Suryaa.co.in

Editorial

కమ్మ సీఐలు మాకొద్దు!

– సీఐలకు ఎమ్మెల్యేల ‘కమ్మ’టి షాక్
– కమ్మ సీఐలు వద్దంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు
– బీసీ, ఎస్సీ, కాపు సీఐలు కావాలన్న కోరిక
– తమ కులం వారికి నిర్భయంగా లేఖలు ఇస్తున్న కాపు ఎమ్మెల్యేలు
– జగన్ జమానాలో పోస్టింగులు దక్కని కాపు సీఐలకు ఈసారి ఊరట
– కాపు సీఐలకు ప్రాధాన్యం ఇస్తున్న కమ్మ, బీస్సీ, ఎస్సీ,బీసీ ఎమ్మెల్యేలు
– జగన్ జమానాలో వీఆర్‌లోకి వెళ్లిన కమ్మ సీఐ, డీఎస్పీలు
– ఒక్క గుంటూరు రేంజ్‌లోనే 26మంది సీఐ, 18మంది ఎస్‌ఐ, 8 మంది డీఎస్పీలకు ఇప్పటికీ పోస్టింగులు లేని ద యనీయం
– వీఆర్,లూప్‌లైన్లలోనే ప్రమోషన్లు పొందిన అడిషనల్ ఎస్పీలు మరికొందరు
– ఏబీవీ మనుషులన్న ముద్రలో నో పోస్టింగ్
– వారిని వేధించిన నాటి డీజీపీలు
– ఏళ్ల తరబడి రిజర్వులోనే గడి పిన ఆ అధికారులు
– ఐదేళ్లూ వీఆర్‌లో మరికొందరు అధికారులు
– పేర్లు తెలియని వింగ్‌లలో ఇంకొందరు లూప్‌లైన్‌కు
– టీడీపీ అధికారంలోనూ అదే దుస్థితి
– వారిని తీసుకుంటే కులం ముద్ర పడుతుందని టీడీపీ ఎమ్మెల్యేల భయం
– పిన్నెల్లి బాధితుడు నారాయణస్వామికీ దక్కని పోస్టింగ్
– పోలింగ్ రోజున వైసీపీ మూకల దాడిలో గాయపడ్డ నారాయణస్వామి
– పోలీసుశాఖలో ‘కమ్మ’టి విషాదం
( మార్తి సుబ్రహ్మణ్యం)

వాళ్లు ఓ సామాజికవర్గానికి చెందిన పోలీసు అధికారులు. గత టీడీపీ సర్కారులో ప్రాధాన్యం ఉన్న పోస్టింగుల్లోనే పనిచేశారు. కానీ ఆ తర్వాత సర్కారు మారింది. ఆ వర్గాన్ని తొక్కేయాలన్న నాటి సర్కారు లక్ష్యానికి ఆ వర్గం గురయింది. ఫలితంగా వారికి ఐదేళ్లపాటు ఎక్కడా ప్రాధాన్యం ఉన్న పోస్టింగులు దక్కలేదు. అదృష్టం బాగున్నవాళ్లకు మాత్రం లూప్‌లైన్లు దొరికాయి.

కొన్నేళ్లపాటు పోస్టింగుల కోసం వేచి ఉంటున్న పరిస్థితి. కొత్త పోస్టింగు వస్తే తప్ప పాత జీతాలు రాని దయనీయం. అప్పటివరకూ జీతాలు రావు మరి. ఆ ప్రకారంగా ఇప్పటికీ ఏళ్ల తరబడి జీతాల కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్న దయనీయం. మరీ బ్రతిమిలాడుకుంటే… కనికరించి.. అసలు తమ శాఖలో పేరు తెలియని వింగులకు బదిలీ చేసిన వైచిత్రి. అవి లూప్‌లైన్ అయినా, నెలకు జీతం వస్తే చాలన్న సంతృప్తి.

ఇప్పుడు పాత పార్టీ మళ్లీ అధికారం వచ్చిందని ఆనందించాలో.. తమ కులం ఎమ్మెల్యేలే ‘మీరు మాకొద్దని’ చెబుతుంటే, బాధపడాలో తెలియని దయనీయం. అయితే తమ కులంవారికే ఇతర ఉన్నత పోస్టింగులకు’ వర్తించని నిబంధనలు, కేవలం పోలీసులమయిన మాకే ఎందుకన్న వారి ప్రశ్నలకు జవాబిచ్చేదెవరు?

జగన్ జమానాలో నిరాదరణ-వేధింపులకు గురైన కమ్మ సామాజికవర్గ పోలీసు అధికారుల కష్టాలకు, ప్రభుత్వం మారినా మోక్షం లభించకపోవడం వారిని నిరాశకు గురిచేస్తోంది. అధికారం మారితే తమ కష్టాలు కడతేరతాయని ఆశించిన వారి ఆశలు, ఎమ్మెల్యేల తిరస్కరణలతో ఆవిరవుతున్న పరిస్థితి.

సహజంగా తమ నియోజకవర్గాల్లో.. డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐల కోసం ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, సిఫార్సు లేఖలు ఇస్తుంటారు. వారి సిఫార్సులకు ఐజీలు ఆమోదముద్ర వేస్తుంటారు. ఆ ప్రకారంగా జగన్ బాధిత సీఐ, ఎస్‌ఐలు.. కొద్దిరోజుల నుంచి టీడీపీ ఎమ్మెల్యేలను ఆశ్రయించి, సిఫార్సు లేఖలు అడుగుతున్నారు. తాము జగన్ బాధితులం కాబట్టి.. ఐదేళ్లు వీఆర్‌లో మగ్గిపోయాము కాబట్టి.. లూప్‌లైన్లలో పనిచేస్తున్నాము కాబట్టి.. తమ కష్టాలు గ్రహించిన ఎమ్మెల్యేలు, వాయువేగంతో తమ నియోజకవర్గాల్లో పోస్టింగులు ఇస్తారని, పాపం ఆ అధికారులు ఆశ పడ్డారు.

కానీ సదరు టీడీపీ ఎమ్మెల్యేలు.. ‘‘సారీ తమ్ముడూ.. కమ్మవాళ్లు మాకొద్దు. మనం బీసీ, ఎస్సీలకే ఇస్తున్నాం. ఈసారి చూద్దాం. మీ పరిస్థితి మాకు తెలుసు. జగన్ ప్రభుత్వంలో మీకెంత అన్యాయం జరిగిందో మాకు తెలుసు. కానీ మా పరిస్థితి కూడా మీరు అర్ధం చేసుకోండి. మిమ్మల్ని తీసుకుంటే మళ్లీ కులముద్ర వేస్తారు. అదే వేరే కులం వారిని తీసుకుంటే ఆ సమస్యలు ఉండవు’’ అని చావు కబురు చల్లగా చెబుతుంటే, షాక్ తినాల్సిన పరిస్థితి.

ఈ సామాజికవర్గానికి జగన్ జమానాలో ఏ స్థాయిలో అన్యాయం జరిగిందో చూస్తే నోరెళ్లబెట్టక తప్పదు. ఒక్క గుంటూరు రేంజ్‌ను తీసుకుంటే.. ఈ రేంజ్‌లో 26 మంది సీఐలు, 18మంది ఎస్‌ఐలు, 8 మంది కమ్మ డీఎస్పీలు.. గత ఐదే ళ్ల నుంచి పోస్టింగులు లేకుండా వీఆర్, లూప్‌లైన్‌లో మగ్గిపోతుండటం విశేషం. ఒక్క గుంటూరు రేంజ్‌లోనే ఈ పరిస్థితి ఉందంటే.. ఇక మిగిలిన రేంజ్‌లలో ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

తాజాగా ప్రభుత్వం మారిన నేపథ్యంలో.. టీడీపీ ఎమ్మెల్యేలు తమకు కమ్మ సీఐ-ఎస్‌ఐలు వద్దని, బీస్సీ, ఎస్సీ, ఎస్టీలు మాత్రమే కావాలని నిర్మొహమాటంగా చెబుతుంటే, హతాశులవుతున్న పరిస్థితి నెలకొంది. పత్తిపాడు నియోజకవర్గంలో దళిత ఎమ్మెల్యే రామాంజనేయులు, చిలకలూరిపేట నియోజకవర్గంలో కమ్మ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు మినహా, మిగిలిన ఏ నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలు కమ్మ వర్గ అధికారులను తీసుకునేందుకు, సాహసించకపోవడం ప్రస్తావనార్హం. ప్రధానంగా ఎన్నికల సమయంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి అక్రమాలు ధైర్యంగా అడ్డుకున్న సందర్భంలో.. వైసీపీ అల్లరిమూక రాళ్లకు తలకు గాయాలయిన అప్పటి సీఐ నారాయణస్వామికి సైతం ఇప్పటిదాకా పోస్టింగు దక్కకపోవడం మరో విషాదం.

కాపు ఎమ్మెల్యేలు మాత్రమే, తమ కులానికి చెందిన అధికారులను నిర్భయంగా తమ నియోజకవర్గాల్లో ధైర్యంగా నియమించుకుంటున్నారు. కానీ కమ్మ ఎమ్మెల్యేలు మాత్రం భయంతో వారి కులాలకు చెందిన సీఐలను తిరస్కరిస్తున్న వైచిత్రి.

ఇదిలాఉండగా.. కాపు సీఐలదీ కొంచెం అటు ఇటుగా ఇదే పరిస్థితి. అయితే వారి సంఖ్య ఆ స్థాయిలో లేనప్పటికీ, వారు కూడా జగన్ సర్కారులో బాధితులే. తెలివైన కొద్దిమంది కాపు అధికారులు వైసీపీ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ పోస్టింగులు దక్కించుకున్నారు. కానీ ఎక్కువమంది కాపు అధికారులు మాత్రం లూల్‌లైన్, వీఆర్‌కు పరిమితమయ్యారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత కాపు ఎమ్మెల్యేలతోపాటు, కమ్మ-బీసీ-మైనారిటీ ఎమ్మెల్యేలు కూడా వారికి ప్రాధాన్యం ఇస్తుండటం వారికి ఊరటనిస్తోంది.

గతంలో కోడెలకు సన్నిహితుడిగా ముద్ర పడ్డ వీరయ్యచౌదరి అనే అధికారి, నాలుగున్నరేళ్లు వీఆర్‌లో ఉండటం దారణం. ఇక ప్రకాశం జిల్లాలో పనిచేసి.. రెండున్నరేళ్లు వీఆర్‌లో మగ్గి, ఆ తర్వాత లూప్‌లైన్‌లో ఉన్న మాకినేని శ్రీనివాసరావు అనే సీఐకి ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ఇచ్చారు. అయితే అనంతపురం జిల్లా టీడీపీ ప్రముఖుడి వద్ద పనిచేసే ఓ వ్యక్తి , తన సోదరుడి ని.. ఆ టీడీపీ ప్రముఖడి సిఫార్సుతో ఎమ్మెల్యే లేఖ ఇవ్వకపోయినా ప్రకాశం జిల్లాలో సీఐగా వేయించిన పరిస్థితి.

ఇక జగన్ జమానాలో వేధింపులకు గురై, వీఆర్-చివరి ఏడాదిలో లూప్‌లైన్‌కు వెళ్లిన అడిషనల్ ఎస్పీల పరిస్థితి మరీ దయనీయం. గౌతం సవాంగ్, రాజేంద్రనాధ్‌రెడ్డి హయాంలో వీఆర్-లూప్‌లైన్లకు వెళ్లిన డీఎస్పీలకు.. అడిషనల్ ఎస్పీలుగా ప్రమోషన్లు వచ్చినప్పటికీ, వారికి ఎక్కడా ప్రధానమైన పోస్టింగులు ఇవ్వకపోవడం విశేషం. ప్రధానంగా ఏబీ వెంకటేశ్వరరావు వర్గంగా ముద్రపడ్డ డీఎస్పీ, అడిషనల్ ఎస్పీలపై.. జగన్ జమానా నాడి డీజీపీలు కక్ష సాధించారన్న ఆరోపణలున్నాయి.

ముఖ్యంగా మాజీ డీజీపీ ఒకరు.. నిబంధనల ప్రకారం ప్రమోషన్లు పొందిన అడిషనల్ డీఎస్పీలు వచ్చి కలవలేదన్న ఆగ్రహంతో, వారిని వచ్చి కలవాలని ఆదేశించడం అప్పట్లో చర్చనీయాంశమయింది. సహజంగా ప్రమోషన్లు పొందిన వారు.. పోస్టింగులు తీసుకున్న తర్వాత డీజీపీ, ఐజీలను కలుస్తారు. కానీ అసలు ఎలాంటి పోస్టింగులు ఇవ్వకుండా, నిబంధనల ప్రకారం ప్రమోషన్లు అందుకున్న వారిని కూడా, తనను వచ్చి కలవాలనుకునే ఆ మాజీ డీజీపీ ధోరణిపై అప్పుడే విమర్శలు వెల్లువెత్తాయి.

ఏబీ వెంకటేశ్వరరావు మీద కోపం, కిందిస్థాయి అధికారులపై చూపించిన ఆ డీజీపీలు.. వారిలో కొందరికి సబ్ డివిజన్లు కూడా కేటాయించలేదు. మరికొందరికి ఏడాది క్రితమే లూప్‌లైన్ పోస్టింగులు ఇచ్చినప్పటికీ, వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. వీవీఐపీల బందోబస్తు మాత్రమే వారిని వినియోగించిన దారుణం. ఈ తరహా బాధితులంతా నాటి ఏబీ వెంకటేశ్వరరావు మనుషులుగా ముద్రపడ్డ వారే. వారి విషాదం ఇంకా విజయవంతంగా కొనసాగుతోంది.

కాగా జగన్‌ప్రభుత్వంలో అణచివేతకు బలైన తాము, ఇప్పటికీ నిరాదరణకు గురవడం కమ్మ వర్గ సీఐలను వేదనకు గురిచేస్తోంది. అయితే ఇతర నియామకాల్లో తమ కులానికే ప్రాధాన్యం ఇస్తూ, పోలీసు శాఖలో తమను మాత్రం అన్యాయం చేయడం భావ్యం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్లలో తమ నుంచి సమాచారం తీసుకున్న వారు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఎన్నికయిన తర్వాత, తమను మాత్రం వద్దనడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

1 COMMENTS

LEAVE A RESPONSE