– సర్వే కోసం ఉపాధ్యాయ సంఘాల సూచనలు ఆచరణలో పెడతాం
– ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్ : చారిత్రాత్మక కుల గణన సర్వేలో ఉపాధ్యాయులను భాగస్వాములను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం ఆయన మంత్రులు దుదిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తో కలిసి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు, సర్వే ప్రాధాన్యత, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనను డిప్యూటీ సీఎం వివరించారు.
ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి వస్తుంది, ఈ దేశ వనరులు అందరికీ సమానంగా పంచాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఎన్నికల సభలో రాహుల్ గాంధీ తోపాటు మేమంతా స్పష్టం చేశాం. అనుకున్న మేరకు అధికారంలోకి వచ్చాం. ఎన్నికల హామీలు అమలులో భాగంగా కుల గణన చేపట్టాలని నిర్ణయించాం.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఉపాధ్యాయులను భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, యావత్ క్యాబినెట్ నిర్ణయించి మీ ఆలోచనలను తెలుసుకోవాలని కోరారు. ఆ మేరకు ఉపాధ్యాయ సంఘాలను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయానికి ఆహ్వానించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. సామాజిక స్పృహ కలిగిన వారు, గురుతర బాధ్యత ఎరిగిన వారు ఉపాధ్యాయులని తెలిపారు.
ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరినట్టు ఉదయం వేళల్లో సర్వే నిర్వహించడం, సెప్టెంబర్ 9 నుంచి 15 వరకు వరుస సెలవుల మధ్య సర్వే చేపట్టడం, సెలవు రోజుల్లో సర్వే విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు పరిహారంతో కూడిన సెలవులు (ccl) మంజూరు చేయడం, సర్వేకు సంబంధించి సమాజంలో విస్తృత ప్రచారం చేయాలని ఇచ్చిన సూచనలు అన్నిటిని ఆచరణలో పెడతామని డిప్యూటీ సీఎం తెలిపారు.
సర్వే విధుల్లోకి వెళ్లే ఉపాధ్యాయ, ఉద్యోగ లోకానికి సమాజం పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతుందని తెలిపారు. అద్భుతమైన సమాజాన్ని తెలంగాణలో నిర్మించేందుకు ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నడవాలని కోరారు. సోషియో, ఎకనామిక్ ఎడ్యుకేషన్, పొలిటికల్ ఎంప్లాయిమెంట్ రంగాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకునేందుకు సర్వే ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు.
గతంలో మేము చేపట్టిన సకల జనుల సర్వే ఎటు పోయిందో ఎవరికి తెలియదని, ప్రస్తుత ప్రభుత్వం కోరుకున్న విధంగా సర్వే చేయడానికి ఉపాధ్యాయ లోకం సంపూర్ణంగా సిద్ధంగా ఉందని ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌకతలి తెలిపారు. ఉపాధ్యాయులు అయితేనే సర్వే బాగా చేస్తారని నమ్మకం మాపై ఉంచినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు అని పి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి తెలిపారు.
సర్వేలో పాల్గొనే ఉపాధ్యాయులకు ccl పరిహారంతో కూడిన సెలవును మంజూరు చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య కోరారు. సర్వేలో పాల్గొని ఉపాధ్యాయులకు స్పెషల్ CL తోపాటు, ఇన్సెంటివ్ ఇవ్వాలని డిటిఎఫ్ అధ్యక్షుడు లింగారెడ్డి కోరారు. ఆదివాసి ఉపాధ్యాయ సంఘం ఏర్పడి 12 ఏళ్లు కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే సమావేశాలకు ఆహ్వానించి గౌరవిస్తున్నందుకు ధన్యవాదాలు అని ఆదివాసి టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవి తెలిపారు.
ఎన్నికలు, జన గణన వంటి కీలక కార్యక్రమాలు ఉపాధ్యాయులు లేకుండా పూర్తి కావని, కుల గణన సర్వేలోనూ సంపూర్ణంగా సహకరిస్తామని యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి తెలిపారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసేవి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి సందర్భంలోనూ మమ్ములను పిలిపించి మాట్లాడుకుని మా అభిప్రాయాలు తెలుసుకుంటుందని మోడల్ స్కూల్స్ రాష్ట్ర అధ్యక్షుడు కొండయ్య అభినందించారు.
ఎవరి జనాభా ఎంత ఉందో, ఎక్కడ ఉన్నారో సరిగా లెక్కలు లేవు కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణనాథ ద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేయడం సంతోషకరమైన విషయమని ఎస్సీ, ఎస్టీ ప్రజా సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు జాజుల వెంకటేశ్వరరావు తెలిపారు. సమావేశంలో మొత్తం 13 ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు సమావేశంలో పాల్గొని వారి అభిప్రాయాలు తెలియజేశారు.