– స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రశంసల జల్లు
విజయవాడ ఉత్సవ్ కార్యక్రమంలో గురువారం సాయంత్రం పున్నమి ఘాట్ వద్ద నిర్వహించిన వేడుకల్లో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు , డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణం రాజు తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను సందర్శించి పరిశీలించారు. అక్కడి సాంస్కృతిక ప్రదర్శనలు, కళాకారుల ప్రతిభను వీక్షించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రోన్ షోను తిలకించి ఆనందించారు.
స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక వైభవం దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్న ఈ మహోత్సవం ప్రపంచంలోనే అతి పెద్ద పండుగ కార్నివల్గా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఉత్సవంలో స్థానిక కళాకారులు, పర్యాటకులు, ప్రజలు విస్తృతంగా పాల్గొని సంబరాల్లో మునిగిపోయారు. పున్నమి ఘాట్ మొత్తం దీపాలతో, సాంస్కృతిక ప్రదర్శనలతో కళకళలాడింది.