– రైతులకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపు
– కనుముక్కలలో జలధార-సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం ప్రారంభం
– గాలి, ఎండ లెక్కచేయకుండా ముఖ్యమంత్రి పని చేస్తున్నారన్న సునీత
– వెల్దుర్తి-యర్రోనిపల్లి రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే సునీత
– ఏళ్ల నాటి రోడ్డు సమస్యకు పరిష్కారం చూపించామన్న ఎమ్మెల్యే
చెన్నేకొత్తపల్లి: కరవు జిల్లా అయిన మన ప్రాంతంలో నీరు బంగారం కన్నా విలువైందని.. దానిని ఒడిసి పట్టుకుందామని రైతులకు ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార – నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమాన్ని ఆమె నియోజకవర్గంలో ప్రారంభించారు. చెన్నేకొత్తపల్లి మండలం కనుముక్కల గ్రామంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
చెరువు వద్ద రైతులు, సాగునీటి సంఘాలతో సమావేశమై.. ఎలాంటి చర్యలు చేపట్టాలన్నది చర్చించారు. చెరువుకు నీరు తీసుకుని రావడం దగ్గర నుంచి ఎలా వినియోగించుకోవాలన్న దానిపై 100రోజుల ప్రణాళిక సిద్ధం చేయాలని ఎమ్మెల్యే సునీత సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో నీటి చెట్టు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు రామగిరి మండలం కుంటిమద్దిలో ప్రారంభించారని.. ఇప్పుడు అలాంటి కార్యక్రమాన్నే యాడికిలో ప్రారంభించారన్నారు.
జిల్లా పట్ల, ఇక్కడి రైతుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. రైతుల కోసం రాష్ట్రంలో వ్యవసాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎండ, గాలి, వానను సైతం లెక్క చేయకుండా ఇలాంటి పర్యటనలు చేస్తున్నారన్నారు. ఇదేదో హడావుడిగా ప్రారంభించి వెళ్లిపోయేది కాదని.. ప్రతి రోజు మనం బాధ్యత తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. హంద్రీనీవా ద్వారా శ్రీశైలం నుంచి ఇక్కడికి వరకు నీరు వస్తోందంటే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నారు.
ఇలాంటి సమయంలో నీటిని వృథా చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలన్నారు. ముఖ్యంగా వర్షం వచ్చినప్పుడు నీటిని నిలుపుకుని భూమిలో భద్రంగా దాచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న చెరువులను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి… నీరు వచ్చే మార్గాలను ఎలా విస్తృతం చేసుకోవాలి.. పూడిక తీత వంటి చర్యలు ఎలా చేయాలన్నది సాగు నీటి సంఘాలు చూడాలన్నారు.
వారంతా రైతులతో చర్చించి వారి భాగస్వామ్యంతో ప్రణాళికలు చేయాలన్నారు. సరైన ప్రణాళికతో ప్రభుత్వానికి నివేదిక పంపితే కచ్చితంగా నిధులు వస్తాయన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో 70లక్షలకు పైగా నిధులు వచ్చాయన్నారు. ముష్టికోవెల చెరువుకు 75లక్షలు, కనుముక్కల చెరువుకు 27లక్షల రూపాయలతో పనులు చేపట్టినట్టు వివరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని ముందుకు నడిపించాలని సూచించారు.
ఏళ్ల నాటి రోడ్డు సమస్యకు పరిష్కారం.. రూ.3.43కోట్లతో రోడ్డు నిర్మాణం
చెన్నేకొత్తపల్లి మండలంలో గత కొన్నేళ్లుగా ప్రజలకు నరకయాతనగా మారిన వెల్దుర్తి-యర్రోనిపల్లి రోడ్డు సమస్యకు ఎమ్మెల్యే పరిటాల సునీత పరిష్కారం చూపించారు. రూ.3.43కోట్లతో నిర్మించిన ఈ రోడ్డును ఆమె సోమవారం సాయంత్రం ప్రారంభించారు. దీంతో ఆయా గ్రామాల పరిధిలోని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం మండల టీడీపీ నాయకులు, స్థానిక ప్రజల మధ్య పండుగ వాతావరణంలో సాగింది.