– సెంట్రల్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ అతీరా కుమార్
విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగుల విశ్రాంత జీవితం అధికంగా విజయవాడతోనే ముడిపడి వుంటుందంటూ సెంట్రల్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ అతీరా ఎస్.కుమార్ పేర్కొన్నారు. ఆటోనగర్ లోని ఒక ఫంక్షన్ హాలులో గురువారం జీఎస్టీ సూపరెంటెండెంట్ బి. శ్రీనివాసరావు ఉద్యోగ విరమణ సభ జరిగింది. ఈ సందర్భంగా అతీరా ఎస్.కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగ జీవితంలో ఎన్ని ప్రాంతాలు మారినా, చివరకు విశ్రాంత ఉద్యోగిగా విజయవాడలోనే అధికంగా స్థిరపడుతున్నారన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల నివాస కేంద్రంగా విజయవాడ మారిందన్నారు. సూపరెంటెండెంట్ శ్రీనివాసరావు తన ఉద్యోగ జీవితంలో శాఖ అభివృద్ధికి అమూల్యమైన సేవలు అందించారని కొనియాడారు. విశ్రాంత జీవితంలో శ్రీనివాసరావు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. సూపరింటెండెంట్ శ్రీనివాసరావు.. శాఖలో తన అనుభవాలు వెల్లడించారు.
అనంతరం శ్రీనివాసరావును అధికారులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల వారు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎం.నాగరాజు, గద్దె తిలక్, టి.వివేకానంద, సూర్యదేవర రమేష్ బాబు, రాజేశ్వరరావు, పి.వి.సత్యనారాయణ, ఎన్.ఎస్ నగేష్ బాబు, నవీన్ రాజు, ఆర్.పి.పి.కుమార్, శ్రీలక్ష్మి, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.