– తెరవెనక గుట్టు విప్పుతా
* నాటి నిజాలన్నీ సుప్రీంకోర్టు న్యాయమూర్తికి వెల్లడిస్తా
* నన్ను స్టీఫెన్స్ వద్దకు పంపింది ఎవరో చెబుతా
* నా దగ్గరున్న అన్ని ఆధారాలూ వెల్లడిస్తా
* నేను దోషిని కాదు, బాధితుడిని
* అంతా బాగున్నారు, నాకే సమస్యలు
* ఆ కేసు వల్ల నా కుటుంబం అన్యాయమైంది
* ఈడీ వాళ్లూ వేధించారు
* అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నన్ను వేధించింది
* రేవంత్‌రెడ్డి నా కుటుంబానికి ఏం సాయం చేయలేదు
– కనీసం కోర్టు ఖర్చులకూ డబ్బులివ్వకుండా మోసం చేశారు
* నేను ఎవరి ప్రలోభాలకూ గురికాలేదు
* తెలంగాణ ప్రభుత్వం నాపేరు ఇంకా ఎందుకు కొనసాగిస్తుందో తెలియదు
– ఇద్దరు ముఖ్యమంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు
* ఓటుకు నోటు కేసులో నాల్గవ ముద్దాయి.. ఆలిండియా క్రైస్తవ సమాఖ్య కన్వీనర్ జెరూసలెం మత్తయ్య సంచలన ప్రకటన
హైదరాబాద్: ‘ఓటుకు నోటు కేసులో తెరవెనక ఏం జరిగిందో.. స్టీఫెన్స్ దగ్గరకు నన్ను ఎవరు పంపించారో..నన్ను ఎవరు ప్రలోభపెట్టారో.. అవసరం తీరిన తర్వాత వాడుకుని ఎలా వదిలేశారో.. నేనెలా బాధితుడయింది, నా కుటుంబం ఎంత క్షోభపడిందో.. మొత్తం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారిస్తున్న బెంచ్‌కు పూసగుచ్చినట్లు చెప్పేస్తా. ఎందుకంటే నాకు ఇప్పటికే చాలా అన్యాయం-నష్టం జరిగింది. ఇక ఇంతకంటే పోయేదేముంది? ఈ కేసులో ఉన్న రేవంత్‌రెడ్డి కూడా నా కుటుంబానికి ఎలాంటి సాయం చేయలేదు. కనీసం కోర్టు ఖర్చులకూ డబ్బులివ్వకుండా మోసం చేశారు. నేను అన్నింటికీ తెగించే ఉన్నా. ఎవరికీ, ఏ స్థాయి వ్యక్తులకూ భయపడేది లేద’’ని ఓటుకు నోటు కేసులో నాలుగవ ముద్దాయి అయిన ఆలిండియా క్రైస్తవ సమాఖ్య కన్వీనర్ జెరూసలెం మత్తయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.
మత్తయ్య ఏమన్నారంటే… ఓటుకు నోటు కేసులో నేను నిందితుడిని కాదు. బాధితుడిని. ఈ కేసులో ఇరుకున్న వాళ్లంతా బాగుపడ్డారు. పదవులొచ్చాయి. అంతా హ్యాపీగా ఉన్నారు. కానీ నేనే ఇంకా సమస్యలు, కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నా.
నాటి సీఎం కేసీఆర్ ప్రభుత్వం నన్ను మానసికంగా వేధించింది. నా కుటుంబాన్ని హింసించింది. నా సోదరుడిని క్రూరంగా హింసించింది. ఈడీ వాళ్లు కూడా నన్ను వేధించారు. నన్ను టార్చర్ చేశారు. అయినా రేవంత్‌రెడ్డి నా కుటుంబాన్ని ఆదుకోలేదు. ఏసీబీ కోర్టు విచారణకు ఎప్పుడూ గైర్హాజరు కాలేదు. అదీ నా నిబద్ధత.
ఓటుకు నోటు కేసులో ఏం జరిగిందో నేను సుప్రీంకోర్టుకు పూసగుచ్చినట్లు వివరిస్తా. నన్ను స్టీఫెన్స్ దగ్గరకు ఎవరు పంపారో, నన్ను ఎవరు పావుగా వాడుకున్నారో కూడా చెబుతా. ఇప్పటికే చాలా నష్టపోయా కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన నష్టమేమీలేదు.
ఈ కేసులో కేసీఆర్ ప్రభుత్వం నన్ను అన్యాయంగా ఇరికించింది. అయినా నేను న్యాయపోరాటం చేసి హైకోర్టు నుంచి క్వాష్ ఉత్తర్వులు తెచ్చుకున్నా. వారి నుంచి ప్రాణహాని ఉందని చెబితేనే కోర్టు నాకు గన్‌మెన్ ఇచ్చింది. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడా నన్ను ఆ కేసులో విచారించాలని సుప్రీంకోర్టుకు చెప్పడం ఆశ్చర్యం.
నిజానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటుందని ఆశించా. మరి తెరవెనుక ఏం జరుగుతోందో తెలియడం లేదు. ఎవరు ఎవరిని ఇరికించి ఎవరు తప్పించుకోవాలనుకుంటున్నారో తర్వాత వెల్లడిస్తా.
ఇన్నాళ్లకు నా పోరాటం- కృషి ఫలించి , ఓటుకు కోట్లు కేసును గురించిన పూర్తి నిజాలు ఏకంగా దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ముందు చెప్పేందుకు నాకు అవకాశం దొరికింది. చీఫ్ జస్టిస్ గారికి కృతజ్ఞతలు. అన్ని వివరాలు సవినయంగా సవివరముగా న్యాయస్థానానికి తెలియచేస్తా.
ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క విలువ.. ముఖ్యంగా ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసి, అప్రజాస్వామికంగా అధికారాన్ని పొందాలనుకొనే “ఓటు దొంగలను “శాశ్వతంగా ఎన్నికల్లో పాల్గొనకుండా, నిషేధించే విధంగా ప్రత్యేక చట్టం చేయాలని, ప్రజాప్రాతినిధ్య చట్టానికి మరింత పదును పెట్టి, సాధారణ ఓటర్లకు ఎన్నికల్లో డబ్బులు పంచిన అబ్యర్దుల ఓటు హక్కు తొలగించాలి.
ఎమ్మెల్యే , ఎంపీ , ఎమ్మెల్సీ లను కోట్ల రూపాయలతో కొనుగోలు చేసే రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేయాలి. ఈసారైనా సుప్రీంకోర్టులో నిజాలు చెప్పి ఓటరు యొక్క ప్రాధాన్యతను కోర్టు ద్వారా ప్రజలకు తెలియజేస్తా.
ముఖ్యంగా నాలాంటి అమాయకులను రాజకీయ అవసరాలకు వాడుకుని వదిలిపెట్టిన టిడిపి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉండి, నన్ను ఈ నేరానికి ప్రోత్సహించిన వ్యక్తి టిడిపి నుండి కాంగ్రెస్ కు వచ్చి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున అధికారంలో ఉండి, కనీసం నాకు కోర్టు ఖర్చులకు కూడా ఆర్థికంగా సహకరించకుండా మోసం చేసి వదిలేశారు.
వారు ఇప్పుడు ముఖ్యమంత్రులుగా రెండు రాష్ట్రాల్లో ఉంటూ అధికారిక పాలన చేస్తున్నప్పటికీ, నా విషయంలో న్యాయ సహాయం చేయమని అడిగితే అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారు. తెలంగాణ ఇంటలిజెన్స్ డిజి శివధర్ రెడ్డిని ఎన్నిసార్లు కలిసినప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇప్పించడం లేదు. నన్ను మానసికంగా ఆర్థికంగా వేధిస్తున్నారు. ఏదేమైనా నేను పోరాటం చేస్తా. నా పోరాటంలో ఎంత పెద్ద స్థాయి వ్యక్తులకయినా భయపడేది లేదు