– మీ తండ్రి హయాంలోనే 164 మంది కార్యకర్తలను చంపారు. అప్పుడే భయపడలేదు
– ప్రతిపక్షంలో ఉన్నా జగన్ రెడ్డిలో మార్పు రాలేదు..
– ఇంకా హెలికాఫ్టర్లలోనే తిరుగుతున్నారు
– పరామర్శకు వెళ్లి ముగ్గురిని చంపారు
– నిబంధనలు పాటించమంటే ఎదురుదాడి చేస్తున్నారు
– కార్యకర్త కారు కింద పడితే కనీసం దిగి చూడలేదు
– తెలుగుదేశం పార్టీ గుండెచప్పుడు కార్యకర్త
– సమస్యలు తెలుసుకునేందుకే కార్యకర్తలతో సమావేశాలు
– టీడీపీ కార్యకర్తలు అలక మానుకోవాలి, ప్రజలకు దగ్గరవ్వాలి
– నెల్లూరు పట్టణ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో మంత్రి నారా లోకేష్
నెల్లూరు: ప్రతిపక్షంలో ఉన్నా మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిలో మార్పు రాలేదని, ఇప్పటికీ హెలికాఫ్టర్లలోనే తిరుగుతున్నారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో పట్టణ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా మనుషుల్ని చంపుకుంటూ వెళ్తున్నారు. పల్నాడు జిల్లా పర్యటనలో ఒకరిని పరామర్శించడానికి వెళ్లి ముగ్గురిని చంపారు. ఒకరిని కారు కింద పడేసి చంపారు. రెండో వ్యక్తి ఊపిరాడక చనిపోయారు. మూడో వ్యక్తి అంబులెన్స్ లో ఇరుక్కుపోయారు.
జనసమీకరణ మనం చేయలేక కాదు.. మనవల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదు. కార్యకర్త కారు కిందపడితే కనీసం దిగి చూడలేదు. కార్యకర్తను రోడ్డున పక్కన పడేసి వెళ్లిపోయారు. దిగి చూసి ఆసుపత్రికి పంపించి ఉంటే బతికేవాడు. బాధిత కుటుంబం తల్లిని తీసుకువచ్చి కనీసం కూర్చోపెట్టలేదు. గ్లాస్ మంచినీరు అయినా ఇచ్చారా? సొంత కార్యకర్త చనిపోతే నిల్చొని రెండు భుజాలు తట్టి వెళ్లిపోయారు.
వైసీపీ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలి. బ్లేడ్ బ్యాచ్ ను, గంజాయి బ్యాచ్ ను ప్రోత్సహిస్తున్నారు. మీ తండ్రి హయాంలోనే 164 మంది కార్యకర్తలను చంపారు. అప్పుడే భయపడలేదు. మీ రప్పా, రప్పాకు భయపడతామా? ప్రతిపక్షంలో ఉండగా బాబు ఇంటి గేటుకు తాళ్లు కట్టారు. వీరు మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తిరిగే హక్కు ఉంది. తిరగమంటే మనుషులను చంపుతున్నారు. నిబంధనలు పాటించమంటే ఎదురుదాడి చేస్తున్నారు. చిన్నసందులో వెళ్తా, మరో ముగ్గురుని చంపుతా అంటున్నారు.
తెలుగుదేశం పార్టీ గుండెచప్పుడు కార్యకర్త
తెలుగుదేశం పార్టీ గుండెచప్పుడు కార్యకర్త. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డారు. అంజిరెడ్డి తాత, మంజులారెడ్డి, తోట చంద్రయ్య, చెన్నుపాటి గాంధీలే నాకు స్ఫూర్తి. కార్యకర్తల పోరాటాన్ని విస్మరించకూడదు. నన్ను అనేక విధాలుగా అవమానించారు. 164 సీట్లతో రికార్డ్ బ్రేక్ చేశాం. దేశ చరిత్రలో 94శాతం సీట్లు కూటమి కైవసం చేసుకుంది. ఇందుకు కారణం కార్యకర్తలే.
నియోజకవర్గ పర్యటనలో ముందుగా కార్యకర్తలను కలిసిన తర్వాతే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం. కార్యకర్తల సమస్యలు తెలుసుకునేందుకే సమావేశాలు ఏర్పాటుచేయడం జరుగుతోంది. ఏదైనా నిర్ణయంలో సమస్యలు ఉంటే వెనక్కి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లే వ్యవహరించాలి. నేడు పోలీసులు మనకు సెల్యూట్ చేస్తున్నారు. ఇదే పోలీసులు మనం ప్రతిపక్షంలో ఉండగా ఇబ్బందులకు గురిచేశారు.
టీడీపీ కార్యకర్తలు అలక మానుకోవాలి
మనకు ఉన్న పెద్ద జబ్బు అలగడం. పార్టీలో సంస్కరణల కోసం నేను పోరాడుతున్నా. కొన్ని నిర్ణయాలు తప్పు కావచ్చు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం పోరాడుతున్నా. ఒక్కసారి చంద్రబాబు నిర్ణయం తీసుకున్న తర్వాత తలవంచి పనిచేస్తా. పార్టీ ఫస్ట్, కార్యకర్తలు ఫస్ట్. కార్యకర్తలు అలక మానుకోవాలి. మన సమస్యలు కలిసికట్టుగా కూర్చొని మనమే పరిష్కరించుకోవాలి.
కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. తల్లికి వందనం అమలుచేశాం. అన్నా క్యాంటీన్లు ఏర్పాటుచేశాం. దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. పెద్దఎత్తున పెన్షన్లు అందజేస్తున్నాం. డీఎస్సీ ద్వారా ఆగస్టు నాటికి ఉపాధ్యాయ నియామకాలు చేపడతాం. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం. రూ.2వేల కోట్లతో రోడ్ల మరమ్మతులు చేపట్టాం. ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం.
టీసీఎస్, కాగ్నిజెంట్, రిఫైనరీ పరిశ్రమలు వస్తున్నాయి. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యం అందిస్తున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ అందిస్తున్నాం. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. జగన్ రెడ్డి అహంకారం వల్లే 151 సీట్లు 11 అయ్యాయి. ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడాలి. బాధ్యతగా పనిచేయాలి. మార్పుకోసం, ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చామని గుర్తుంచుకోవాలన్నారు.
సమన్వయ సమావేశం అనంతరం దాదాపు 1500 మందిని మంత్రి నారా లోకేష్ కలిశారు. వివిధ సమస్యలపై ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కరించి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రతిఒక్కరితో కలిసి ఫోటోలు దిగారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పి.నారాయణ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎన్ ఎండీ ఫరూఖ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజీజ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, బీద రవిచంద్ర యాదవ్, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు ఛైర్మన్ కేపీ చౌదరి తదితరులు పాల్గొన్నారు.