పటికే విజయసాయిపై బిక్కిన విశ్వేశ్వరరావు వరస ఎదురుదాడి
– తప్పుడు సమాచారంతో ఇరుక్కుపోయిన విజయసాయి
( మార్తి సుబ్రహ్మణ్యం)
రాజకీయాల్లో ప్రత్యర్ధులపై మాటల దాడులు చేసే నేతలు జాగ్రత్తగా ఉండాలి. లెక్కా-డొక్కలతో సిద్ధంగా ఉండాలి. ప్రధానంగా గణాంకాలు సిద్ధం చేసుకోవాలి. రుజువులు-ఆధారాలతో దాడి చేసే ముందు అన్నీ పక్కాగా ఉండాలి. లేకపోతే అది మిస్ ఫైరయి, వారినే ఆగం పట్టిస్తుంది. సవాలుకు జవాబు లేకుండా చేస్తోంది. ఇప్పుడు ఏపీ బీజేపీ అధినేతి పురందేశ్వరిపై.. గత కొద్దికాలం నుంచి శరపరంపరగా విమర్శల దాడి చేస్తున్న, వైసీపీ పార్లమెంటరీపార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డిదీ అదే సంకట పరిస్థితి.
వైసీపీలో నెంబర్‌టూగా ఉన్నారని భావిస్తున్న ఎంపి విజయసాయిరెడ్డికి రాజకీయ ప్రత్యర్ధులపై దాడి చేయడంలో ఘనాపాఠి అన్న పేరుంది. ప్రత్యర్ధులను మానసికంగా, నైతికంగా తన మాటలతో కుంగదీయడంలో వేణుంబాక బహు నేర్పరి అన్న పేరుంది. తన వద్ద ఉన్న సమాచారం, గణాంకాలతో విచ్చలవిడిగా మాటల దాడి చేసే విజయసాయి… గత కొంతకాలం నుంచీ బీజేపీ అధినేత్రి పురందేశ్వరిపై శరపరంపరగా ట్వీట్ల దాడి చేస్తున్నారు.
భాజపాలో ఉన్న టీడీపీ ఏజెంటు అని నేరుగానే ఆమె పై ముద్ర వేస్తున్నారు. ఏ పార్టీలో ఉన్నా మరిది చంద్రబాబు కోసం పనిచేస్తూ.. ‘బావ’సారూప్యతతో పనిచేసే నాయకురాలన్న వ్యంగ్యాస్త్రాలతో అప్రతిష్ఠపాలు చేస్తున్నారు. ప్రధానంగా ఆమె ఇమేజ్‌ను డ్యామేజీ చేసే పని సీరియస్‌గానే మొదలుపెట్టారు.
అందులో భాగంగా.. గత ఎన్నికల్లో పురందేశ్వరి సొంత నియోజకవర్గమైన ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గం కారంచేడు నియోజకవర్గంపై విజయసాయి దృష్టి సారించారు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికి పురందేశ్వరి పోలింగ్ బూత్‌లో కేవలం ఆరు ఓట్లు మాత్రమే వచ్చాయంటూ విజయసాయి చేసిన ట్వీట్ సంచలనం సృష్టించింది. ఆ మేరకు ఆయన.. పురందేశ్వరి ఉండే పోలింగ్‌బూత్ నెంబర్145కు సంబంధించిన ఓట్ల వివరాలు ట్వీట్ చేశారు. ఫవితంగా.. ఆమెకు సొంత గ్రామం.. సొంత పోలింగ్ బూత్‌లోనే ఠికాణా లేదని చెప్పడమే విజయసాయి లక్ష్యంగా స్పష్టమైంది.
దానితోపాటు ‘‘ కారంచేడు 145వ పోలింగ్ బూత్‌లో బీజేపీకి పడిన 6 ఓట్లలో అసలు పురందేశ్వరి గారి ఓటు ఉందా? మీ సొంత బీజేపీ అభ్యర్ధికి రాష్ట్ర అధ్యక్షులు ఓటు వేయలేదా? మీ బావ పక్షాన పక్షపాతివై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీకు కంటగింపు అయిపోయింది. బీజేపీ లాంటి సిద్ధాంతం ఉన్న పార్టీలో, సిద్ధాంతాలు గాలికొదిలిసే మీరు ఎన్ని రోజులు ఉంటారు? గట్టిగా మాట్లాడితే మా ఓటు అక్కడ లేదు, వైజాగ్‌లోనో, రాజంపేటలోనో ఉండిపోయింది అని బొంకుతారు మళ్లీ’’ అంటూ పురందేశ్వరిని ఎకసెక్కాలాడుతూ చేసిన ట్వీట్, పురందేశ్వరి పరువు తీసింది. అంటే ఆమెకు సొంత ఊరు, సొంత పోలింగ్ బూత్‌లోనే దిక్కులేదన్నది, విజయసాయి కవి హృదయంగా అర్ధమవుతుంది.
విజయసాయి ట్వీట్‌పై బీజేపీ వెంటనే ఎదురుదాడికి దిగింది. ఆ పార్టీ సీనియర్ నేత యార్లగడ్డ రాంకుమార్, పరుచూరు నియోజకవర్గంలోని కారంచేడు బూత్ నెంబర్లను విడుదల చేశారు. అందులో విజయసాయి చెప్పిన బూత్‌నెంబర్ 145 కారంచేడు గ్రామంలోనిది కాదని, అది కొల్లవారిపాలెం గ్రామంలోని బూత్ నెంబరంటూ ఆ జాబితా విడుదల చేశారు.
దానితోపాటు.. ‘‘నువ్వు చెప్పింది అంతా సొల్లు. 145వ పోలింగ్ బూత్ కారంచేడు కాదు. కొల్లవారిపాలెం. కారంచేడు బూత్ నెంబర్లు 167 నుంచి 178 వరకే. తెలంగాణలో నీ వైసీపీ లేదు. చెల్లి పార్టీ పోటీలో లేదు. మరి నీ ఓటు ఎవరికి? నీ తల్లిపార్టీ కాంగ్రెస్‌కా?’’ అంటూ ఘాటైన పదజాలంతో ఎదురుదాడి చేశారు. తన వాదనకు మద్దతుగా పోలింగ్ బూత్ జాబితాను విడుదల చేశారు. దానితో విజయసాయి పాపం తనకు వచ్చిన తప్పుడు సమాచారంతో మాటలు లేక మౌనం వహించాల్సిన దుస్థితి. ఇటీవలి రాష్ట్ర నేతలైన యార్లగడ్డ రాంకుమార్, బిక్కిన విశ్వేశ్వరరావు మాత్రమే పురందేశ్వరిపై విజయసాయి చేస్తున్న మాటల దాడిపై ఎదురుదాడి చేస్తుండటం ప్రస్తావనార్హం. సోము వీర్రాజు హయాంలో నిరాదరణ-నిర్లక్ష్యానికి గురైన ఈ ఇద్దరు సీనియర్ నేతలు, ఇప్పుడు పార్టీ అధ్యక్షురాలికి రక్షణ కవచంగా నిలవడం విశేషం.