– విశాఖ నుండి ఏఐ, డిజిటల్ టెక్ విప్లవానికి నాంది
– గత ప్రభుత్వ హయాంలో కంటే 16 నెలల్లోనే రికార్డు స్థాయి పెట్టుబడులు
– అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అన్ని ప్రాంతాలకు ఒక ప్రత్యేక పారిశ్రామిక గుర్తింపు
– ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర
అమరావతి : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ విశాఖలో అడుగుపెట్టడం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. పరిశ్రమల ప్రోత్సాహానికి ప్రాధాన్యం ఇస్తూ, రాష్ట్రానికి గ్లోబల్ కంపెనీలను తీసుకురావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి ఫలితమే ఇది.
హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ రాకతో ఐటీ రంగం విప్లవాత్మక మార్పు సాధించినట్లే, విశాఖలో గూగుల్ రాకతో రాష్ట్రం డిజిటల్ టెక్ రంగానికి కేంద్రంగా మారనుంది. రూ.55 వేల కోట్ల పెట్టుబడితో సౌత్ ఏషియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్‌ను గూగుల్ నిర్మించనుంది. ఇది రాష్ట్ర ప్రతిష్టను పెంచి, వేలాది మంది యువతకు ప్రపంచస్థాయి ఉద్యోగావకాశాలు కల్పించనుంది.
రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం రూపొందించిన అత్యుత్తమ పాలసీలు, సింగిల్ విండో క్లియరెన్స్, పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం కల్పించడం వంటి చర్యలు వలనే గూగుల్, టీసీఎస్, ఆక్సెంచర్ వంటి టెక్ దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి అడుగుపెడుతున్నాయి. గత ప్రభుత్వం ఐదేళ్లలో సాధించలేనంత పెట్టుబడులు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లోనే అధిగమించడం రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు , మంత్రి లోకేష్ సమర్ధనాయకత్వానికి నిదర్శనం.
అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ప్రభుత్వం అన్ని ప్రాంతాలకు ఒక ప్రత్యేక పారిశ్రామిక గుర్తింపు ఇస్తుంది. అమరావతిలో క్వాంటం వ్యాలీ, విశాఖలో ఏఐ, టెక్ హబ్, తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ హబ్, ఇవన్నీ ఏపీ అభివృద్ధికి నాంది పలకనున్నాయి.