-తెలంగాణ ప్రజలు కేసీఆర్ సర్కార్ నే నిషేధించబోతున్నారు
తెలంగాణ సబ్బండ వర్గాలు అల్లాడుతుంటే….. వందల కోట్లతో సొంత డబ్బా కొట్టుకుంటారా?
-బీజేపీ ఎదుగుతుంటే ఓర్వలేక మా పార్టీ వార్తలు రాయొద్దంటూ ప్యాకేజీలు ఇచ్చే దుస్థితిలో కేసీఆర్
-కేసీఆర్ కు దమ్ముంటే… తెలంగాణలో చేసిన అభివ్రుద్ధిపై శాఖల వారీగా శ్వేత పత్రం విడుదల చేయాలి
-నా ఢిల్లీ పర్యటన మీడియా స్రుష్టే
-నన్ను హైకమాండ్ పిలవనేలేదు
-రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలని హైకమాండ్ కు అప్పీల్ చేశాం
-త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నా
-‘‘ఖేలో ఇండియా – జీతో భారత్’’ నినాదం బీజేపీది
-‘‘పీలో తెలంగాణ – పిలావో తెలంగాణ’’ కేసీఆర్ స్లోగన్
-మద్యాన్ని ఏరులై పారించి ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న కేసీఆర్
-మళ్లీ అధికారంలోకి వస్తే స్విగ్గీ, జొమాటో ద్వారా ఇంటింటికీ మద్యాన్ని పారిస్తారేమో
-ఈటల రాజేందర్ జాతీయ నాయకత్వాన్ని కలిస్తే తప్పేముంది?
-సొంత పార్టీ నేతలను కేసీఆర్ కలవడు కాబట్టి కొందరికి వింతగా ఉందేమో..
-కేసీఆర్ సర్కార్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజం
‘‘ప్రజా సమస్యలపై, ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నంచే మీడియాను కేసీఆర్ ప్రభుత్వం నిషేధిస్తోంది. ఉద్యమించే నాయకులను అరెస్ట్ చేసి బెదిరిస్తోంది. మరో 5 నెలలు ఆగండి… తెలంగాణ ప్రజలే కేసీఆర్ సర్కార్ ను నిషేధించబోతున్నారు’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు… తెలంగాణ సబ్బండ వర్గాలు అల్లాడుతుంటే….. వందల కోట్ల ప్రజా ధనంతో సొంత పార్టీ డబ్బా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. చివరకు బీజేపీ ఎదుగుతుంటే ఓర్వలేక తమ పార్టీ వార్తలు రాయొద్దంటూ ప్యాకేజీలు ఇచ్చే దుస్థితికి కేసీఆర్ చేరుకున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ కు దమ్ముంటే…తన పాలనలో తెలంగాణలో చేసిన అభివ్రుద్ధిపై శాఖల వారీగా శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు హైదరాబాద్ లోని నిజాం కాలేజీ మైదానంలో ‘‘ఖేలో భారత్- జీతో భాగ్యనగర్’’ పేరిట నిర్వహించిన క్రీడల పోటీల ఫైనల్ మ్యాచ్ ను తిలకించడానికి వచ్చిన బండి సంజయ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…
• ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఖేలో ఇండియా పేరుతో బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న అన్న పార్లమెంట్ నియోజకవర్గాల్లో క్రీడల పోటీలు నిర్వహిస్తున్నాం. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి రాజధానిలో క్రీడలను ప్రోత్సహించాలనే మంచి ఆలోచనతో రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ ‘‘ఖేలో భారత్ – జీతో భాగ్యనగర్’’ పేరిట పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉంది. క్రికెట్ తోపాటు దేశవాళీ క్రీడలను కూడా ప్రోత్సహిస్తున్నారు.
• యువతకు క్రీడా స్పూర్తి చాలా అవసరం. క్రీడా స్పూర్తితో ఏ రంగంలోనైనా సమిష్టిగా పనిచేస్తే రాణించవచ్చని ఈ క్రీడలు చాటి చెబుతున్నాయి. నరేంద్రమోదీ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోంది. యూపీఏ హయాంతో పోలిస్తే క్రీడల బడ్జెట్ ను 8 రెట్లు అధికంగా కేటాయించేవారు. గతంలో క్రీడల్లో సెలెక్ట్ కావాలన్నా, అవార్డులు ఇవ్వాలన్నా పైరవీలు ఉండేవి.
• మోదీ వచ్చాక నైపుణ్యమే గీటురాయిగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఆయా రంగాల్లో రాణించిన వారికి మాత్రమే అవార్డులు ఇస్తున్నారు.
• అందులో భాగంగా ‘‘ఖేలో ఇండియా- జీతో భాగ్యనగర్’’అనే నినాదంతో బీజేపీ పనిచేస్తుంటే…. తెలంగాణలో మాత్రం కేసీఆర్ ‘‘తాగుడు-ఊగుడు’’ పథకంతో ‘‘పీలో తెలంగాణ- పిలావో తెలంగాణ’’ నినాదంతో గల్లీగల్లీలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. గతంలో రూ.10 వేల కోట్ల ఆదాయమంటే కేసీఆర్ వచ్చాక రూ.40 వేల కోట్లకు చేర్చిండు. ఆ సంపాదన చాలదని బంపర్ ఆఫర్ పేరుతో మందు రేట్లు తగ్గించి తాగుడును మరింత ప్రోత్సహిస్తున్నారు.
• పంట నష్టోయిన రైతులు ఏడుస్తున్నరు. ఉద్యోగాల్లేక నిరుద్యోగులు బాధపడుతున్నరు. నిలువ నీడ లేక పేదల అల్లాడుతున్నరు. కానీ అవసరం లేకపోయినా సచివాలయాన్ని కూలగొట్టి కొత్తది కట్టుకున్నడు. ప్రగతి భవన్ కట్టుకున్నడు… ఇక్కడి ప్రజలను ఆదుకోవాలని చెబుతుంటే… పంజాబ్ పోయి అక్కడి రైతులకు పైసలిస్తడు… మహారాష్ట్ర వాడికి ఉద్యోగాలిచ్చి లక్షల జీతాలు ఇస్తున్నడు. హైకోర్టు తిడితే ఏపీకి పారిపోయినోడిని పట్టుకుని వచ్చి మళ్లీ ఇక్కడ చీఫ్ అడ్వయిజర్ పోస్టులిచ్చిండు…
• మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలు మరింత ఇబ్బందుల్లో పడతారు. స్విగ్గి, జొమాటో మాదిరిగా ఇంటింటికీ మద్యాన్ని పంపిణీ చేస్తాడు…ఇప్పటికే హుక్కా సెంటర్ల పేరుతో బానిసలను చేస్తున్నరు.. అనుమతి లేకపోయినా బీఆర్ఎస్ నేతల అండ ఉంటే ఎక్కడ పడితే అక్కడ హుక్కా సెంటర్లు పెట్టుకోవచ్చనేలా వ్యవహరిస్తున్నారు.
• ఇచ్చిన హామీలను అమలు చేయడు… ప్రజలను ఆదుకోడు.. సీఎం మళ్లీ పొరపాటున గెలిస్తే మరో 5 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ ప్రజలకు చిప్ప చేతికిస్తడు…
• బీజేపీ అధికారంలోకి వస్తే నిలువ నీడ లేని పేదలకు ఇండ్లు కట్టిస్తాం.. పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యన్ని అందిస్తా… పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తాం… విద్యార్గులకు ఇబ్బంది లేకుండా ఫీజు రీయంబర్స్ మెంట్ అందిస్తాం…
• యువతకు ఒక్క విజ్ఝప్తి… కేసీఆర్ పాలనతో పూర్తిగా విసిగిపోయారు. యువత కదలండి. బీజేపీ చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కండి.
• తెలంగాణలో ప్రజలు అల్లాడుతున్నరు. తెలంగాణలో ఉద్యమకారులను గాలికొదిలేసినవ్. నిరుద్యోగులను, రైతులను రోడ్డునపడేసినవ్… సిగ్గు లేకుండా వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తావా? నీ పార్టీకి, నీ కుటుంబానికి డప్పు కొట్టుకోవడానికి వందల, వేల కోట్ల ఖర్చు చేస్తున్నరు.
• మీడియాకు నా విజ్ఝప్తి… వందల కోట్ల యాడ్స్ ఇస్తున్నారని ప్రభుత్వానికి బాకా కొడితే సామాన్య ప్రజలేమైపోయారు. ఒక పార్టీకి సంబంధించి వార్తలు రాయడం తప్పు లేదు.. కానీ బీజేపీ కార్యక్రమాలు వార్తలు రావొద్దని ప్యాకేజీలు ఇచ్చే దుస్థితికి కేసీఆర్ చేరిండు.. అయినా ప్రశ్నిస్తే ఆ పత్రికలను నిషేధిస్తున్నడు… ఇంకో 5 నెలలు ఆగండి… కేసీఆర్ ప్రభుత్వాన్నే ప్రజలు నిషేధించబోతున్నరు.
• కేసీఆర్ కు నిజంగా అభివ్రుద్ధి చేసి ఉంటే చెప్పాలి…. ఏ శాఖ ఏ రకమైన అభివ్రుద్ధి చేసిందో వివరాలతో సహా శ్వేత పత్రం విడుదల చేయాలి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు దళిత బంధు పేరుతో 30 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారని కేసీఆరే చెప్పిండు.. మళ్లీ దళిత బంధు గొప్పదని పత్రికల నిండా ప్రచారం చేసుకుంటున్నరు. దళిత బంధు పేరుతో ఒక మహిళా లబ్దిదారురాలికి రూ.లక్ష మాత్రమే ఇచ్చి రూ.9 లక్షలు ఎమ్మెల్యే తీసుకున్నడు… అవినీతిలో కేసీఆర్ కుటుంబంతో పోటీ పడబోతున్నారు. దమ్ముంటే కేసీఆర్ సాధించిన అభివ్రుద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి.
• కర్నాటక ఎన్నికల ఫలితాలకు… తెలంగాణకు సంబంధం ఏముంది? ఏ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి అక్కడి ప్రజలు తీర్పు ఇస్తారు? గతంలో 18 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచి అధికారంలోకి వచ్చింది? అప్పుడెందుకు మాట్లాడలేదు? కర్నాటకలో గెలిస్తే కాంగ్రెస్ సంబురాలు చేసుకుందా? ఇక్కడి ఆ పార్టీ లేదు. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు రావడం లేదు.
• ఒక సెక్షన్ మీడియా ఆంధ్రప్రదేశ్ లో మద్దతిస్తున్న పార్టీ నాయకుడికి సపోర్ట్ చేస్తోంది. మరో సెక్షన్ మీడియా కాంగ్రెస్, బీజేపీ మధ్య ఓట్లు చీల్చి బీఆర్ఎస్ ను గెలిపించాలని చూస్తోంది.
• ఈటల రాజేందర్ మా జాతీయ నాయకత్వాన్ని కలిస్తే తప్పేముంది? కేసీఆర్ ఆ పార్టీ నాయకులకు కలవరు కాబట్టి మీకు కొత్తగా అన్పిస్తుండవచ్చు…
• మీరు ఢిల్లీకి పోతున్నారని స్క్రోలింగ్ వేస్తున్నారు… నేను వెళ్లానా? నన్ను హైకమాండ్ పిలవనేలేదు… బ్రేకింగ్ లు మీరే వేస్తున్నారు…మీడియా స్రుష్టి…
• కర్నాటక ఫలితాలతో హిందుత్వం లేదన్నోళ్లకు…. ఆ దమ్ము ఏందో కరీంనగర్ లో హిందూ ఏక్తా యాత్ర ద్వారా నిరూపించాం.
• రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలని హైకమాండ్ కు అప్పీల్ చేశాం.. త్వరలోనే హైకమాండ్ తగిన నిర్ణయం తీసుకుంటుంది.