* చిన్నచిన్న కనెక్టివిటీ రోడ్లను వేయలేకపోతున్నారు
* క్షేత్రస్థాయిలో తిరిగితే పాలకులకు రోడ్ల పరిస్థితి అర్థం అవుతుంది
* తుని ప్రాంతంలో గంజాయి అక్రమ నిల్వలకు మంత్రి శ్రీ దాడిశెట్టి రాజా సహకారం
* లాటరైట్ అక్రమ తరలింపులో ఆతని పాత్రపై విచారణ చేయాలి
* యలమంచిలిలో విలేకరులతో మాట్లాడిన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్
రాష్ట్రంలో అత్యంత దౌర్భాగ్యంగా ఉన్న రోడ్డు సమస్యలను ఎంతో హుందాగా జనసేన పార్టీ ప్రభుత్వం దృష్టికి డిజిటల్ క్యాంపెయిన్ రూపంలో తీసుకువస్తే, దానిపై సమాధానం చెప్పలేని మంత్రులు బూతులతో విరుచుకుపడుతున్నారని, కనీస ప్రజాస్వామ్య విలువలు పాటించడం మరిచిపోయారని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ అన్నారు.
యలమంచిలిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ “రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి గురించి జనసేన పార్టీ పోరాటం చేస్తుంటే, సమస్యను పరిష్కరించాల్సిన పాలకులు మాత్రం బూతులతో రెచ్చిపోతున్నారు. ఒక్కసారి రోడ్డు మీదకు వచ్చి వైసీపీ నాయకులు ప్రజాప్రతినిధులు కళ్ళు తెరిచి చూస్తే రోడ్ల పరిస్థితి అర్థం అవుతుంది. యలమంచిలి రైల్వే గేట్ వద్ద రోడ్డు అత్యంత దారుణంగా గోతులు ఉన్నాయి. ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఆగిపోయింది. దానిని పూర్తి చేయమని ఎన్నిసార్లు అడిగినా, స్పందన ఉండదు గాని, పవన్ కళ్యాణ్ ఏదైనా కార్యక్రమం చేస్తే బూతులు తిట్టడానికి మాత్రం వీరు స్పందిస్తారు.
తాడేపల్లిలో కొందరికి బీపీ పెరిగింది
రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితి మీద జనసేన పార్టీ చేపట్టిన డిజిటల్ క్యాంపెయిన్ కు ఆదరణ లభించింది. దానిని చూసి తాడేపల్లిలో కొందరికి బీపీ పెరిగి, మంత్రులతో బూతులు తిట్టిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం రోడ్ల పరిస్థితిని చూడక్కర్లేదు.. అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు నిర్మాణం పూర్తయిన చిన్న కనెక్టివిటీ రోడ్డు వేయడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేక ఆ రోడ్డు అలాగే ఉండిపోయింది.
రహదారులు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజాకు నిజంగా దమ్ము ఉంటే రోడ్లు వేయడానికి గుత్తేదారులను ముందుకు పిలవండి. మీరు డబ్బులు చెల్లించడం లేదని దశాబ్దాలుగా రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు సైతం మీ ప్రభుత్వంలో పనులు చేయడానికి ముందుకు రావడం లేదు. ఇది మీకు సిగ్గుగా అనిపించడం లేదా?
అదో గంజాయి బ్యాచ్
గంజాయి అక్రమ రవాణాకు కేర్ ఆఫ్ గా మారిన దాడిశెట్టి రాజా కూడా నిజాయితీ గల జనసేన పార్టీని విమర్శించడం చూస్తుంటే, వైసిపి నాయకులు ఎంతకు దిగజారారో అర్థమవుతుంది. తుని ప్రాంతంలో గంజాయి అక్రమ నిల్వలకు సహకరిస్తున్న మాట నిజం కాదా? లాటరైట్ అక్రమ తరలింపులో అతని పాత్రపై విచారణ చేయాలి” అని సుందరపు విజయ్ కుమార్ డిమాండ్ చేశారు.