– అదానీ బలోపేతం కావాలంటే మోదీకి ఓటేయాలి
– సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నరు
– ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ నేతల వరుస సమావేశాలపై మంత్రి హరీశ్ రావు
ప్రస్తుతం తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్నది. ఏ కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రంతో పోల్చినా మనం అగ్రభాగాన ఉన్నాం. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది అనే స్థాయికి చేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది.
తెలంగాణ తరహా పథకాలు కావాలని దేశవ్యాప్తంగా కోరుతున్నారు. మేము మహారాష్ట్రకు వెళ్లినప్పుడు తెలంగాణ పోలీసులకు ఇస్తున్న ఇన్సెంటివ్‌ల గురించి అక్కడి పోలీసులు అడిగి తెలుసుకున్నారు. మాకూ ఇలాంటివి కావాలని అన్నారు.
తెలంగాణ ప్రజలు తెలివైనవాళ్లు, సీఎం కేసీఆర్ పాలనను కాదనుకోరు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్రంలో రెండో స్థానం కోసమే. సీఎం కేసీఆర్ ఉన్నంత కాలం ఆయన నాయకత్వానికే ప్రజలు ఓటేస్తారు. సీఎం కేసీఆర్‌కు 56 ఇంచుల ఛాతీ లేదేమోగానీ.. తెలంగాణలో ప్రతి ఇంచుమీద అవగాహన ఉన్నది. ప్రతిపక్షాల్లో మంత్రి పదవులు మార్చినా, అధ్యక్షులు మార్చినా, నాయకులను బుజ్జగించినా రాష్ట్ర ప్రజల ఆలోచనల్లో మార్పు రాదు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సురక్షితంగా ఉన్నది. తొమ్మిదేండ్లలో కర్ప్యూ లు లేవు, అల్లర్లు లేవు. రాష్ట్రంలో అనేక సమస్యలకు సీఎం కేసీఆర్ శాశ్వత పరిష్కారం ఇచ్చారు. ఇలా ఇంకా ఎవరైనా ప్రయత్నం చేశారా? మేము ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా ఉన్న సమయంలో అసెంబ్లీ మొదలు కాగానే నీళ్ల కోసం ఖాళీ కుండల ప్రదర్శన, కరెంటు కోసం కందెనల ప్రదర్శన జరిగేది. ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో ఇవి నిత్యకృత్యం. తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణలో అలాంటివి కనిపించాయా?
మధ్యప్రదేశ్‌లో ఎరువులు దొరుకక తొక్కిసలాట జరిగి 8 మంది రైతులు చనిపోయారు. ఇదీ డబుల్ ఇంజిన్ సర్కార్ దుస్థితి. తెలంగాణలో ఎరువుల కొరత ఉన్నదా? కరంటు కొరత ఉన్నదా? పైగా పండిన ప్రతి గింజను ప్రభుత్వమే కొంటున్నది.
తమకు బియ్యం కావాలని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు తెలంగాణను అడుగుతున్నాయి. మనకంటే భౌగోళికంగా, జనాభా పరంగా పెద్ద రాష్ట్రాలు బియ్యం అమ్మండి మహాప్రభో అని తెలంగాణను అడిగే స్థితికి తెచ్చింది సీఎం కేసీఆర్ పాలన వల్ల కాదా?. మనం తినడమే కాదు పొరుగు రాష్ట్రాలకు తిండిపెట్టే ధాన్యాగారంగా తెలంగాణ మారింది బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల కాదా?
సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నరు.. ఆరోగ్యంగా ఉన్నరు.. సురక్షితంగా ఉన్నరు. కాబ్టటి ప్రజలు కేసీఆర్ పాలననే కోరుకుంటారు. ఎన్ని జిమ్మిక్కులు, ప్రయత్నాలు చేసినా కేసీఆర్ ముందు నడువవు.
మొన్నటిదాదకా బీఆర్ఎస్కు బలమే లేదు అన్నవాళ్లు.. ఇప్పుడు సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన తర్వాత ఉలిక్కి పడి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ప్రతి ఎకరాకు నీళ్లు, 24 గంటల కరంటు గురించి మాట్లాడుమంటే మా మీద బురద చల్లుతున్నారు. ఇవన్నీ మాకు కొత్త కాదు. గతంలో టీఆర్ఎస్ మొదలైనప్పుడు పాలపొంగు అని, నీటి బుడగ అని, తెలుగుదేశం ఏజెంట్ అని, కాంగ్రెస్ ఏజెంట్ అని రకరకాలుగా అన్నారు. మేం తెలంగాణ ప్రజలకు మాత్రమే ఏజెంట్లమని అప్పుడు చెప్పినం, కొట్లాడినం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చారు.
ఇప్పుడు కూడా మేం ఎవరికీ ఏజెంట్లం కాదు.. రైతులకు, బడుగు బలహీన వర్గాలకు, ప్రజలకు ఏజెంట్లమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో అదానీ బలోపేతం కావాలంటే మోదీకి ఓటేయాలి. తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో అదానీ బాగుపడ్డాడు తప్ప.. ఏ రంగంలో గుణాత్మక మార్పు వచ్చిందో చెప్పగలరా?