– ఇద్దరు సంబంధం లేని వ్యక్తుల “జనహిత పాదయాత్ర”
– “జనఘాతుక యాత్ర” అనే పేరు పెడితే బాగుండేది
– “జన మాయాజాల యాత్ర” అనే పేరు పెట్టుకోవాలి
– బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా.సోలంకి శ్రీనివాస్
హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు గురించి వివరించేందుకు కాంగ్రెస్ పార్టీ జనహితం పేరిట పాదయాత్రను నిర్వహిస్తోంది. అయితే, కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల ప్రకటన సమయంలో నేటి పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్.. ఇద్దరూ ఆ పదవుల్లో లేరు. ఇద్దరు సంబంధం లేని వ్యక్తులు “జనహిత పాదయాత్ర” పేరుతో యాత్ర చేపట్టడం హాస్యాస్పదం.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో ఘోరంగా విఫలమైన ఈ సమయంలో ఆ పార్టీ చేపట్టిన పాదయాత్రకు “జనహిత పాదయాత్ర” కంటే “జనఘాతుక యాత్ర” అనే పేరు పెడితే బాగుండేది. ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, హామీలు, డిక్లరేషన్ల అమలులో తీవ్రంగా విఫలమైంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ యాత్ర చేపట్టింది. అందుకే దీనికి “జన మాయాజాల యాత్ర” అనే పేరు పెట్టుకోవాలి.
ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా పాదయాత్ర చేసినప్పుడు ఆయా ప్రాంతాల భౌగోళిక స్వరూపం, ప్రజల ఆలోచనా విధానం, జీవనశైలి తెలిసిన వ్యక్తులు లేదా పార్టీని నడిపించే స్థానిక నేతలు చేస్తారు. కానీ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తితో కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేయించడం జరిగుతోంది.
కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వంలోని రాహుల్ గాంధీ.. సంబంధం లేని ఇద్దరు వ్యక్తులతో పాదయాత్ర చేపట్టి, తెలంగాణ ప్రాంత నాయకత్వాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు, స్థానిక నేతలపై ఆధిపత్యం చెలాయించేందుకు ఈ యాత్రను రూపొందించారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు, హామీలు, డిక్లరేషన్ల అమలులో విఫలమైన నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్ళితే తలదించుకోవాల్సి వస్తుందనే భయంతో, నేటి ముఖ్యమంత్రిని ప్రజల్లోకి పంపకుండా,.. సంబంధం లేని నాయకులతో పాదయాత్ర చేయించడమే కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయానికి నిదర్శనం.
ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులతో కాకుండా, హామీలు ఇచ్చిన నాయకులతో కాకుండా, సంబంధం లేని నాయకుడితో పాదయాత్ర చేయడం అనేది, కాంగ్రెస్ పార్టీ ప్రజా తీర్పును అవమానపరచడమే. రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకత్వాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవడానికి, పాలనను తన చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి చేస్తున్న కుట్రలను గ్రహించిన రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీని ప్రసన్నం చేసుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ చేపట్టిన కులగణన సర్వేపై ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రజెంటేషన్ ఈవెంట్కు సోనియా గాంధీని ఆహ్వానించిన రేవంత్ రెడ్డి కి, అయితే ఆ కార్యక్రమానికి సోనియా గాంధీ విముఖత చూపిస్తూ ఒక లేఖ రాశారు. ఆ ఉత్తరాన్ని రేవంత్ రెడ్డి.. “లైఫ్ టైం అచీవ్మెంట్”గా, ఆస్కార్ అవార్డుతో సమానమని చెప్పుకోవడం చూస్తుంటే తన కుర్చీ కాపాడుకోవడం కోసం పడిన పాట్లు, తిప్పలు చూస్తే.. ఆయనకు నిజంగా ఆస్కార్ అవార్డుకు మించిన అవార్డును తెలంగాణ ప్రజానీకం ఇస్తుంది.
2023లో కాంగ్రెస్ పార్టీ అట్టహాసంగా విడుదల చేసిన మేనిఫెస్టోలో పేర్కొన్న గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి విఫలమైంది. హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసింది. రైతు భరోసా కింద భూమి ఉన్న రైతులు, కౌలు రైతులకు ప్రతి ఏడాది రూ.15,000 పెట్టుబడి సాయం అందజేస్తామని చెప్పి అమలు చేయలేదు.
వ్యవసాయ కూలీలకు రూ.12,000 నేరుగా ఖాతాలో జమ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు. 14 పంటలకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, కేవలం సన్నబియ్యానికి మాత్రమే పరిమితం చేసింది.
వృద్ధులు, ఒంటరి మహిళలకు రూ.4,000 పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ అమలు కాలేదు. విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, రాజీవ్ యువ వికాసం పథకాలను అటకెక్కించింది. ఎన్నికల ముందు పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి కింద రూ.1,00,116 నగదు, తులం బంగారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్, ఇప్పటివరకు ఏ పేదింటి అమ్మాయికి కూడా కనీసం గ్రాము బంగారం ఇవ్వలేదు.
ఈ హామీలను నెరవేర్చని పరిస్థితుల్లో పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో, ఆ పార్టీ అధినాయకత్వానికి దూతగా వచ్చిన మీనాక్షి నటరాజన్.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు క్షమాపణలు చెప్పి పాదయాత్రను కొనసాగించాలి. లేదంటే తెలంగాణ ప్రజలు రానున్న రోజుల్లో తగు రీతిలో గుణపాఠం చెప్పక తప్పదని బిజెపి హెచ్చరిస్తోంది.