మనిషి జీవితంలో ఎందుకు? ఏమిటి ? ఎలా? అని ప్రశ్నించే తత్వం మానవ జీవితానికి ప్రేరణగా నిలుస్తుంది. తద్వారా జీవన సాఫల్యతకు నూతన మార్గాలను కనుగొనటానికి ఆస్కారం కలుగుతుంది. ప్రశ్నించే తత్వం సృజనాత్మకతకు నాంది. కొత్త ఆలోచనలకు కొత్త ఆవిష్కరణలకు అవకాశం కల్పిస్తుంది. అధ్యాపకులు పాఠాలు బోధించినప్పుడు ప్రతి విషయాన్ని ఆలోచనాత్మక ధోరణితో ప్రశ్నించం వలన జ్ఞానాభివృద్ధితో పాటు విజ్ఞానం వికసించి ప్రతిభ కూడా ఇనుమడిస్తుంది.
ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలనే తపనను పెంచి మానసిక వికాసం పెరిగి సమస్యల పరిష్కార నైపుణ్యాన్ని పెంచుతుంది. ప్రశ్నించే తత్వంతో మనం ఎంచుకున్న రంగంలో ముందుకు సాగడానికి మార్గం సుగమం అవుతుంది. అలా కాకుండా మనం నేర్చుకున్న ప్రతి విషయాన్ని గుడ్డిగా విశ్వసిస్తూ, తర్కానికి దూరంగా ఉండిపోతే ముందుకు సాగలేము. సమస్య గురించి ఫిర్యాదు చేయడం మాని సమస్యకు గల కారణాలు తెలుసుకుని పరిష్కార మార్గాలు సూచించే సామర్థ్యంపై దృష్టి పెట్టండి. సమస్య తీవ్రతను బట్టి ప్రాధాన్యాన్ని నిర్ణయించాలి. నిర్ణీత కాలములో పరిష్కరించే కార్యాచరణకు ఉపక్రమించాలి. పరిష్కారం కోసం అన్వేషించాలి.
విభిన్న వ్యక్తులతో కలవడం, సంభాషించడం ద్వారా ప్రశ్నించేతత్వం పెరుగుతుంది. ప్రశ్నతో పరిశీలన, పరిశోధన, అధ్యయనం, అభ్యసనం, విమర్శనాత్మక ఆలోచన మరియు ప్రపంచం గురించి తెలుసుకునే ఆలోచనలకు హేతువవుతుంది. గొప్ప ఆవిష్కరణలకు కూడా ప్రశ్నించేతత్వమే పునాది అవుతుంది. ప్రశ్న అడగడం జ్ఞానానికి తోలి మెట్టు. ప్రశ్నతోనే సత్యాన్ని తెలుసుకోగలం, నేటి మన ప్రశ్నలే రేపటి కొత్త చరిత్రకు నాంది పలుకుతాయి. ప్రశ్నలు అడగడం మానేయకండి, ప్రశ్నతోనే ప్రజాస్వామ్యం మనగలుగుతుంది. ప్రశ్న అధికారులను సరైన దిశలో పాలనా చర్యలు తీసుకోవడానికి చోదక శక్తిగా దోహద పడుతుంది. ప్రశ్నించే తత్వం ఉన్న జనం సమాజ హితానికి బాట వేస్తారు. ఒక వ్యక్తిని అతని సమాధానాల ద్వారా కాకుండా అతని ప్రశ్నల ద్వారా నిర్ణయించండి.
ప్రశ్నించే శక్తి మానవ పురోగతికి ఆధారం అనే నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వాలు ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించాలి. ప్రశ్నతోనే ప్రగతి, ప్రశ్నతోనే పురోగతి, ప్రశ్నతోనే పరిజ్ఞానం, ప్రశ్నతోనే పరిష్కారం, ప్రశ్నతోనే వృద్ధి అభివృద్ధి, ప్రశ్నతోనే పాలనలో ప్రజల భాగస్వామ్యం, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, పంపిణీ న్యాయం సిద్ధించి ప్రజల జీవన నాణ్యత మెరుగు పడుతుంది. పారదర్శకత మరియు జవాబుదారీ తనం పెరిగి సమాజంలో గుణాత్మక మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రశ్న ఆలోచనాత్మకంగా ఉండాలి కానీ విమర్శనాత్మకంగా మరియు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు.
– ఆచార్య వి. ఉమామహేశ్వరరావు లయన్స్ డిస్ట్రిట్ గవర్నర్ (2000-2001). మాజీ రిజిస్ట్రార్, ఆంధ్ర విశ్వవిద్యాలయం మేనేజింగ్ ట్రస్టీ, లయన్స్ కాన్సర్ అండ్ జనరల్ హాస్పిటల్, విశాఖపట్నం


