హైదరాబాదులో సెటిల్మెంట్ .. . విశాఖపట్నంలో కిడ్నాప్ డ్రామా
ఎంపీ కొడుకు చెప్పగానే వదిలేయమంటే పోలీసులు బుద్ధి లేకుండా వదిలేస్తారా?
గంగిరెడ్డి అనే ఎర్రచందనం డాన్ తో, ఎం వివి సత్యనారాయణకు గతంలో సన్నిత సంబంధాలు
కిడ్నాపింగ్ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ
అప్పుల, అరాచక ఆంధ్ర కాస్త…ఇప్పుడు డ్రగ్, క్రైమ్ ఆంధ్ర ప్రదేశ్
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఏమో కానీ విశాఖపట్నం ని క్రైమ్ క్యాపిటల్ గా మార్చేశారు
దేశంలో గంజాయి, డ్రగ్స్ ఎక్కడ పట్టుబడిన ఆ మూలాలన్నీ ఆంధ్రప్రదేశ్ వైపే చూపిస్తున్నాయి
ఎంపీ ఎంవీవి సత్యనారాయణ హైదరాబాదులో ఎవరెవరితో సమావేశమయ్యారు?
ఆయన ఫోన్ కాల్ డాటా సమాచారం సేకరించారా?… గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా ఆధారాలు రాబట్టాలి
కిడ్నాప్ , సెటిల్మెంట్ వ్యవహారంలో మారిషస్ లో నివసించే ఎర్రచందనం డాన్ కొల్లం గంగిరెడ్డి పాత్ర ఏమిటి?
రాష్ట్రంలో క్రైమ్ తగ్గుముఖం పట్టిందని రాష్ట్ర డిజిపి అంటుంటే… క్రైమ్ కాపిటల్ గా విశాఖపట్నం అభివృద్ధి చెందుతోంది
నాలుగేళ్లుగా ఏమీ చేయని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తానే టిడ్కో ఇళ్లను నిర్మించినట్లుగా చెప్పడం హాస్యాస్పదం
విద్యుత్ వినియోగదారులపై చార్జీల భారాన్ని మోపి, తాను విద్యుత్ చార్జీలనే పెంచలేదని చెప్పిన ఘనత జగన్మోహన్ రెడ్డి దే
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
అప్పుల, అరాచక ఆంధ్ర కాస్త…ఇప్పుడు డ్రగ్, క్రైమ్ ఆంధ్ర ప్రదేశ్ గా మారిపోయింది. దేశంలో ఎక్కడ గంజాయి, డ్రగ్స్ పట్టుబడిన దాని మూలాలన్నీ ఆంధ్ర ప్రదేశ్ వైపే చూపిస్తున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా విశాఖ పట్టణాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తారో, చేయరో తెలియదు కానీ… క్రైమ్ క్యాపిటల్ గా మాత్రం మార్చేశారనడంలో సందేహం లేదు. విశాఖను క్రైమ్ క్యాపిటల్ గా చేసినందుకు మెచ్చుకోవాలో… నొచ్చుకోవాలో తెలియడం లేదు. ఏదో ఒక రాజధానిగా విశాఖ పట్టణాన్ని చేసినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అభినందిద్దామని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు.
శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మాట్లాడుతూ… రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గిపోయిందని, విశాఖపట్నంలో అసలు క్రైమ్ రేట్ అన్నదే నమోదు కాలేదని రాష్ట్ర డిజిపి పేర్కొనడం విస్మయాన్ని కలిగించింది. రాష్ట్రంలో జరుగుతున్న నేరాల గురించి పత్రికలలో వార్తా కథనాలను రాస్తున్న రాష్ట్ర డిజిపి చదివినట్టు లేదు. అందుకే ఆయనకు రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు, ఘోరాల గురించి తెలియక క్రైమ్ రేట్ తగ్గుముఖం పట్టిందని చెబుతున్నారని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.
కిడ్నాప్ కథ శుద్ధ అబద్ధం
విశాఖపట్నం ఎంపీ ఎం వి వి సత్యనారాయణ కుమారుడు, ఆయన భార్య, ఆడిటర్ కిడ్నాప్ కథ శుద్ధ అబద్ధం. సెటిల్మెంట్ కోసమే ఎంపీ కుమారుడు, భార్య, ఆడిటర్ ను అపహరించారు. హైదరాబాదులో సెటిల్మెంట్ జరిగింది. ఈ వ్యవహారం వెలుగు చూడాలంటే హైదరాబాదులో ఎంవివి సత్యనారాయణ ఎవరెవరితో సమావేశమయ్యారు . ఫోన్ లో ఆయన ఎవరెవరితో మాట్లాడారు. దానికి సంబంధించిన ఫోన్ కాల్ డాటాను పోలీసులు సేకరించారా? ఎంపీ ఫోన్ పోలీసులు సీజ్ చేశారా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.
హైదరాబాదులో ఎంపీ సెల్‌ఫోన్ ఏ టవర్ రేంజ్ పరిధిలో ఉన్నదో వివరాలు రాబట్టాలి. అలాగే గూగుల్ టేక్ అవుట్ సహాయంతో ఆధారాలను సంపాదించాలి. మారిషస్ లో నివసించే కొల్లం గంగిరెడ్డి అనే ఎర్రచందనం డాన్ తో, ఎం వివి సత్యనారాయణకు గతంలో సన్నిత సంబంధాలు ఉన్నాయట. అదే గంగిరెడ్డి కి నేటి నాయకులతో కూడా సత్సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. కొల్లం గంగిరెడ్డి పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ ని మించిన ఎర్రచందనం దొంగ. రిల్ లైఫ్ పుష్ప అల్లు అర్జున్ అయితే, రియల్ లైఫ్ పుష్ప కొల్లం గంగిరెడ్డి.
రియల్ లైఫ్ పుష్ప నేటి నాయకులతో మాట్లాడితే చోటు చేసుకున్న పరిణామమా? లేకపోతే రియల్ లైఫ్ పుష్ప నేరుగా చేసిన పరిణామమా? అని తెలియాలంటే ఎన్ఐఏ చేత సమగ్ర విచారణ జరిపించాలి. విశాఖపట్నం కిడ్నాపింగ్ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసినట్లు మీడియా సమావేశంలో రఘురామకృష్ణం రాజు, లేఖ ప్రతిని ప్రదర్శించారు. పెద్ద నాయకుల సహకారం లేకుండా ఇదంతా జరిగే అవకాశమే లేదు. అయితే నిందితులకు సహకరించిన వారు బాగా పెద్ద నాయకులా? ఇంటర్మీడియట్ నాయకులా? విశాఖ లేవల్ పెద్దలా?అన్నది మా పార్టీ మనుగడ కోసమైనా తేలాలని రఘురామకృష్ణం రాజు అన్నారు.
సెటిల్మెంట్ అని అంటున్నారు… అదంతా ఉత్తుత్తిదే
ఆస్తి తగాదాలలో భాగంగా సెటిల్మెంట్ కోసమే ఈ కిడ్నాప్ డ్రామా అని అందరూ అంటున్నారు కానీ అదంతా ఉత్తిదేనని ఎంపీ ఎంవీవి సత్యనారాయణ టీవీ9 ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. డబ్బుల కోసమే నిందితులు కిడ్నాప్ చేశారు. తన కొడుకు చాలా సింపుల్ గా ఉంటాడని, ఎక్కడ కూడా ఎంపీ కొడుకు అన్నట్లుగా వ్యవహరించరని ఎంవివి సత్యనారాయణ చెప్పుకొచ్చారు .
తన కుమారుడి చేత హేమంత్ అనే రౌడీషీటర్ పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయించి, స్టేషన్లో సంతకాలని పెట్టడానికి హేమంత్ రారని చెప్పించినట్లుగా ఎంవివి సత్యనారాయణ వివరించారు. ఎంపీ కొడుకునని ఒకరు పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయగానే, వారు ఆయన నిజంగానే ఎంపీ కుమారుడని ఎలా నిర్ధారించుకున్నారు. ఆ ఫోన్ నెంబర్ ఎంపీ కుమారుడిదేనని పోలీసులకు ముందే తెలుసా?, హేమంత్ ను ఇక్కడ వాడుకుంటున్నాం… ఆయన రాడని చెప్పే అలవాటు ఉందా?
ఏ అలవాటు లేదని చెబితే, ఎంపీ కొడుకని వెరిఫై చేయకుండా ఆయన చెప్పిన మాటలు పోలీసులు వింటారా? ఎంపీ కొడుకు చెప్పగానే వదిలేయమంటే పోలీసులు బుద్ధి లేకుండా వదిలేస్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఎంపీ కుమారుడు అలా చెప్పాడని అంటే… ఏదైనా సమస్యలో ఉండి ఉండవచ్చుననే అనుమానం పోలీసులకు రావాలి కదా? లేకపోతే తరచూ అతను ఇలాగే చెబుతూ ఉండి ఉండాలి.
తక్షణమే ఆ పోలీస్ స్టేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఈ నెల 13వ తేదీన ఎంపీ కుమారుడిని తీసుకువెళ్లారు. 14వ తేదీ ఉదయాన్నే ఎంపీ ఎంవీవి సత్యనారాయణ హైదరాబాదుకు బయలుదేరి వెళ్లారు. హైదరాబాదుకు వెళ్లే ముందు ఆయన కుమారుడి చేత మాట్లాడలేదనుకుందాం. రెండు రోజులపాటు హైదరాబాదులోనే ఉన్నారు. హైదరాబాదులోనే ఉండి తన ఆడిటర్ జీవీ తో మాట్లాడారు. జీవి మాటలలో తేడా కనిపించడంతో తనకు అనుమానం వచ్చిందన్నారు.
హైదరాబాదు నుంచి వైజాగ్ చేరుకోగానే ఆయన వెంటనే పోలీసులకు చెప్పలేదు. అయినా ఈ కేసును పోలీసులు రెండు గంటల్లోనే ఛేదించారని చెప్పడం ఆశ్చర్యకరంగా ఉంది. రెండు రోజులు ఒకే ఇంట్లో ఉన్నవారు ఒకరిని కారు డిక్కీలో మరొకరిని కారు సీట్లో పెట్టుకుని, ఎంపీ భార్యను ఎక్కడ కూర్చోబెట్టారో చెప్పలేదు. ఆవిడ్ని ఇంట్లోనే వదిలేశారా? ఈ కహాని అంతా అతుకులు, గతుకులుగా ఉంది. ఎంపీ సత్యనారాయణ హైదరాబాదుకు వెళ్తే ఆయన కుమారుడిని అపహరించిన వారు, ఎంపీ భార్యను, ఆడిటర్ ను పిలిపించారు. వీళ్లు కూడా డ్రైవర్లు లేకుండానే వారు పిలిపించిన స్థలానికి ఎందుకు వెళ్లారు.
ఆ ఇంట్లో పనిమనిషి లేదా?, వాచ్ మెన్ ను వెళ్లిపోమంటే, మరొక వాచ్మెన్ ఎందుకు రాలేదన్న ప్రశ్నలకు సమాధానం లేకుండా పోయింది. హైదరాబాదులో సెటిల్మెంట్ జరిగింది. విశాఖపట్నంలో కిడ్నాప్ డ్రామా నడిపించారు. చివరకు పోలీసులు ఛేదించి పట్టుకున్నట్లుగా సీన్ క్రియేట్ చేశారని రఘురామకృష్ణం రాజు తెలిపారు .
ఎక్కడ నుంచి నిందితులకు ఇంత ధైర్యం వస్తోంది?
తన సోదరిని వేధిస్తున్న వారిని అడ్డగించిన పదవ తరగతి చదివే 15 ఏళ్ల బాలుడిని, వెంకటేశ్వర రెడ్డి అనే కిరాతకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు . ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా చెల్లి నా చెల్లి అంటారు. కానీ రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి. పులివెందుల లో నగర బహిష్కరణ చేసిన ఒక దళితుడు తిరిగి నగరంలో అడుగుపెట్టినందుకు చంపేశారు.
నిందితుల కింత ధైర్యం ఎక్కడ నుంచి వస్తోంది.తాను ఇన్చార్జ్ డిజిపిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గిందని రాజేంద్రనాథ్ రెడ్డి చెబుతున్నారు. ఈ సంఘటనలు రాష్ట్రంలోని పోలీసు వ్యవస్థ వైఫల్యానికి సంకేతం కాదా?, ఆకురౌడీలకు ఎందుకంత ధైర్యం వచ్చింది? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో మంత్రి బంధువునని చెప్పుకునే వారు ఏదో చేశారని తెలుస్తోంది.
విశాఖపట్నంలో 1 శాతం సెటిల్మెంట్స్ సర్వసాధారణమయ్యాయి. ఈ వ్యవహారాలలో మా పార్టీ కీలక నాయకుడి అల్లుడు, అల్లుడి సోదరుడు ప్రమేయం ఉంది. అదే విషయాన్ని ఎవరైనా ప్రస్తావిస్తే మా అల్లుడిది పెద్ద కంపెనీ వ్యాపారం చేసుకోవద్దా అంటూ మా పార్టీ కీలక నాయకుడు ఒకరు వ్యాఖ్యానిస్తారు.
ప్రపంచంలో ఎక్కడా కూడా వ్యాపారం చేసుకునే అవకాశాలు లేనట్లుగా విశాఖపట్నంలోనే వారు రియల్ ఎస్టేట్, మద్యం, అంబులెన్స్‌ల వ్యాపారం చేయాలా అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.
ఏలూరులో ఒక అమ్మాయి పై యాసిడ్ దాడి జరిగింది. ముఖ్యమంత్రి ఇంటికి అర కిలోమీటర్ దూరంలోనే యువకులు గంజాయి సేవిస్తున్నారు. పోలీసులు పోలీసింగ్ చేయడం లేదు. ముఖ్యమంత్రి బందోబస్తు కోసం వేలాదిమంది పోలీసులను వినియోగిస్తున్నారు. ముఖ్యమంత్రేమో అబద్దాలను ప్రచారం చేయడానికి ఊర్లను తిరుగుతున్నారు. ఆయన సేవలో పోలీసులు తరిస్తున్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ, దాడులు చేస్తున్నారు.
సిఐడి పోలీసుల వద్దకు వచ్చే కేసులను పరిష్కరించకుండా, పాలకుల కక్ష సాధింపు చర్యలలో భాగమవుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలి. రాష్ట్రంలో క్రైమ్ రేట్ గణనీయంగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నప్పటికీ, రాష్ట్ర డిజిపి మాత్రం క్రైమ్ రేట్ తగ్గుముఖం పట్టిందని చెప్పడం సరికాదని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
టిడ్కో ఇల్లు జగన్మోహన్ రెడ్డి కట్టారనేది పచ్చి అబద్ధం
గుడివాడలో టిడ్కో ఇళ్ళను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్మించారనేది పచ్చి అబద్ధం. ఈ విషయము అందరికీ తెలుసు. నాకు కూడా తెలుసు. గుడివాడలోని టిడ్కో ఇళ్ల కు పాత రంగులు ఉన్నప్పుడు అందరూ చూసినవారే. గత నాలుగేళ్లుగా టిడ్కో ఇళ్ల నిర్మాణం కోసం ఏమీ చేయని జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు టిడ్కో ఇండ్లను ప్రారంభిస్తున్నారన్నారు.
టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్న ఎమ్మెల్యేలు ప్రశంసిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి తానే ఇండ్లను నిర్మించినట్లుగా సిగ్గుపడుతూ అభినయించడం హాస్యాస్పదంగా ఉంది. ఈ నాలుగేళ్లలో కేవలం 5 ఇండ్లను మాత్రమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మించింది అని పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి చెప్పారు.
అబద్ధాలు చెప్పడానికి మీ దగ్గరకు జనం వస్తారని వారిని నమ్మవద్దని కోరుతున్నా జగన్మోహన్ రెడ్డి, తాను చెబుతున్నవన్నీ అబద్ధాలేనని విమర్శించారు. మధ్య నియంత్రణ చేశామని, అమ్మకాలు తగ్గాయని, ఆదాయం పెరిగిందని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు.
మద్యంపై ఆదాయం పెరిగిందంటే మూడు రెట్లు అదనంగా బాదుతున్నారు. ప్రజలను సర్వనాశనం చేసినట్లుగా వారే పరోక్షంగా అంగీకరిస్తున్నారు. ఇక్కడ అమ్మకాలు తగ్గాయి… తెలంగాణలో పెరిగాయి. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుంచి మద్యం ను కొనుగోలు చేసి కొంతమంది మా పార్టీ నాయకులే గ్రామ గ్రామాన తెలంగాణ బ్రాండ్లను విక్రయిస్తున్నారు. మద్యం అమ్మకాలను నగదులో విక్రయిస్తూ, 2000 నోట్లను మార్చుకోవడానికి వాడుకుంటున్నారు.
మధ్య నియంత్రణ అని చెప్పి జనాలను దోచుకుంటున్నారు. ఈనాడు దినపత్రిక, ఛీనాడు అని సంబోధిస్తూ, తాను విద్యుత్ చార్జీలను పెంచలేదని జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం విడ్డూరంగా ఉంది. తాను విద్యుత్ చార్జీలను పెంచలేదని, ఎక్కువ ధరకు విద్యుత్ ను కొనుగోలు చేస్తే వాటిని మాత్రమే వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారని పేర్కొనడం విస్మయాన్ని కలిగిస్తోంది. గతంలో 1200 రూపాయల విద్యుత్ చార్జీలు వచ్చే ఇంటికి, ప్రస్తుతం 6000 రూపాయల విద్యుత్ చార్జీలు వస్తున్నాయి. ఇలా అబద్ధాలు చెప్పి నమ్మించాలని చూస్తే, ఎన్నికల ముందు ప్రజలు వాత పెట్టడం ఖాయమని రఘురామకృష్ణంరాజు అన్నారు.
వ్యక్తిగత విమర్శలు హేయం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆయన సామాజిక వర్గ నేతలతో విమర్శలు చేయించే దానిలో భాగంగా దాడిశెట్టి రాజా మాట్లాడించారు. రాజకీయ నేతలు మాట్లాడే మాటలు చూస్తేనే ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని ఉద్దేశించి బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి లోఫర్… బ్రోకర్ అని సంబోధించడం సిగ్గుచేటు.
ఈ విధంగా మాట్లాడిస్తున్న వారి పట్ల ప్రజలలో అసహ్యం పెరుగుతుంది. ఒక స్థాయి ఉన్న నాయకులను తిట్టించి, ఆనందం పొందడం కొంతమందికి అలవాటుగా మారింది. జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా లోఫర్… బ్రోకర్ అంటే పోలీసులు చర్యలు తీసుకురా?
మన నాయకుడిని బ్రోకర్, లోఫర్ అంటే నేనే కూడా ఊరుకోను. దేశస్థాయిలో విశిష్టత కలిగిన చంద్రబాబు నాయుడు పై వ్యక్తిగతంగా దాడి చేయడమే కాకుండా, మనపై ఎవరైనా విమర్శలు చేస్తే మా అభిమానులు ప్రతిస్పందిస్తారని సిగ్గు లేకుండా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి,గతంలో డీజీపీ పదవిని నిర్వహించిన వారు కూడా మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగించిందని రఘురామకృష్ణం రాజు అన్నారు.