Suryaa.co.in

Telangana

తెలంగాణలో వార్ వన్ సైడ్

మూడో సారి అధికారం బీఆర్ఎస్ దే
సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం
బిజెపికి అన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్లు గల్లంతవుతాయి
మేము చేసిన మంచి పనులే మమ్మల్ని గెలిపిస్తాయి
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు గ్యారెంటీ ఎవరు ?
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కాదని రాహుల్ గాంధీ గ్యారెంటీలు ప్రకటించడం ఏంటి ?
సోలాపూర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు
చేనేత పరిశ్రమలను సందర్శించిన కవిత… బీడీ కార్మికుల తో సమావేశం

సోలాపూర్ : తెలంగాణలో వార్ వన్ సైడేనని, బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో మరోసారి అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. సీఎం కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యి హ్యాట్రిక్ కొడతారని తేల్చిచెప్పారు. సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి సోలాపూర్ వెళ్లిన కవిత అక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

గత పది ఏళ్లలో రైతులు, మహిళలు, యువత, ఎస్సీ ఎస్టీ, బీసీ సాధికారత కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని గుర్తు చేశారు.తమ ప్రభుత్వం చేసిన చేసిన మంచి పనులే తమను గేలిపిస్తాయని అన్నారు. సీఎం కేసీఆర్ ను మరొకసారి ఆశీర్వదించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.

గత ఎన్నికల్లో 105 సీట్లలో బీజేపీ డిపాజిట్ కోల్పోయిందని, ఈ ఎన్నికల్లో అన్ని సీట్లలో డిపాజిట్ కోల్పోతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఎప్పుడూ మభ్యపెడుతూనే ఉంటుందని విమర్శించారు. 65 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ పార్టీ చేయనన్ని పనులను గత 10 ఏళ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించారు కాబట్టి తమ పార్టీ వైపు నిలుస్తారన్న విశ్వాసం ఉందని చెప్పారు.

తమ పథకాలను కాపీ కొట్టి 6 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందని, మరి ఈ ఆరు గ్యారెంటీల అమలకు ఏ నాయకుడు గ్యారెంటీ ఇస్తారని ప్రశ్నించారు. దళిత నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కాదని గాంధీ కుటుంబం గ్యారంటీల హామీలు ఇస్తోందని విమర్శించారు.

తెలంగాణ సంస్కృతిని మహారాష్ట్రలో కొనసాగించడం సంతోషంగా ఉందనీ, మహారాష్ట్ర సంస్కృతిని కూడా పాటిస్తూ అక్కడ తెలంగాణ వాసులు గంగా జమున తహజీబ్ లా కలిసిపోయారని హర్షం వ్యక్తం చేశారు.
చేనేత పరిశ్రమలను సందర్శించిన కవిత… బీడీ కార్మికుల తో సమావేశం.

సోలాపూర్ పర్యటనలో భాగంగా కల్వకుంట్ల కవిత చేనేత పరిశ్రమలను సందర్శించారు. వాటిలో పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడారు. మహారాష్ట్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమకు ఎటువంటి సహాయ సహకారాలు అందించడం లేదని వారు కవిత దృష్టికి తీసుకొచ్చారు.

తెలంగాణలో చేనేత కార్మికులకు పెన్షన్లు అందిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం భరోసానిస్తుండడం సంతోషంగా ఉందన్నారు. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేనేత రంగాన్ని విస్మరించడం వల్ల సంబంధిత పరిశ్రమలు కుదేలవుతున్నాయని కవిత ఆందోళన వ్యక్తం చేశారు.

అలాగే, సోలాపూర్ లో పెద్ద సంఖ్యలో ఉన్న బీడీ కార్మికులను కల్వకుంట్ల కవిత కలుసుకున్నారు. మహారాష్ట్రలో బీడీ కార్మికులు పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. సోలాపూర్ లో దాదాపు 70 వేల మంది బీడీ కార్మికులు ఉన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వము బీడీ కార్మికులను ఆదుకునే ప్రయత్నం చేయడం లేదని వారు కవిత దృష్టికి తీసుకువచ్చారు.

తెలంగాణలో బీడీ కార్మికులకు అందిస్తున్న రూ. 2 వేల పెన్షన్ ను మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 3 వేలకు పెంచాలని సీఎం కేసీఆర్ సంకల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి ఓట్లు వేయాలని తెలంగాణలోని వారి బంధుమిత్రులను కోరుతున్నామని కవితకు వారు చెప్పారు.

సోలాపూర్ వైభవంగా బతుకమ్మ వేడుకలు
బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి సోలాపూర్ విచ్చేసిన కల్వకుంట్ల కవితకు స్థానిక నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని పుంజల్ మైదాన్ లో జరిగిన సంబరాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఆడబిడ్డలతో కలిసి కవిత బతుకమ్మ ఆడారు. సోలాపూర్ లో మధ్యాహ్నం నగేష్ వాల్యాల్ నివాసంలో బతుకమ్మను పేర్చారు. అనంతరం దశరథ్ గోప్ నివాసానికి వెళ్లారు. తదనంతరం దత్త మందిర్ నుంచి మొదలైన బతుకమ్మ ర్యాలీలో కవిత మహిళలతో కలిసి నడిచారు.

LEAVE A RESPONSE