-పార్టీ ఆవిర్భావ వేడుకలు జయప్రదం పై క్యాడర్ కు చంద్రబాబు అభినందనలు
-టీడీపీ సత్తా చాటేలా ఆవిర్భావ వేడుకలు జరిగాయి
-విద్యుత్ చార్జీల బాదుడుపై ప్రభుత్వంపై పోరాటం
-పార్టీ రాష్ట్రవ్యాప్త కార్యకర్తలు, నేతలతో టెలికాన్ఫరెన్స్ లో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం దిగ్విజయం పట్ల పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు గారు పార్టీ శ్రేణులకు, ప్రజలకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ.. నిన్నటి తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భార దినోత్సవ వేడుకలు అంతటా ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా కార్యక్రమం విజయవంతానికి కృషిచేసిన, భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి. తెలుగురాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో 200 సిటీల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నా. ప్రపంచ వ్యాప్తంగా తెలుగుదేశం జెండా రెపరెపలాడింది. అందరూ స్వచ్ఛందంగా ఆవిర్భావ దినోత్స వేడుకల్లో పాల్గొనేందుకు ముందుకు వచ్చారు. ఇదీ తెలుగుదేశం పార్టీ సత్తా. ఇది శుభసూచికం. అందరూ వేడుకల్లో సమర్థంగా భాగస్వాములయ్యారు. తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది అనేందుకు నిన్నటి ప్రజల భాగస్వామ్యమే నిదర్శనం.
అందరి నరనరాన పార్టీ జీర్ణించుకుపోయింది. ఎన్టీఆర్ గారు స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశారు. మంచి ముహూర్తాన పార్టీని ప్రారంభించారు. అనేక సంక్షోభాలను ఎదుర్కొని నిలిచాం. యూత్ కు 40 శాతం సీట్లు ఇస్తామని నిన్న ప్రకటించడం జరిగింది. ఈ దిశగా పనిచేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని మళ్లీ పునర్ నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. పార్టీలో 70 లక్షల మంది క్రియాశీల కార్యకర్తలు ఉన్నారు.
మనం అందరం ఒక కుటుంబం. కార్యకర్తల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. వచ్చే ఎన్నికల కోసం అన్ని విధాలుగా సమాయత్తం కావడం జరుగుతుంది. పేదరికం లేని సమాజమే మన లక్ష్యం. అసమానతలు తొలగించాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ కు భారతరత్న వచ్చే వరకు కృషిచేయడం జరుగుతుంది. కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఇవ్వడం జరిగింది.
విద్యుత్ ఛార్జీలు పెంచి పేదవారిపై జగన్ రెడ్డి మళ్లీ భారం మోపారు. దీనిని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతూ రైతుల మెడకు ఉరితాడు బిగిస్తున్నారు. దీనిని వ్యతిరేకించాలి.