– స్పీకర్ ఏకపక్ష వైఖరి, ప్రభుత్వ అప్రజాస్వామిక ధోరణికి నిరసనగా ఈ అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరిస్తోంది
– మూసీ కంపు కంటే సీఎం మాటల కంపు ఎక్కువైంది
– మూసీ ప్రక్షాళన కాదు.. ముందు సీఎం నోరు ప్రక్షాళన చేయాలి
– రాహుల్ గాంధీ దేశమంతా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతుంటే.. ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం అసెంబ్లీ సాక్షిగా రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారు. ఇదేనా కాంగ్రెస్ తీరు?
గన్ పార్క్ వద్ద మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్: శాసనసభను స్పీకర్ ఏకపక్షంగా నడుపుతున్న తీరుకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక, అసభ్యకర ప్రవర్తనకు నిరసనగా.. ఈ అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్ పార్క్ వద్ద నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు ఏమన్నారంటే.. శాసనసభ నడుస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. బీఏసీ సమావేశానికి మమ్మల్ని గంటన్నర సేపు వెయిట్ చేయించి అవమానించారు. ఈ సమావేశంలో సభను 7 రోజుల పాటు నడపాలని, ఆ తర్వాత మళ్ళీ సమావేశమై తదుపరి షెడ్యూల్ నిర్ణయిద్దామని స్పష్టంగా అనుకున్నాం.
కానీ, సభలో ప్రవేశపెట్టిన మినిట్స్ లో మాత్రం సభ ఎన్ని రోజులు నడపాలనేది స్పీకర్ నిర్ణయానికే వదిలేస్తున్నాం అని తప్పుడు సమాచారం పొందుపరిచారు. స్పీకర్ సభను కస్టోడియన్ లా కాకుండా, ఏకపక్షంగా నడుపుతున్నారు. సభలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్షంగా మా బాధ్యత. క్వశ్చన్ అవర్ లో 10 ప్రశ్నలు ఉంటే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని మా మైక్ కట్ చేశారు.
పార్లమెంట్ లో ప్రధాని మోదీని రాహుల్ గాంధీ విమర్శించలేదా? మరి ఇక్కడ మేము సీఎంను ప్రశ్నిస్తే మైక్ ఎందుకు ఆపేస్తున్నారు? ముఖ్యమంత్రిని విమర్శించవద్దని స్పీకర్ మాకు రూల్స్ చెప్పడం ఎక్కడి పద్ధతి. ప్రతిపక్షం మాట్లాడకూడదంటే అసలు సభ ఎందుకు? మమ్మల్ని ఎందుకు పిలిచినట్లు?
మూసీ నది కంపు కంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల కంపు ఎక్కువైపోయింది. మూసీ ప్రక్షాళన కంటే ముందు సీఎం నోరు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. సభలో సీఎం బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రిలా కాకుండా వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారు. అసెంబ్లీని సీఎల్పీ మీటింగ్ లా, గాంధీ భవన్ లా మార్చేశారు. సభలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బయట మాట్లాడినట్లే సొల్లు వాగుడు వాగుతున్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు, పదేళ్లు సీఎంగా చేసిన కేసీఆర్ ని పట్టుకుని అడ్డగోలుగా మాట్లాడారు. కేసీఆర్ పై సీఎం వాడిన భాషను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి.. నువ్వే అసలైన తెలంగాణ ద్రోహివి, తెలంగాణ నీటి ద్రోహివి. మూసీపై చర్చకు మేము సిద్ధం. షార్ట్ డిస్కషన్ పెట్టండి, రోజంతా చర్చిద్దాం. కానీ క్వశ్చన్ అవర్ లో సీఎం వచ్చి గంటన్నర సేపు అడ్డగోలుగా మాట్లాడితే ఎలా?
మూసీ ప్రక్షాళనకు గోదావరి జలాలను మల్లన్న సాగర్ నుంచి తెస్తున్నారా అని అడిగాము దానికి సమాధానం చెప్పలేదు. మూసీలో ఇళ్లు కోల్పోయిన పేదలకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరాము. వీటికి సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారు. మూసీ శుద్ధి కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 32 ఎస్టీపీ లను కట్టింది. మరో 39 ఎస్టీపీల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం. అది మా చిత్తశుద్ధి.
రాహుల్ గాంధీ దేశంలో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతుంటే.. ఇక్కడ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారు. అవినీతికి ఆఫిషియల్ గా రేట్లు పెట్టి మరీ పెంచిన రేవంత్ రెడ్డికి మా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. సభలో అందరికీ సమాన హక్కులు కల్పించాల్సిన స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. స్పీకర్ తీరుకు, ప్రభుత్వ అహంకారపూరిత వైఖరికి నిరసనగా ఈ అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తున్నాం.