– ఉచిత కరెంటు పేటెంట్ వైయస్
– వైయస్సార్ స్మారక అవార్డుల పంపిణీలో
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచనలను, కాంగ్రెస్ భావ జాలాన్ని రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం సాయంత్రం హైదరాబాదులోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన వైయస్ స్మారక అవార్డుల కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. వైయస్ చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని 10 లక్షల కు పెంచాం, అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 21 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాం, తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా కింద అన్నదాతల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర అందించడమే కాకుండా సన్నధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల చొప్పున బోనస్ అందిస్తున్నామని వివరించారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి నడివే వేసవిని లెక్క చేయకుండా తన సుదీర్ఘ పాదయాత్రలో రాష్ట్రంలోని తాడిత, పీడితులు, రైతుల సమస్యలను తెలుసుకుని అవగాహన చేసుకున్నారు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే మొదటి సంతకం ఉచిత విద్యుత్ పై చేశారని వివరించారు. భారతదేశంలో ఎవరైనా ఉచిత విద్యుత్తు అందజేస్తున్నారు అంటే అది వైయస్ రాజశేఖర్ రెడ్డి పేటెంట్ అన్నారు. వైఎస్ పిసిసి అధ్యక్షుడిగా, సీఎల్పీ నేతగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారితో కలిసి పనిచేసే అవకాశం తనకు దక్కిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.