న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (ఆర్‌ఐఎన్‌ఎల్) 2020-21 ఆర్థిక సంవత్సరంలో 17,980 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించినట్లు ఉక్కు శాఖ సహాయ మంత్రి రామ్ చంద్ర ప్రసాద్ సింగ్ రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 2020-21లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 789 కోట్ల రూపాయల నష్టాలను ప్రకటించిందని చెప్పారు.
2021-222 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్‌ఐఎన్‌ఎల్ పనితీరును తెలిపే ఆడిట్ చేసిన సమాచారం ఇంకా వెల్లడి కాలేదని తెలిపారు. దేశంలో ఉక్కు రంగం పనితీరు ఆధారంగా ప్రతి ఏటా ఆర్‌ఐఎన్‌ఎల్ ఆర్థిక, భౌతిక పనితీరు ఆధారపడి ఉంటుందని తెలిపారు. 2011-12 నుంచి 2014-15 వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభాల బాటలోనే ఉన్నట్లు మంత్రి గణాంకాలతో సహా వివరించారు. అనంతరం 2015-2016 నుంచి 2020-21 వరకు (2018-19 ) మొత్తం మీద ఆర్‌ఐఎన్‌ఎల్‌కు 8,752 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తెలిపారు.