Suryaa.co.in

Andhra Pradesh

ప్రతిభావంతులకు రూ.60 లక్షల విలువైన ఉపకరణాలను అందజేస్తున్నాం

– గుర్తింపు, ఎంపిక శిబిరానికి అనూహ్య స్పందన
– గుడివాడ నియోజకవర్గంలో 381 మంది ఎంపిక
– వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి

గుడివాడ, డిసెంబర్ 28: గుడివాడ నియోజకవర్గంలోని గుడివాడ పట్టణం, రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లోని విభిన్న ప్రతిభావంతులకు రూ.60 లక్షల విలువైన ఉపకరణాలను అందజేస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ చెప్పారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని కైకాల పురపాలక కళామందిరంలో విభిన్న ప్రతిభావంతులకు నిర్వహించిన ఉపకరణాల ఎంపిక, గుర్తింపు శిబిరానికి అనూహ్య స్పందన వచ్చిందని తెలిపారు. గుడివాడ నియోజకవర్గంలో 102 మంది విభిన్న ప్రతిభావంతులకు వినికిడి పరికరాలు, 78 మందికి బ్యాటరీతో నడిచే మూడు చక్రాల బండ్లు, 68 మందికి ట్రై సైకిళ్ళు, 41 మందికి వీల్చైర్లు, నలుగురికి ఎలక్ట్రికల్ కేన్లు, 11 మందికి ఎంఆర్ కిట్లు, 27 మందికి ఇతర పరికరాలు, 50 మందికి కృత్రిమ అవయవాలను అందజేయడం జరుగుతుందన్నారు. కృత్రిమ అవయవాలకు సంబంధించిన కొలతలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులకు ఉచితంగా ఉపకరణాలను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తోందన్నారు.

ఈ శిబిరాల్లో ఎంపికైన విభిన్న ప్రతిభావంతులకు తర్వాత నిర్వహించే శిబిరాల్లో ఉపకరణాలను అందజేయడం జరుగుతుందన్నారు. మూడు చక్రాల సైకిళ్ళు, చక్రాల కుర్చీలు, చంక కర్రలు, వినికిడి యంత్రాలు, అంధుల కర్రలు, పాఠ్యాంశాల పరికరాలు, కృత్రిమ అవయవాలు, కాలిపర్స్ వంటి ఉపకరణాలను విభిన్న ప్రతిభావంతులు అవసరం మేరకు తయారు చేసి పంపిణీ చేస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దివ్యాంగులను అన్ని విధాలా ఆదుకుంటోందన్నారు.

దివ్యాంగుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. అర్హులైన దివ్యాంగులందరికీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లను కూడా పంపిణీ చేస్తోందన్నారు. మంత్రి కొడాలి నాని నాయకత్వంలో గుడివాడ నియోజకవర్గంలో ఉపకరణాల పంపిణీకి నిర్వహించిన ఎంపిక, గుర్తింపు శిబిరంలో 381 మందిని అర్హులుగా గుర్తించామన్నారు. వీరందరికీ ఉ పకరణాలు అందేలా చూస్తామని దుక్కిపాటి శశిభూషణ్ చెప్పారు. వికలాంగుల సంక్షేమశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బీ రామ్కుమార్ మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గంలోని గుడివాడ పట్టణం, రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల నుండి పెద్దఎత్తున విభిన్న ప్రతిభావంతులు ఎంపిక, గుర్తింపు శిబిరానికి వచ్చారని, వీరందరికీ ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అలింకో టెక్నీషియన్ స్వస్తిక్, ఆడియాలజిస్ట్ జయచంద్ర, రాజేష్, నందివాడ ఎంపీపీ పెయ్యల ఆదాం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడ మట్టా జాన్విక్టర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE