Suryaa.co.in

Andhra Pradesh

వికసిత ఆంధ్ర – వికసిత భారత్ 

-2024-25 కేంద్ర బడ్జెట్  
-పోలవరం దేశానికి ఆహార భాండాగారం 
– ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ 

అమరావతి : వికసిత ఆంధ్ర  – వికసిత భారత్ ను స్పృశించేలా కేంద్ర బడ్జెట్  ఉందని ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. ఏపీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడోసారి కుడా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేయడం అభినందనీయమన్నారు.

ఈ సందర్బంగా లంకా దినకర్ మాట్లాడుతూ.. వికసిత ఆంధ్ర దిశగా కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఆహ్వానిస్తున్నాం, ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ బడ్జెట్ ఉత్పాదకత, ఉపాధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాలు, నూతన ఆవిష్కరణలు, సంస్కరణలు అనే  తొమ్మిది అంశాలకు ప్రాధాన్యత నిచ్చారు. యువత, మహిళ, గ్రామీణ, వ్యవసాయ రంగాలకు, మధ్య తరగతి ప్రజలకు ఊతం ఇచ్చే విధంగా కేంద్ర  బడ్జెట్ ఉంది.

బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కోసం  :
రాజధాని అమరావతి నిర్మాణానికి ఈ సంవత్సరం 15000 కోట్లు రూపాయలు కేటాయించడం ఆనందదాయకం. దేశీయ విదేశీయ ఏజెన్సీల ద్వారా ఆర్థిక వనరులను రాజధాని నిర్మాణానికి సమకూరుస్తామని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. పోలవరం నిర్మాణానికి అవసరమైన పూర్తి నిధులను సమకూరుస్తామని ఆర్థిక మంత్రి తెలియజేశారు. పోలవరం దేశానికి ఆహార భాండాగారమని చెప్పటం ద్వార పోలవరం ప్రాముఖ్యతను కేంద్ర ప్రభుత్వం చాటిచెప్పింది.

ప్రకాశం జిల్లా ను  రాయలసీమ మరియు ఉత్తరాంధ్రతో కలిపి వెనకబడినటువంటి జిల్లాలుగా పరిగణించి సహాయం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి తెలియజేయడం శుభపరిణామం. కొప్పర్తి మరియు ఓర్వకల్లు పారిశ్రామిక నోడల్ అభివృద్ధి కోసం అవసరమైన నిధులు సమకూర్చడం ద్వారా రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రజలకు ఉపాధి అవకాశాలు రావడానికి ఈ బడ్జెట్ ఊతం ఇస్తుంది.  “పూర్వోదయ“ కింద తూర్పు భారతదేశ మౌలిక సదుపాయాల ( రోడ్, రైల్, ఎనర్జీ ) అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కి స్థానం కల్పించారు.

2024-25 బడ్జెట్ వికసిత భారత్ దిశగా అడుగులు

యువత కోసం :  
₹2 లక్షల కోట్ల వ్యయంతో 5 సంవత్సరాలలో 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం మరియు ఇతర అవకాశాలను సులభతరం చేయడానికి 5 పథకాలు రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ద్వారా నడుం బిగించింది. 500 అగ్రశ్రేణి సంస్థల్లో కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పనకు ప్రణాళిక. విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి ₹1.48 లక్షల కోట్లు బడ్జెట్లో  కేటాయించారు. దేశీయ సంస్థలో ఉన్నత విద్య కోసం ₹10 లక్షల వరకు రుణ సహాయం అందించే పథకంతో ప్రభుత్వం ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కంపెనీలతో కలిసి ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర నిధులతో కూడిన పథకాన్ని ప్రవేశపెట్టడం ఎంబీఏ కాలేజీలకు అత్యంత ఆశాజనకంగా ఉంది.

మహిళా సాధికారత :  
మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని ప్రోత్సహించే పథకాలకు రూ. 3 లక్షల కోట్లకు పైగా కేటాయింపులు చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  తెలిపారు. వర్క్‌ఫోర్స్‌లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లతో పాటు నైపుణ్య అభివృద్ధి కోసం  ప్రభుత్వం పరిశ్రమతో జతకట్టి మహిళలకు తర్ఫీదు ఇవ్వడానికి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా, ఈ పరిశ్రమ-ప్రభుత్వ భాగస్వామ్యం మహిళల-నిర్దిష్ట నైపుణ్య కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు మహిళల నేతృత్వంలోని SHG సంస్థలకు మార్కెట్ యాక్సెస్‌ను ప్రోత్సహిస్తుంది. లాక్ పతి దీదీలుగా మహిళలను తీర్చిదిద్దెందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తుంది.

గ్రామీణ వ్యవసాయ రంగాలకు  :
వ్యవసాయ మరియు వ్యవసాయ ఆధారిత రంగానికి 1.27 లక్షల కోట్లు ఈ బడ్జెట్ లో కేటాయింపులు జరిగాయి.  ఈ బడ్జెట్లో  వ్యవసాయ మరియు గ్రామీణ పరిశ్రమల కోసం స్టార్టప్‌లకు నాబార్డ్ నిధులు సమకూర్చడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇనాం కింద 1,361 మండీల ఏకీకరణ ద్వారా రైతుల ఉత్పత్తులకు   ₹ 3 లక్షల కోట్ల  వ్యాపార నిర్వహణకు సులభతరమైంది. ఆక్వాకల్చర్ ఉత్పాదకతను పెంపొందించడం, ఎగుమతులను రెట్టింపు చేయడం మరియు మరిన్ని ఉద్యోగావకాశాలను సృష్టించడం లక్ష్యంగా ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన అమలును ముమ్మరం చేయడానికి ఈ బడ్జెట్ ఊతం ఇస్తుంది.

పీఎం కిసాన్ కింద, 11.8 కోట్ల మంది రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందుతుంది. ఇంకా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా 4 కోట్ల మంది రైతులు పంటల బీమా కవరేజీ అందిస్తుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం 86,000 కోట్లు కేటాయింపులు జరిగాయి, మొత్తం గ్రామీణ అభివృద్ధి కోసం 1.85  లక్షల కోట్లు కేటాయించారు . భారతదేశం అంతటా సగటున ఉపాధి హామీ పథకం (MGNREGA) వేతనం రోజుకు ₹28 పెంచారు.  దీంతో 2023-24 లో  ₹261 ఉన్న వేతనం 2024-25 సంవత్సరానికి సగటు వేతనం ₹289 కి పెరిగింది.

ఉద్యోగ, మధ్య తరగతి ప్రజల కోసం :
ఉద్యోగులకు ఆదాయపన్ను  జీతం నుండి మినహాయించి   స్టాండర్డ్ డిడక్షన్ ₹50,000 నుండి ₹75,000కి పెంచడం జరిగింది. ఆదాయపన్ను స్లాబులు మార్పుల వల్ల 17,500 సేవింగ్స్ కి ఆస్కారం ఏర్పడింది. పెన్షనర్లకు కుటుంబ పెన్షన్‌పై మినహాయింపు ₹15,000/- నుండి ₹25,000/-కి పెంచారు. పీఎం ఆవాస యోజన క్రింద పట్టణ గృహాలకు 2.2 లక్షల కోట్ల ప్రోత్సాహం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో 1 కోటి పట్టణ పేద మరియు మధ్య తరగతి కుటుంబాల గృహ అవసరాలను పరిష్కరిస్తామని ప్రకటించారు, ఇది ఇప్పటికి పూర్తీ చేసిన ౩ కోట్ల గృహాలకు అదనం.

చౌకగా మారిన వస్తువులు  :
ద్రవ్యోల్బణం అదుపులో ఉందని ఆర్థిక మంత్రి తెలిపారు, రాబోయే సంవత్సరంలో 4.5% కి నియంత్రణ చేయడానికి చర్యలు. మొబైల్ ఫోన్లు, మొబైల్ ఛార్జర్లపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 15 శాతానికి తగ్గించారు. మూడు అదనపు క్యాన్సర్ చికిత్స ఔషధాలకు కస్టమ్స్ సుంకం నుంచి మినహాయింపు ఇచ్చారు. సౌరశక్తికి సంబంధించిన భాగాలపై కస్టమ్స్‌ను డ్యూటీ ఉండకూడదని  ప్రభుత్వం ప్రతిపాదించింది. తోలు మరియు పాదరక్షల తయారీపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

మౌలిక సదుపాయాలు :
కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు మూలధన  వ్యయం కోసం 11,11,111 కోట్లు (జిడిపిలో 3.4%) కేటాయించింది. మౌలిక  సదుపాయాల పెట్టుబడుల్లో రాష్ట్రాలకు మద్దతుగా దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాల కోసం `1.5 లక్షల కోట్ల కేటాయించారు.

2024-25 బడ్జెట్ అంచనాలు:
రుణాలు కాకుండా మొత్తం వసూళ్లు : `32.07 లక్షల కోట్లు.
మొత్తం వ్యయం: `48.21 లక్షల కోట్లు.
నికర పన్ను వసూళ్లు : `25.83 లక్షల కోట్లు.
ఆర్థిక లోటు: జిడిపిలో 4.9 శాతం.
వచ్చే ఏడాది ద్రవ్యలోటు 4.5 శాతానికి చేరుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ద్రవ్యోల్బణం తక్కువగా, స్థిరంగా మరియు 4% లక్ష్యం వైపు కదులుతోంది; ప్రధాన ద్రవ్యోల్బణం (ఆహారేతర, ఇంధనేతర) 3.1%.

వికసిత భారత్ వైపు తొలి అడుగు ఈ బడ్జెట్, ఇంత మంచి బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి కారణమైన ప్రధాని నరేంద్ర మోడీకి, ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ లకు శుభాభివందనాలు తెలిపారు.

LEAVE A RESPONSE