– “తిరుపతి@నో బార్స్” నినాదం
– నవీన్ కుమార్ రెడ్డి
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అంచలంచెలుగా మధ్యపాన నిషేధం చేస్తాం అని ప్రకటించిన సీఎం తిరుపతి పవిత్రతను దృష్టిలో వుంచుకొని కనీసం “బార్” లను పూర్తిగా రద్దు చేసి హిందూ సంప్రదాయాన్ని గౌరవించాలి!
తిరుపతిలో బార్ అనుమతికి గత సంవత్సరం 30 లక్షలు చెల్లించిన వారు నిన్న ఈ ఆక్షన్ టెండర్లలో ఏకంగా 1 కోటి యాబై లక్షలకు తీసుకోవడం అంటే కచ్చితంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేయాలి,నాణ్యత లేని కల్తీ మద్యం అమ్మాలి తద్వారా ప్రజల ప్రాణాలు గాలికి కలిసిపోతాయి అందుకు ప్రభుత్వమే భాధ్యత వహించాల్సి వస్తుంది,తిరుపతి పవిత్రత దెబ్బ తింటుంది!
తిరుపతి జిల్లా వాసి ఎక్సైజ్ శాఖ మంత్రి,స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే బాధ్యత తీసుకొని టిటిడి,నగరపాలక సంస్థల అత్యవసర సమావేశం ఎర్పాటు చేసి “తిరుపతిలో బార్ లు వద్దు” “తిరుపతిని మధ్యరహిత నగరంగా ప్రకటించాలి” ఆన్న ఏకవాక్య తీర్మానం చేసి సీఎం గారిని ఒప్పించి తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వం నిన్న టెండర్లు పిలిచిన 16 బార్ల ను వెంటనే రద్దు చేయించాలి!
తిరుపతి ఆధ్యాత్మిక నగరాన్ని మధ్యరహిత నగరంగా మార్చే బృహత్కర కార్యక్రమానికి, అధికార ప్రతిపక్ష పార్టీలతో పాటు.. ప్రజలు, ప్రజా సంఘాలు, మేధావులు, విద్యార్థి సంఘాలు, మహిళలు సైతం స్వచ్ఛందంగా మెయిల్స్ , లెటర్స్, ట్విట్టర్ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి చేరేవరకు బాధ్యత తీసుకోవాలి! “తిరుపతి@నో బార్స్”అన్న నినాదంతో ప్రజలే స్వచ్ఛందంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపండి!
తిరుపతి నగరంలో ఇప్పటికే “బడి” “గుడి” ఆన్న తేడా లేకుండా, ఎక్కడపడితే అక్కడ ప్రభుత్వ మద్యం షాపులు బార్లు బార్ల తెరిచి, సూర్యోదయం TO సూర్యోదయం వరకు అమ్మకాలు కొనసాగిస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ తిరుపతి పవిత్రతను మంట కలుపుతున్నారు! తిరుపతి అభివృద్ధిలో భాగంగా టిటిడి శ్రీవారి నిధులను కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అలాంటిది టీటీడీ పవిత్రత దృశ్య తిరుపతిలో ఉన్న మద్యం షాపులు తొలగించకపోగా, కొత్త బార్లకు ప్రభుత్వం టెండర్ లు పిలవడంపై, టిటిడి ధర్మకర్తల మండలి వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి, ప్రభుత్వానికి పంపాల్సిన బాధ్యత కూడా టిటిడి ధర్మకర్తల మండలి అధికారులపై ఉంది!
తిరుపతి నగరం గంజాయి వనంగా మారిందని, మత్తు పదార్థాలకు యువత బలైపోతున్నారని స్థానిక ఎమ్మెల్యే నగరంలో పర్యటిస్తూ అవగాహన కోసం ప్రతి కూడలిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో, యువతలో కొంతైనా చైతన్యం తీసుకోని రావడం జరిగింది అదే తరహాలో మద్యపానానికి బానిసలై, అనారోగ్యంతో ఆసుపత్రులలో చేరి ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత భవిష్యత్తు కోసం, తిరుపతిలో అదనపు బార్ల అనుమతిని ఉపసంహరించుకునేలా ముఖ్యమంత్రి పై ఒత్తిడి తీసుకురావాలి!
మద్యానికి బానిసలైన కొంత మంది, అధికధరలు పెట్టి మద్యం కొనలేక డబ్బుల కోసం అక్రమ మార్గాలను ఎంచుకునే ప్రమాదం ఉంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉంది. మహిళలకు రక్షణ కరువు అవుతుంది! “SAY NO TO DRUGS తరహాలో SAY NO TO BARS IN TIRUPATI” ఉద్యమానికి నాంది పలకాలి!!