Suryaa.co.in

Andhra Pradesh

పరిపాలనా వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నాం

– అన్ని ప్రాంతాల అభివృద్ది మా ప్రభుత్వ లక్ష్యం
– అమరావతిలో కూడా అన్ని అభివృద్ధి పనులు చేస్తాం
– ప్రభుత్వ సలహాదారు, వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల

తాడేపల్లి: ప్రెస్‌మీట్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే..:
అదే మా ప్రభుత్వ లక్ష్యం:
ఊహించినట్లుగానే చంద్రబాబు , ఆయన తమ్ముళ్లు అలాగే ముందు నుంచి ఆపార్టీ తరపున సత్యమేవ జయతే అంటూ లేదా మా అక్షరం మీ ఆయుధం అంటూ.. రామోజీరావు, రాధాకృష్ణ ఇతరులు మీడియా పేరుతో టీడీపీ ఎజెండా మోస్తూ వారి ప్రచారమే సర్వస్వంగా ప్రజల మెదళ్లను విషపూరితం చేస్తున్నారు.
అలాగే సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ గతంలో మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. పరిపాలనా వికేంద్రీకరణ. అన్ని ప్రాంతాల అభివృద్ధితో పాటు, ప్రజల మనోభావాలకు విలువనిస్తున్నాం. అన్ని ప్రాంతాలు మాకు సమానం.

అంత భారం సాధ్యం కాదు:
మాది రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టు కాదు. అది కూడా ఒక వర్చువల్‌ ప్రాజెక్టు కాదు. లక్షల కోట్లు వ్యయం చేసి, అందులో సింహభాగం జేబుల్లో వేసుకోవాలన్న చంద్రబాబు దురాలోచన.. ఏదైతే ఉందో ఆ బరువు రాష్ట్రం మీద పడకుండా తప్పిస్తూ.. నాలుగేళ్లు ఏ పని చేయకుండా అరచేతిలో స్వర్గం చూపారు. ఆయన భాషలోనే చెప్పాలంటే కనీసం లక్ష కోట్లు ఖర్చు చేయాలని చెప్పారు. నిజానికి అంత భారం ఏ ప్రభుత్వం చివరకు కేంద్రం కూడా భరించలేదు. ఈ రాష్ట్రం విభజనతో చాలా నష్టపోయింది. పచ్చటి పొలాలు. దారులు కూడా లేని చోట అంత బరువు రాష్ట్రం మోయలేదు.

సాహసోపేతమైన నిర్ణయం:
మరోవైపు శ్రీబాగ్‌ ఒప్పందం నాటి నుంచి, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి వచ్చినవి తీరాలన్న ఒక బ్రహ్మాండమైన ఆలోచనతో సీఎంగారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. నక్కలు, కుక్కలు, రాక్షస మూకలు ఎంతకైనా తెగించి ఏమైనా చేయగలరని గతంలో రుజువు చేసుకున్న చంద్రబాబు, ఆయన ముఠా చర్యలను అడ్డం కొట్టే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.

హంగూ. ఆర్భాటం. వెకిలి చేష్టలు:
అమరావతి ఉద్యమం పేరిట జరుగుతున్న హంగామా. ఆర్భాటం. వెకిలి చేష్టలు అన్నీ ఇన్నీ కావు. నిజానికి ఉద్యమం లేదా పోరాటం అంటే ఎలా ఉంటుందో అందరం చూశాం. ఈ తరం వాళ్లు చూసి ఉండకపోవచ్చు. నిజమైన ఉద్యమం, పోరాటంలో చెమట, మట్టివాసన ఉంటాయి. కానీ ఈ ఉద్యమంలో రైతుల లేరు. రెక్కాడితే డొక్కాడని వారు లేరు. రూపాయి పెట్టి రూ.200 నుంచి వెయ్యి రూపాయలు వస్తాయన్న ఆశతో దిగినవారు ఉద్యమం పేరుతో నడిపిన వారు.. నిన్న చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఒకటి చంద్రబాబుగారు చేసిన హడావిడి. మరోవైపు ఎల్లో మీడియా. చేసిన కేరింతలు. ఉత్సాహాలు. బాణసంచా కాల్చారు.
అన్నింటికి పరాకాష్టగా హైకోర్టు వద్ద మోకాళ్లమీద కూర్చున్నారు. బోర్లా పడ్డారు. ఇన్ని డ్రామాలు చూశాక మాట్లాడాల్సి వస్తోంది.

పార్టీలు వ్యవస్థలను గౌరవించాలి:
ఇది ప్రజాస్వామిక దేశం. ఒక రాజ్యాంగం ఉంది. చట్టాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి వ్యవస్థ. జ్యుడీషియరీ, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్‌.. దేనికి దానికి స్వేచ్ఛ ఉంది. అయితే జ్యుడీషియరీకి ఇంకా ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది. ఎందుకంటే వ్యవస్థలో ఏమైనా లోపాలుంటే, తప్పులు జరిగితే ఎత్తి చూపుతారు. అందుకే న్యాయవ్యవస్థలో న్యాయమూర్తులు ప్రజలకు కాస్త దూరంగా ఉంటారు. ప్రశంసలు, విమర్శలకు దూరంగా ఉంటారు. అప్పుడే న్యాయం జరుగుతుందని అంతా అనుకుంటారు. అందుకే మా నాయకుడు జగన్‌ కూడా అలాగే భావిస్తారు. అందుకే ఎన్నిసార్లు కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగిలినా నిలబడుతున్నారు.
అలాగే పార్టీలు కూడా ఈ వ్యవస్థలను గౌరవించకపోతే, దానికి పార్టీగా కొనసాగే అర్హత ఉండదు. కానీ నిన్నటి పరిణామాల్లో ఏ పార్టీ అయినా బ్యాలెన్స్‌గా వ్యవహరించాలి. కానీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి.
ఇవి వ్యవస్థలకు ఎంతో ప్రమాదం. అవి ప్రజలకు కీడు చేస్తాయి. నిన్న కోర్టు ఎదుట బోర్లా పడడం చూస్తే, వారికీ (కోర్టు వారికి) ఇబ్బందికరంగానే ఉండొచ్చు.

రాజధాని తరలింపు కాదు:
పరిపాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధి మా లక్ష్యం. అమరావతిలోని 33 వేల ఎకరాల్లో లక్షల కోట్ల ఆస్తి ఉందని వారే చెబుతున్నారు. అదే మొత్తాన్ని మూడు ప్రాంతాల్లో పెడితే, అన్నీ అలాగే అభివృద్ధి చెందుతాయి కదా. నిజానికి ఇక్కడి నుంచి రాజధానిని పూర్తిగా తరలించడం లేదు. కేవలం పరిపాలన వికేంద్రీకరణ మాత్రమే. కర్నూలులో హైకోర్టు. విశాఖలో సచివాలయం ఏర్పాటు మాత్రమే యోచించాం.

వారి వైఖరి మారడం లేదు:
టీడీపీ వారు మరీ రెచ్చిపోతున్నారు. అచ్చెన్నాయుడు గత ఎన్నికల ముందు నుంచీ ఒకటే చెబుతున్నారు. తమకు 150 నుంచి 160 సీట్లు వస్తాయని అంటున్నారు. అన్ని ఎన్నికల్లో ఓడిపోతున్నా, ఇప్పటికీ ఆ పార్టీ వైఖరిలో మార్పు రావడం లేదు. నిన్నటి కోర్టు తీర్పు టీడీపీ విజయం ఎలా అవుతుంది? దాని వల్ల మీరు ప్రజలకు ఒరగబెట్టిందేమిటి? కోర్టు ఇచ్చిన తీర్పును మీరు మరో రకంగా చూపుతూ మీ విజయంగా చెబుతున్నారు.దానికి మేము సమాధానం చెప్పాల్సి వస్తోంది.

ఇక్కడ అభివృద్ధికీ కట్టుబడి ఉన్నాం:
అమరావతిలో వాస్తవ అభివృద్ధికి ప్రభుత్వం ఎప్పటికీ కట్టుబడి ఉంది. మీరు చేయనిది కూడా చేసి చూపుతుంది. పచ్చటి పొలాల్లో గుంజలు పాతి, రైతులను బెదిరించారు. భయపెట్టారు. ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో దౌర్జన్యం చేశారు. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ కట్టారు. దానికి కనీసం కనెక్టివిటీ రోడ్‌ కూడా లేదు. కరకట్ట రోడ్డు తప్ప మరొకటి లేదు. అంత అధ్వాన్నంగా మీరు పని చేశారు.

ఇక్కడ అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టే, కరకట్ట రోడ్డు విస్తరణ పనులు మొదలు పెడుతోంది. ఖాజా వరకు బైపాస్‌ రోడ్‌ నిర్మిస్తోంది. విజయవాడ చుట్టూ బైపాస్‌ రోడ్లు నిర్మిస్తోంది. విజయవాడలో ఫ్లైఓవర్‌ను వేగంగా పూర్తి చే«శాం. బెంజ్‌ సర్కిల్‌ వద్ద చాలా వేగంగా మరో ఫ్లైఓవర్‌ నిర్మించాం.

వీటన్నింటి వల్ల రైతులకు, ఇక్కడి వారికి ఎంతో మేలు జరుగుతోంది. అందుకే టీడీపీ ఎంత ప్రచారం చేస్తున్నా, 2019, ఆ తర్వాత ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడ ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు వైయస్సార్‌సీపీనే ఆదరిస్తున్నారు.

పేదలకు చోటు లేకుండా చేశారు:
ఆనాడు మా నాయకుడు జగన్‌ ఇక్కడ రాజధాని ఉండాలని చెప్పినా, అందుకోసం కేవలం ప్రభుత్వ భూమి మాత్రమే తీసుకోవాలని చెప్పారు. కానీ చంద్రబాబుగారు ఇక్కడ పక్కాగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారు. గజం భూమి కనీసం రూ.12 వేలు అన్నారు. ఆ విధంగా ఇక్కడ ఒక్క పేదవాడు కూడా ఉండకుండా చేశారు.

అసలు ఎంత మంది రైతులు?:
ఇక్కడ మొత్తం 34,385 ఎకరాల్లో 30,913 ఎకరాలు పట్టా భూములు. 28,526 రైతులకు చెందిన భూములు. ఇందులో కేవలం 1133 మంది చేతిలో మాత్రమే 10 వేలకు పైగా ఎకరాల భూమి ఉంది. అందులో దాదాపు 10,050 మంది సీఆర్డీఏ ఇక్కడ భూములు సేకరించే నాటికే తమ భూములు అమ్ముకున్నారు. ఆ భూములు కొన్న వారిలో చంద్రబాబు బినామీలు ఎక్కువ ఉన్నారు. ఆ తర్వాత సీఆర్డీఏ ప్లాట్లు చేస్తే 7500 మంది యజమానులు అమ్ముకోగా, ఇప్పుడు 11 వేల మంది వాస్తవ రైతులు ఉన్నారు. ఇదీ చరిత్ర.

అంటే మెజారిటీ రియల్టర్లు లేదా ప్లాట్లు కొని ఎక్కువ ధరకు అమ్ముకోవాలనుకున్న వారే ఇప్పుడు ఇక్కడ మిగిలారు. వాస్తవం ఇలా ఉంటే, ఇది రైతు ఉద్యమమని ప్రపంచమంతా చూపే ప్రయత్నం చేస్తున్నారు, పచ్చ కండువా వేసుకుంటే రైతులు అవుతారా. అయినా మేము వారిని అవమానించడం లేదు. కానీ వాస్తవాలు గుర్తించాలని అందరినీ కోరుతున్నాం. దీన్ని రైతు ఉద్యమం అనడం తప్పు. అది రైతు ఉద్యమం కాదు. కేవలం ప్లాట్లలో పెట్టుబడి పెట్టిన వారే ఉన్నారు.

నిజానికి అక్కడున్న రైతులను ఇంత ఛిన్నాభిన్నం చేశారు కాబట్టే, ఇక్కడ కూడా మిమ్మల్ని చిత్తుగా ఓడించారు. ఇప్పుడు భవిష్యత్తులో కూడా అదే జరుగుతుంది.రూపాయి పెట్టుబడితో వేల లాభం పొందాలని ఇక్కడ ప్లాట్లు కొన్న వారు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులే నిన్న టపాకాయాలు కాల్చారు. సంబరాలు చేసుకున్నారు. తమ ఆదాయాన్ని పోగొట్టారని వారి ఆక్రోషం. నిజానికి ప్రయోజనం పొందిన రైతుల, సామాన్యులు ప్రభుత్వాన్ని, జగన్‌ని ఆశీర్వదిస్తున్నారు.

ఎంతెంత ఖర్చు చేశారు?:
అమరావతిలో 2021, నవంబరు 23 వరకు మొత్తం రూ.8572.19 కోట్లు ఖర్చు చేస్తే, అందులో మౌలిక వసతుల కోసం చేసిన వ్యయం రూ.5674 కోట్లు మాత్రమే. మిగిలిన దాదాపు రూ.3 వేల కోట్లు వడ్డీలపై రుణాలు, కన్సల్టెన్సీల ఛార్జీలు. ఇంకా రూ.798 కోట్లు రైతులకు కౌలు కింద ఇచ్చారు.
ఈ మొత్తం కూడా సొంత డబ్బు కాదు. హడ్కో నుంచి రూ.1151 కోట్లు, అమరావతి బాండ్లు రూ.2 వేల కోట్లు, కన్సార్షియమ్‌ రుణాలు రూ.1862 కోట్లు. ఇంకా కేంద్రం నుంచి దాదాపు రూ.1500 కోట్లు రాగా, మిగిలిన మొత్తం మాత్రమే గత ప్రభుత్వం ఖర్చు చేసింది. నిజానికి అందులో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన ఖర్చు కూడా ఉంది.

ఇవాళ దారుణ మాటలు:
ఎకరానికి రూ.2 కోట్ల చొప్పున 50 వేల ఎకరాల్లో మౌలిక వసతుల కోసం లక్ష కోట్లు కావాలని మీరే అన్నారు. కానీ ఒక పద్ధతి ప్రకారం పనులు చేయకుండా, పోలవరం ప్రాజెక్టు మాదిరిగా, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దండుకోవడానికి ఇక్కడ పనులు మొదలు పెట్టాడు. అందుకే ఎక్కడెక్కడో తిరిగాడు. ప్లానింగ్‌ పేరుతో దేశదేశాలు తిరిగాడు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పెంచడానికి కృష్ణా జిల్లా అంతటా గ్రీన్‌ జోన్‌ చేశారు. అలాంటి చంద్రబాబు ఇవాళ ఇది అమరావతి రైతుల విజయం అంటున్నాడు. ఇంతకన్నా దారుణం మరొకటి కాదు.

కానీ మా నాయకుడు జగన్‌ మాత్రం చిత్తశుద్ధితో ఉన్నారు. చెప్పిన దానికి కట్టుబడి ఉన్నారు. అందుకే కోవిడ్‌ కష్టకాలంలో ఎన్ని సమస్యలున్నా ప్రజలకు మేలు చేయడం ఆపలేదు. వారిని అన్ని రకాలుగా ఆర్థికంగా ఆదుకున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ.. పరిపాలన వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నారు. దీన్ని ప్రజలూ ఆదరిస్తారు. మాకు ఆ నమ్మకం ఉంది.
కానీ ఆ జ్ఞానం చంద్రబాబుకు లేదు. అందుకే ఎవరినో ఒకరిని పట్టుకుని రావాలని చూస్తున్నారు. లేదా తప్పుడు సమాచారం ఇస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

మీడియా ప్రశ్నలకు సమాధానంగా..

ఏనాడో చరిత్రహీనుడు:
చంద్రబాబు ఏనాడో చరిత్రహీనుడయ్యాడు. మామకు వెన్నుపోటు పొడిచి అధికారం చేపట్టాడు. సొంతంగా ఒక్కటన్నా ఒక్క పని చేయలేదు. ఎవరో ఒకరి తోడు లేకుండా ఏ ఎన్నికల్లోనూ గెలవలేదు. ఇప్పుడు కూడా కేవలం మీడియాను నమ్ముకుని పని చేస్తున్నాడు. 10 మంది ఉంటే 100 మంది ఉన్నట్లు చూపుతున్నారు. ప్రతి చిన్న పనికి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ రాజకీయం చేస్తున్నారు.

ప్రజలకు వాస్తవాలు తెలుసు. అందుకే 2019లో చంద్రబాబును పక్కన పెట్టారు. ఆ తర్వాత కూడా అన్ని ఎన్నికల్లో ఓడించారు. ఒక నలుగురిని చూపడం, వారి వెనక లక్షల మంది ఉన్నారని చూపే ప్రయత్నం చేయడం చేస్తున్నారు. ఆ తర్వాత పెయిడ్‌ ఆర్టిస్టులు. ఆ విషయాన్ని ఒకరు స్వయంగా చెప్పారు. తమకు నెలకు రూ.2 లక్షలు ఇస్తారని.

మా లక్ష్యం న్యాయబద్ధం..:
నిన్నటి పరిణామాలపై ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చిస్తుంది. వచ్చే అసెంబ్లీలోనూ చర్చిస్తుంది. మా లక్ష్యం న్యాయబద్ధమైంది. ప్రజల ఆకాంక్షలకు సంబంధించింది. కాబట్టి దాని నుంచి వెనకడుగు వేయబోము. అయితే ఎలా సాధించాలనేది కూడా చూస్తాం. ఒక్కో అడుగు ముందుకు వేస్తాం. మేము ప్రభుత్వంలో ఉన్నాం. చాలా బలమైన ప్రభుత్వం మాది. మా నాయకుడు ఒక ధీశాలి. ఆయన ఎక్కడా బెదరడు. అన్నీ ఆలోచించి పని చేస్తారు. నమ్మిన దానికే కట్టుబడతాడు.

ఆయనది కుల రాజకీయం:
ఒక కులాన్ని ఎత్తుకున్నదే చంద్రబాబు. ఒకప్పుడు కమ్మ కులం చాలా ప్రోగ్రెస్సివ్‌గా ఉండేవారు. బిజినెస్‌లోనే కాకుండా, నీటి సదుపాయం ఉంటే ఎక్కడికైనా వెళ్లి సాగు చేసే వారు. దీన్ని అందరం చూశాం. అలాంటి వారికి ఈ జాడ్యం అంటించాడు. ఎక్కడైనా ఒక కులం, వర్గాన్ని నమ్ముకున్న వారు రాజకీయాల్లో ఎదగలేదు.జగన్‌ అందరి అభివృద్ధి ఆకాంక్షిస్తున్నారు. అందుకే కులం, మతం, వర్గాలకు అతీతంగా ఆలోచిస్తారు. ఆ ప్రక్రియలోనే పరిపాలన వికేంద్రీకరణ కసరత్తు జరుగుతోంది.

నిష్పాక్షిక దర్యాప్తు కోరుకున్నాం:
వివేకానందరెడ్డి హత్య కేసులో ఒక మీడియా వర్గం.. కేవలం ఒకవైపు కోణాన్ని మాత్రమే హైలైట్‌ చేస్తోంది. సీఆర్పీసీ–161 స్టేట్‌మెంట్లలో కూడా తమకు అనుకూలంగా ఉన్న వాటినే రాస్తున్నారు. అందుకే సీబీఐ దర్యాప్తులో లోపాలను మేము ప్రశ్నిస్తున్నాం. అంతకు ముందు సిట్‌ చేసిన దర్యాప్తును, ఆ నివేదికలను ఎందుకు పట్టించుకోవడం లేదని గుర్తు చేస్తున్నాం.

వివేకానందరెడ్డి రాసిన లెటర్‌ను సాయంత్రం వరకు ఎందుకు దాచి పెట్టారు?. ఆయన ఫోన్‌ను సాయంత్రం వరకు పోలీసులకు ఎందుకు అప్పగించలేదు? దాంట్లో నుంచి ఏమేం డిలీట్‌ చేశారో బయటకు తీయమంటున్నాం. ఆ కేసులో మా ప్రభుత్వం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ నిష్పాక్షిక దర్యాప్తు కోరుకుంటోంది.. అని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE