వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోరాటం సరే కేటీఆర్- నిజాం షుగర్స్ నుంచి అల్విన్ వరకూ తమరిచ్చిన “తెరిపించుడు” హామీలు గుర్తున్నాయా ?
-గూట్లో రాయి తీయలేనోడు ఏట్లో కొండలు తీస్తానని బయలుదేరినట్లుగా ఉంది రామారావు తీరు
-తెలంగాణ తల్లిని వదిలేసి తెలుగు వారి హక్కులంటున్న కేటీఆర్ ను చూస్తే జాలేస్తోంది !
-వర్కింగ్ కాపిటల్, ముడిసరుకు కోసం నిధుల సమీకరణ కుట్రలాగా కనిపిస్తోందా ?
-వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం విడుదల చేసిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు అర్థం కాకపోతే కుట్ర ఉన్నట్లేనా ?
-నిజాం షుగర్స్ ప్రారంభిస్తామని ఓట్లు దండుకుని ఇంకా ఎందుకు ప్రారంభించలేదు ?
-ప్రాగా టూల్స్, ఆల్విన్ కంపెనీ, హెచ్ఎంటీ, ఐడీపీఎల్, ఆజాంజాహీ మిల్లు వీటి సంగతేంటి ?
-సింగరేణితో కలిసి సొంతంగా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెడతామన్న ప్రగల్భాలు ఏమయ్యాయి ?
-ఈ కంపెనీల కార్మికుల కోసం పోరాటాలు చేసి ఓట్లు కొట్టేసి ఇప్పుడు ఆ కంపెనీల స్థలాలను కబ్జా చేయడమేనా మీరు చేసేది ?
-హైదరాబాద్ చుట్టుపక్కల అమ్ముతున్న వేల ఎకరాల సొమ్ముతో ఇండస్ట్రీలు ఎంందుకు ప్రారంభించరు ?
-ఎనిమిదేళ్లలో దాదాపు 13 వేల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. ఎందుకు తెరిపించరు ?
-మీ అండ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న ఆయా పరిశ్రమల కార్మికులకు ఏం చెబుతారు ?
-తెలంగాణ ప్రజల సంపద దోచుకుని జైలుకెళ్లే పరిస్థితి వచ్చే సరికి స్టీల్ ప్లాంట్ తెలుగువారి హక్కు అయిందా ?
-ఎత్తిపోయే కాపురానికి ఏ కాలు పెడితే ఏమీ కానీ కేటీఆర్ ఇలాంటి చిల్లర లేఖల వల్ల మీడియాలో ప్రచారం వస్తుందేమో కానీ బండారం అంతా బయటపడుతుంది
-ఆంధ్ర బిజెపి నుంచి కేటిఆర్ కు వాస్తవ లేఖతో సమాధానం ఆంధ్రప్రదేశ్ భాజపా ప్రధాన కార్యదర్శి, ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి
గూట్లో రాయి తీయలేనోడు ఏట్లో కొండలు తీస్తానని బయలుదేరినట్లుగా ఉంది తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యవహారం. విశాఖ ఉక్కు – తెలుగువారి హక్కు అంటూ ఆయన రాసిన లేఖ చూస్తూంటే పాపం అనిపించక మానదు. తెలుగు తల్లి ఎక్కడ ఉందని తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకుని చివరికి ఇప్పుడు తెలుగువారు అంటూ సెంటిమెంట్ కలుపుకునే ప్రయత్నం చేసే కష్టం ఏ పగవాడికీ కూడా రాకూడదని కోరుకుంటా. ఈ నయా సెంటిమెంట్ గురించి చివరిలో చెప్పుకుందాం. ఇప్పుడు కేటీఆర్ రాసిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేఖ .. అందులో ఉన్న దురుద్దేశాలు.వాస్తవాలు, దుర్భుద్ది రాజకీయాలు, అంతకు మించి ఎక్కడో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం కొట్లాడతానంటున్న ఆయన… అసలు తెలంగాణలో ఏం చేస్తున్నారో చెప్పుకుందాం.
తెలంగాణ ఉద్యమం సమయంలో ఎన్ని చెప్పారు.. ఎన్ని చేశారు ? మూతపడ్డ పరిశ్రమలను తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో తెరిపిస్తామని ఉద్యమ టైంలో, ఎన్నికల మేనిఫెస్టోలో హామీల మీద హామీలిచ్చిన కేసీఆర్ , కేటీఆర్ ఒక్కటంటే ఒక్క పరిశ్రమను అయినా తెరిపించారా ? . అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు దాటిపోయినా పట్టించుకోవడం లేదు. నిజాం షుగర్స్, ఆజంజాహీ మిల్లు, ప్రాగా టూల్స్, ఆల్విన్, హెచ్ఎంటీ, హెచ్‌సీఎల్, ఐడీపీఎల్.. ఇట్లా ఎన్నో పరిశ్రమలు ఖాయిలా పడటంతో ఎందరో కార్మికులు రోడ్డునపడ్డారు. తెలంగాణ ఏర్పడే నాటికి సుమారు 1,600 వరకు మధ్య తరహా కంపెనీలు, 3 వేల వరకు చిన్న కంపెనీలు మూతపడ్డాయి. రాష్ట్రం వచ్చిన ఈ ఎనిమిదేళ్లలోనే దాదాపు 13 వేల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయని రికార్డులు చెబుతున్నాయి. కరోనా టైంలో సర్కారు నుంచి సాయం లేక, సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేక పారిశ్రామిక వేత్తలు వీటిని బంద్ పెట్టారు. ఏడున్నరేండ్లలో మూతపడ్డ పరిశ్రమల వల్ల సుమారు నాలుగున్నర లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరి గురించి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి.
సమైక్య రాష్ట్రంలో మూతబడిన ప్రాగా టూల్స్, ఆల్విన్ కంపెనీ, హెచ్ఎంటీ, ఐడీపీఎల్ లాంటి కంపెనీలను పునరుద్ధరిస్తామని కేసీఆర్, కేటీఆర్ హామీలు ఇచ్చింది నిజం కాదా ? ఈ ఎనిమిదేళ్లలో వాటిని తెరిపించాడనికి చేసిన ప్రయత్నాలేమిటో వారు చెప్పగలరా ? నిజాం షుగర్స్, ఆజాంజాహీ మిల్లును కూడా తెరిపిస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఉద్యమ సమయంలో , ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో వీటి గురించే ప్రచారం చేసింది. స్వయంగా కేసీఆర్ అనేక సందర్భాల్లోనూ ఇదే విషయం చెప్పారు. తెలంగాణలో తమ ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజుల్లోపు నిజాం షుగర్స్‌పై నిర్ణయం తీసుకుంటామని బోధన్ వేదికగా అప్పట్లో ఆయన ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీలను మూలకుపడేశారు. ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తేవడంతోపాటు దీనిపై ఆధారపడ్డ కార్మికులు, ఉద్యోగులు, దీన్నే నమ్ముకున్న రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తీరా గద్దెనెక్కాక ఈ విషయమే మర్చిపోయారు. ఇప్పటికి రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటుచేసినా ఫ్యాక్టరీ ఊసెత్తడం లేదు.
ముఖ్యమంత్రి హోదాలో ఈ ప్రాంతంలో పలుమార్లు పర్యటించిన కేసీఆర్ ఎప్పుడు కూడా షుగర్ ఫ్యాక్టరీపై తానిచ్చిన హామీని ప్రస్తావించలేదు. కవిత కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఓ ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నారు. ఇప్పుడు దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడిపించడం సాధ్యం కాదని సంకేతాలు ఇసత్ున్నారు. స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే ముందు.. తెలంగాణ ప్రజలకు చేసిన ఈ అన్యాయం గురించి తండ్రీ కొడుకులు మాట్లాడగలరా ? మూతపడిన పెద్ద కంపెనీలు, ఫ్యాక్టరీలను తెరిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని ఉద్యమంలో ఉదరగొట్టారు. కార్మికులకు కంపెనీల్లో ఉపాధి దొరుకుతుందని. నిరుద్యోగులకు కొలువులు వచ్చే చాన్స్ ఉంటుందని యువతను ఆశ పెట్టారు. నిజాం షుగర్స్ లాంటి పరిశ్రమలను తెరిస్తే రైతులు ఎక్కడికో వెళ్లి చెరుకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండదని మభ్యపెట్టారు. పంటకు గిట్టుబాటు వస్తుందని నమ్మించారు. కానీ ఇప్పటి వరకూ షుగర్ ఫ్యాక్టరీని తెరిచే ప్రయత్నం ఎందుకు చేయలేదు.
అజాంజాహి మిల్లుదీ అదే పరిస్థితి. వరంగల్‌లో 202 ఎకరాల స్థలంలో ఆజంజాహీ మిల్లు 1990లో ఇది మూతపడింది. మిల్లును తెరిపిస్తామని ఎంత నమ్మించారో … చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఆ స్థలాలను స్వాహా చేసేశారు కానీ మిల్లును తెరిపించలేదు. ఇక డీబీఆర్ మిల్స్ పరిస్థితీ అంతే. లోయర్ ట్యాంక్ బండ్ లో ఉన్న ఈ ఫ్యాక్టరీ కి 1992 ఫిబ్రవరిలో ఫ్యాక్టరీకి తాళం వేశారు. మళ్లీ తెరిపిస్తామని చెప్పి ఇంత వరకూ అలాంటి ప్రయత్నాలు చేయలేదు. . సిర్పూర్ –-కాగజ్ నగర్ పేపర్ మిల్లును తప్ప ఏ ఒక్క దాన్ని కూడా రాష్ట్ర సర్కారు తిరిగి తెరిపించలేదు. కనీసం ప్రయత్నాలు చేయలేదు. దానికి కేసీఆర్, కేటీఆర్ ఏం సమాధానం చెబుతారు ?
అల్వీన్ కంపెనీ విషయంలో అదే జరిగింది. 15వేల మంది పనిచేసే అల్వీన్ కంపెనీ 1981లో జపాన్ సహకారంతో సికో కంపెనీతో కలిసి గడియారాల తయారీని ప్రారంభించారు. 1994లో అల్విన్ సంస్థ మూతపడింది. హైదరాబాద్ బాలానగర్‌లో 1961లో ఐడీపీఎల్ కంపెనీని నాటి ప్రధాని నెహ్రూ ప్రారంభించారు. 3,700 మంది పనిసేవాళ్ల. 47 రకాల ఔషధాలను ఇక్కడ తయారు చేసేవాళ్లు. 1996 నుంచి బల్క్‌డ్రగ్, 2003 నుంచి ఫార్ములేషన్ల తయారీ నిలిపివేశారు.
1943 మే నెలలో సికింద్రాబాద్‌లోని కవాడీగూడ ప్రాంతంలో ప్రాగా టూల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రారంభమైంది. ఇందులో పరిశ్రమలకు సంబంధించిన టూల్స్ తయారు చేసేవాళ్లు. 1963లో ఈ పరిశ్రమ పేరును ప్రాగా టూల్స్ లిమిటెడ్‌గా మార్చి, రక్షణ మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు. అనంతరం దీన్ని మూసేశారు. వీటన్నింటినీ తెరిపిస్తామని చెప్పి ఎందుకు తెరిపించలేకపోయారు. చెప్పే ధైర్యం కేటీఆర్, కేసీఆర్‌కు ఉందా ? హైదరాబాద్ శివారులో లక్షలకోట్లు భూములు అమ్మి ఏం చేస్తున్నారు ? ఈ పరిశ్రమలను ఆ భూములు అమ్మి ఎందుకు తెరిపించడం లేదు. హైదరాబాద్ చుట్టుపక్కన భూదందాల్లో టీఆర్ఎస్ నేతలు ఆరితేరిపోయారు. బినామీల పేరుతో వేల కోట్లు సంపాదించు కుంటున్నారన్నది నిజం కాదా ?