హైదరాబాద్: ఐదు కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీల వివాదానికి సంబంధించి ‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బంధువుల వద్ద తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమని అడిగినందుకు వారిపై దాడి చేయించారన్న ఆరోపణలతో ఈ అరెస్టు జరిగింది. ఆయనను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న విజయవాడ పటమట పోలీసులు, విచారణ నిమిత్తం విజయవాడకు తరలించారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉంటున్న కిరణ్ బంధువు గాజుల మహేశ్ ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఆయన వద్ద దాసరి కిరణ్ రూ.4.5 కోట్లు అప్పుగా తీసుకున్నారు. గడువు ముగిసినా అనేకసార్లు అడిగినప్పటికీ ఆ డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో మహేశ్ ఆయన్ను నిలదీశారు. ఈ నెల 18న మహేశ్, తన భార్యతో కలిసి డబ్బులు అడిగేందుకు విజయవాడలోని కిరణ్ కార్యాలయానికి వెళ్లారు.
అక్కడ దాదాపు 15 మంది తమపై దాడి చేశారని, కిరణ్ తన అనుచరులతో దాడి చేయించారని ఆరోపిస్తూ మహేశ్ విజయవాడ పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం, హైదరాబాద్‌లో ఉన్న దాసరి కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు.