– సాగునీటి సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వo 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక
– చెరువుల పునరుద్ధరణ, భూగర్భ జలాల పెంపే లక్ష్యం
– రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్
రామచంద్రపురం: మానవాళి మనగడకు నీరు ఆధారమని, నీటి భద్రత, సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. సాగునీటి సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందని, ఆ కార్యక్రమాన్ని సోమవారం వెల్ల గ్రామంలో మంత్రి సుభాష్ ప్రారంభించారు.
కోరింగ కెనాల్, వెల్ల లాకులను, గుర్రపు డెక్క తొలగింపు పనులను పరిశీలించి చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నాలుగు దశల్లో అమలు చేస్తున్నామని తెలిపారు. అనంతరం రామచంద్రపురం రూరల్ మండలం వెల్ల పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి సుభాష్ మాట్లాడారు.
నీటి వనరుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమని, చెరువులు, కాలువలు, వాగులు శుభ్రపరిచే కార్యక్రమాల్లో రైతులు, నీటి సంఘాల ప్రతినిధులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నీటిని వృథా చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతతో ఉపయోగించుకోవాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ 100 రోజుల ప్రణాళిక ఏప్రిల్ 6 నుంచి జూలై 14 వరకు కొనసాగుతుందన్నారు.
ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి సుభాష్ తెలిపారు. నియోజకవర్గ పరిధిలో గుర్రపు డెక్క తొలగించేందుకు, కాలువల పూడికలు తీసేందుకు, షెల్టర్ మరమ్మత్తుల కోసం నాలుగు కోట్ల 70 లక్షలతో ప్రతిపాదనలు పంపమని, అవి పరిశీలన దశలో ఉన్నాయని ఈఈ రామకృష్ణ మంత్రి సుభాష్ కు వివరించారు. కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ నియోజకవర్గంలో సాగునీటి ఎద్దడి లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. చెరువులను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అని, ప్రస్తుతం పంటలు పాలు పోసుకునే దశలో ఉన్నందున సాగునీటి కొరత లేకుండా చూడాలని కోరారు.
రామచంద్రపురం రూరల్ మండల టిడిపి అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనుబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఈఈ వివి రామకృష్ణ, కాజులూరు ఎంపీడీవో రాంబాబు, ఏఈ సుజాత, ఏఓలు మణిదీప్, అశోక్, డీసీలు నిడదవోలు సుబ్రహ్మణ్యం, దాట్ల విజయ గోపాల రాజు, లకాని కృష్ణ చైతన్య, పేపకాయల నారాయణరావు, యనుముల గోపాలకృష్ణ, రైతులు, నీటి సంఘాల ప్రతినిధులు, కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.