– వైటీడీ ఏర్పాటును స్వాగతిస్తున్నాం
– హిందూ ధార్మిక ప్రచారం కోసం 5 కోట్లు కేటాయించాలి
– ప్రపంచంలోనే పూర్తి కృష్ణశిలతో నిర్మించిన ఏకైక దేవస్థానం యాదగిరి గుట్ట
– యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు పై శాసన సభలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్ : కేసిఆర్ నాయకత్వంలో యాదగిరి గుట్ట లక్ష్మి నరసింహస్వామి దేవస్థానం పునర్నిర్మాణం లో భాగస్వామ్యం కావడం నా అదృష్టం.నిర్మాణం పనులప్పుడు పగటి పూట పనుల పురోగతి సరిగ్గా లేకపోతే.. కేసిఆర్ ఆదేశాలతో రాత్రి పూట అక్కడికి పోయి ..అక్కడే పడుకొని ఉదయం 5 గంటల నుండి నిర్మాణ పనులు చూసేది. ఆర్ అండ్ బి మంత్రిగా ఉన్నా.. ఒకే వాహనంలో వెళ్లి పనులు చూస్కుని వచ్చేది. ప్రపంచంలోనే పూర్తి కృష్ణశిలతో నిర్మించిన ఏకైక దేవస్థానం యాదగిరి గుట్ట. సభ్యులు కొంత మంది ఏదో విమర్శ చేయాలని మాట్లాడుతున్నారు. కానీ ప్రధాన ఆలయంను మేము ముట్టుకోలేదు.
అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని, ఆగమ శాస్త్ర ప్రకారం,పండితులతో అనేక సార్లు చర్చించి పునర్ నిర్మాణానికి పూనుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో..తెలంగాణ లో యాదగిరి గుట్ట లక్ష్మి నరసింహస్వామి దేవస్థానం ప్రసిద్ధి చెందాలని కేసిఆర్ భావించారు.యాదగిరి గుట్ట వద్ద కొత్త పుష్కరిణి,కళ్యాణ కట్ట ఏర్పాటు చేశాం. కళ్యాణ కట్ట లో ఒకే సారి సుమారు 3వేల మంది తలనీలాలు సమర్పించుకోవచ్చు. మహిళలకు ప్రత్యేకంగా స్నానపు,బట్టలు మార్చుకునే గదులు ఏర్పాటు చేశాం.
ఆలయ సప్తతల గోపురం మాములుగా సిమెంట్ తో కడతారు..కానీ మేము పూర్తిగా కృష్ణశిలతో నిర్మించాం. ఒక్కో సందర్భంలో 400 మంది శిల్పులు ఏక కాలంలో పనిచేశారు. ఎప్పటికప్పుడు కేసిఆర్ మానిటరింగ్ చేసేవారు. మా హయంలోనే షాపింగ్ కాంప్లెక్స్ కూడా 80శాతం మేము పూర్తి చేశాం. 3వేల వాహనాల పార్కింగ్ కోసం స్థలం సేకరించి పెట్టాం. దాన్ని సరిగ్గా వినియోగించుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తున్నా.
కేసిఆర్ సూచనల మేరకు విమానగోపురం తాపడం కోసం 60 కిలోల బంగారం సేకరించి పెట్టాం. నేను మా వియ్యంకుడు కలిసి కిలో బంగారం ఇచ్చాం. అప్పటి మా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బంగారం ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి విమాన గోపురం ప్రారంభించింది. వారికి శుభాకాంక్షలు. వైటీడీ ఏర్పాటును స్వాగతిస్తున్నాం. మేము చేయాలనుకున్నాం.మీకు అవకాశం వచ్చింది. హిందూ ధార్మిక ప్రచారం కోసం కోటి రూపాయలు కేటాయించారు. అవి సరిపోవు.కనీసం 5 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి సూచిస్తున్న.