తిరుపతిలో ప్రజలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ
వికేంద్రీకరణపైనే చర్చ
మూడు రాజధానులకు పెరుగుతున్న మద్దతు
జిల్లాలో సభలు, సమావేశాల ఏర్పాటుకు సన్నద్ధం
ప్రజల్లో పెల్లుబికిన రాజకీయ చైతన్యం
హైకోర్టు రావడం వారికి ఇష్టం లేదా..?
సీమ ప్రజల మనోభావాలు దెబ్బతీయొద్దని హితవు
తిరుపతి : ఇప్పుడు జిల్లాలో ఎక్కడ చూసినా అభివృద్ధి వికేంద్రీకరణపైనే చర్చ సాగుతోంది. మూడు రాజధానులకు మద్దతు అంతకంతకూ పెరుగుతోంది. సభలు, సమావేశాల రూపంలో సీమ సమాజం చైతన్యవంతమవుతోంది. కర్నూలును న్యాయ రాజధానిగా తీర్చిదిద్దాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. గతంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలనే ఆకాంక్ష ఆకాశాన్నంటుతోంది. ఎవరితో గొడవలొద్దని.. రాయలసీమ అభివృద్ధే తమ మంత్రమని ప్రజానీకం విన్నవిస్తోంది. రాయలసీమ అభివృద్ధికి వ్యతిరేకంగా అమరావతి రైతుల పేరుతో చేపట్టిన యాత్ర జిల్లావ్యాప్తంగా చర్చకు తెరతీసింది. సీమ ప్రజల మనోభావాలు దెబ్బతీసేందుకే ఇక్కడ యాత్ర చేస్తున్నారా? అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కర్నూలులో హైకోర్టు ఏర్పాటును అడ్డుకుంటూ ఇక్కడే యాత్ర చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. రెండు రోజులుగా టీ అంగళ్లు, పార్కులు, వాకింగ్ ప్రదేశాలు ఇలా నలుగురు చేరితే ఇదే హాట్ టాపిక్‌గా మారింది. దీనికితోడు అలిపిరికి వెళ్లాల్సిన యాత్రను తిరుపతి నగరంలోని అనేక వీధుల్లో తిరిగేలా రూట్‌మ్యాప్ చేయడంపై నగరవాసులు భగ్గుమంటున్నారు. ఇది ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేందుకే చంద్రబాబు ఇలాంటి డ్రామాలు చేయిస్తున్నారని విమర్శిస్తున్నారు. అమరావతి రైతుల పేరుతో సాగుతున్న యాత్ర వెనుక కుట్రకోణం ఉందని ఆరోపిస్తున్నారు. ఈ గడ్డపై పుట్టిన చంద్రబాబు సీమకు వ్యతిరేకంగా యాత్ర చేయించడం సిగ్గుచేటని మండిపడుతున్నారు.
సీమ ప్రయోజనాలే లక్ష్యంగా : మూడు రాజధానులకు మద్దతుగా, సీమ ప్రయోజనాలే లక్ష్యంగా మేధావులు, విద్యార్థులు నడుం బిగించారు. దీనిపై కొన్ని రోజులుగా సంఘీభావ సభలు నిర్వహిస్తున్నారు. పాదయాత్రకు మద్దతిస్తున్న వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిస్తున్నారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం కర్నూలులోని రాజధానిని త్యాగం చేశామని గుర్తు చేస్తున్నారు. న్యాయ రాజధానిని ఇప్పుడు సాధించకపోతే ఇక ఎప్పటికీ వెనకబడి ఉండాల్సిందే అని హెచ్చరిస్తున్నారు. ఈనెల 17వ తేదీన సీమ ప్రయోజనాల పరిరక్షణకు తిరుపతి వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు.
కనువిప్పు కలిగేలా : రైతుల పేరుతో సాగుతున్న పాదయాత్ర మంగళవారం తిరుపతిలోని పలు వీధులను చుట్టనుంది. ప్రజలు తమ విన్నపాలను సున్నితంగా తెలియజేసేందుకు స్వచ్ఛందంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. యాత్రలోని ప్రతి ఒక్కరికీ కనువిప్పు కలిగేలా నగరంలోని పలు ప్రాంతాల్లో బోర్డులు పెట్టారు. రాయలసీమ అభివృద్ధి మీకు ఇష్టం లేదా? హైకోర్టు రావడం మీకు ఎందుకు ఇష్టం లేదో చెప్పండి? మాతో మీకు ఎలాంటి గొడవలు వద్దు? మా విన్నపాలను గౌరవించండి? మాకు రావాల్సిన హక్కులను అడ్డుకోకండి? అంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు.