Suryaa.co.in

Andhra Pradesh

దయ్యాన్ని తరిమేశాం.. భయం లేదు!

– ఏపీలో నిర్భయంగా పెట్టుబడులు పెట్టొచ్చు
– కులగణన స్థానంలో నైపుణ్య గణన
– పీపీపీ మోడల్ స్థానంలో పీ4 విధానం
– జగన్ పాలనతో అమరావతి ఆకర్షణ తగ్గింది-
దావోస్‌ సదస్సుకు హాజరవుతా
-ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

ఢిల్లీ: రాష్ట్రంలో కులగణన స్థానంలో నైపుణ్య గణన చేపట్టాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీనిపై క్యాబినెట్లో చర్చించి ఆమోదించామని, త్వరలో అన్ని మార్గదర్శకాలను విడుదల చేయబోతున్నామని ఆయన చెప్పారు.

తనకు కేంద్రంలో పదవుల పట్ల ఏమాత్రం ఆసక్తి లేదని, కేవలం రాష్ట్రాభివృద్ధి, ఏపీ పునర్నిర్మాణమే తన ముందున్న ఏకైక లక్ష్యం-అజెండా అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వెళ్లే ముందు ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు.

కేంద్రం నుంచి ఎలాంటి పదవులు ఆశించలేదని ఆయన చెప్పారు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం వాజ్‌పేయి నేతృత్వంలో ఉన్నప్పుడు కూడా, ఎలాంటి పదవులు ఆశించలేదని గుర్తు చేశారు. అప్పుడు 7 మంత్రి పదవులు తీసుకోవాలని కోరినా అంగీకరించలేదని వెల్లడించారు. ఎన్డీఏ పార్టీలతో సత్సంబంధాల కోసమే స్పీకర్ పదవికి మాత్రం అంగీకరించానని చెప్పారు.

ఇప్పుడు కూడా అదే తరహాలో ఎలాంటి పదవులు టీడీపీ నుంచి కోరలేదని, అయితే ఎన్డీఏ నుంచి ఆఫర్ చేసిన రెండు మంత్రి పదవులు మాత్రం తీసుకున్నామని చెప్పారు. కేంద్రం ఇచ్చిన మంత్రి పదవుల పట్ల సంతోషంగానే ఉన్నామని వ్యాఖ్యానించారు.

గత ఐదేళ్ల జగన్ పాలనతో అమరావతిపై ఉన్న ఆకర్షణ కొంతవరకు తగ్గిందని వ్యాఖ్యానించారు. అమరావతికి కోల్పోయిన ఆకర్షణను తిరిగి తీసుకురావడమే ప్రధాన ధ్యేయంగా పని కొనసాగుతోందని, 135 ప్రభుత్వ కార్యాలయాలు అమరావతిలో ఏర్పాటు కాబోతున్నాయని వెల్లడించారు.

అమరావతికి అవసరమైన ప్రాథమిక మౌలిక వసతులన్నీ కల్పిస్తామని, త్వరలోనే ఐకానిక్ బిల్డింగ్స్ సహా అన్ని కార్యాలయాల నిర్మాణాలను పూర్తి చేయబోతున్నామని వెల్లడించారు. వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నటువంటి భవనాలను తొలుత పూర్తి చేస్తామని, దశలవారీగా అమరావతిలో అన్ని నిర్మాణాలను త్వరితగతిన చేపడతామని చెప్పారు.

మానవ వనరులను మూలధన పెట్టుబడిగా మార్చి సంపద సృష్టించడమే లక్ష్యమన్నారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలతో నెపుణ్యానికి అనుగుణంగా ఉపాధి కల్పిస్తామని వివరించారు. ప్రతి కుటుంబంలో నైపుణ్యాలను క్రోడీకరించి వాళ్ల శక్తి సామర్థ్యాలను పెట్టుబడిగా సంపద సృష్టిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. దీనివల్ల ఎక్కడికో వెళ్లి ఒకరి కింద పని చేయడానికి అవసరం ఉండదని, ప్రతి కుటుంబం ఒక ఔత్సాహిక పారిశ్రామికులుగా రూపొందుతారని దీమా వ్యక్తం చేశారు.

పీపీపీ మోడల్ స్థానంలో పీ4 విధానం తీసుకురావాలి అనుకుంటున్నామని చంద్రబాబు వివరించారు. సంపదలో అత్యున్నత స్థానంలో ఉన్న వాళ్లు అట్టడుగున ఉన్న 20 శాతం మందికి చేయూత ఇచ్చేలా చేయడమే పీ4 లక్ష్యమని వివరించారు.

ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలన్నదే తన విధానమని, ఇరు రాష్ట్రాలకు సమ న్యాయం చేయాలని, విభజన సమయంలో కూడా తాను అదే చెప్పానని అన్నారు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డితో సమావేశంలో ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకుండా సమస్యలు పరిష్కారం కావాలనే చర్చిస్తామని స్పష్టం చేశారు.

మళ్లీ జగన్ వస్తే ఎలా అని అన్ని వర్గాలు అడుగుతున్నాయని, అయితే డెవిల్‌ని నియంత్రించామని, ఇకపై ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లుగా జరిగిన నష్టం నుంచి బయటికి రావాలని, అందుకు అనుగుణంగా రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు సహకారం ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని ఆయన వివరించారు.

దావోస్‌లో జరిగే పెట్టుబడుల సదస్సుకు తప్పకుండా హాజరవుతానని ఆయన ప్రకటించారు. దేశంలో ఏదైనా కొత్త విధానం తీసుకురావడానికి కమిటీకి నేతృత్వం వహిస్తారా అంటే… అది అంతా అప్పటి అవసరానికి అనుగుణంగానే ఉంటుందని ఎన్డీఏ నాయకత్వం నుంచి ప్రతిపాదన ఉంటే అప్పుడు ఆలోచిస్తానని చెప్పారు.

దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి లేనన్ని గొప్ప వనరులు ఆంధ్రప్రదేశ్‌కి ఉన్నాయని చెప్పారు. కృష్ణా, గోదావరి నదుల మధ్య ఆంధ్రప్రదేశ్ అంతా అనుసంధానమై ఉందని, ఒక్క గోదావరి నది నుంచి సుమారు 3000 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందని ఆయన ప్రస్తావించారు.

ఆ నీటిని వినియోగించుకోగలిగితే రాష్ట్రంలో అద్భుతాలు సృష్టించవచ్చునని విశ్వాసం వ్యక్తం చేశారు. నదుల అనుసంధానం పూర్తిస్థాయిలో చేయగలిగితే గోదావరి నుంచే దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ నీటి సరఫరా చేయవచ్చునని అన్నారు.

రానున్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే లక్ష్యంగా పని చేస్తామని, గత ఐదేళ్ల దుష్పరిణామాల వల్ల రాష్ట్రానికి పూడ్చలేని స్థాయిలో నష్టం వాటిల్లిందని ఆయన వివరించారు. ప్రజలు ఎన్డీఏ కూటమికి అధికారం ఇచ్చారని, అందరం కలిసి రాష్ట్రాన్ని బాగు చేస్తామని పేర్కొన్నారు.

దావోస్‌లో జరిగే పెట్టుబడుల సదస్సుకు తప్పకుండా హాజరవుతానని ఆయన ప్రకటించారు. దేశంలో ఏదైనా కొత్త విధానం తీసుకురావడానికి కమిటీకి నేతృత్వం వహిస్తారా అంటే… అది అంతా అప్పటి అవసరానికి అనుగుణంగానే ఉంటుందని ఎన్డీఏ నాయకత్వం నుంచి ప్రతిపాదన ఉంటే అప్పుడు ఆలోచిస్తానని చెప్పారు.

LEAVE A RESPONSE