Suryaa.co.in

Telangana

మహిళల పట్ల మన దృక్పథం మారాలి.

– అది ఇంటి నుంచే మొదలు కావాలి
– మహిళా జర్నలిస్టుల సన్మాన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పిలుపు

నిత్యం ప్రజల సమస్యలను ప్రభుత్వానికి, ప్రభుత్వ పనులను ప్రజలకు చేరవేసే వారధులు వారు. ఇంట్లో కుటుంబాన్ని నిర్వహిస్తూనే వృత్తిని నిబద్దతో నిర్వహించే మహిళా జర్నలిస్టులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా హైదరాబాద్, తాజ్ కృష్ణ హోటల్ లో ఘనంగా సన్మానించి, గౌరవించింది.

రాష్ట్ర ఐటి, మునిసిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ , రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొని మహిళా జర్నలిస్టులకు శాలువాలు కప్పి, మెమెంటోలు ఇచ్చారు.

జర్నలిస్టులుగా తమ వృత్తిధర్మంలో భాగంగా ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపడాన్ని తాము స్వాగతిస్తామని, అదే సమయంలో ప్రభుత్వం చేసే మంచి పనులను, పదిమందికి స్పూర్తినిచ్చే కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులు అన్నారు.

నేటి మహిళలు రెండు చేతులతో 8 చేతులున్న శక్తివలె పనిచేస్తున్నారని, కుటుంబాన్ని నిర్వహిస్తూనే పనిచేసే చోట కూడా అందరితో పోటీ పడి ముందుకు పోవడం అభినందనీయమన్నారు.
సమాజంలో అనేక సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి పరిష్కారం కోసం పనిచేసే మహిళా జర్నలిస్టులను నేడు సన్మానించుకోవడం నిజంగా గొప్పగా ఉందన్నారు.

మహిళలతో ఎవరూ పోటీ పడలేరు : మంత్రి కేటిఆర్
ఏ మనిషి అయినా జీవితంలో కోరుకునేది గుర్తింపు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి చాలా తక్కువగా మాట్లాడుతారు. కానీ నేడు ఎక్కువగా మాట్లాడారు. ఈరోజు తను మనసు నుంచి మాట్లాడారు.
మహిళలతో ఎవరూ పోటీ పడలేరు. భారతదేశంలో కుటుంబంలో చిన్న గుండు పిన్ను కూడా తీయకుండా
women-ktr1 అమ్మా, అక్కలు, చెల్లెలు కలిసి పెంచుతారు. నేను కూడా అలాగే పెరిగా కానీ..నేను ఒక విద్యార్థిగా హాస్టల్, ఇతర పట్టణాలు, దేశాల్లో ఉన్నపుడు శ్రమ విలువ అర్థమైంది.భారతదేశ అబ్బాయిలకు ఇక్కడి అమ్మల విలువ తెలువాలనాటే వారు కొంత కాలం బయట ఉంచాలి.. అపుడు తెలుస్తుంది.పెప్సీ కంపెనీ చైర్మన్ ఇంద్రనూయిని ఒకసారి కలిసినపుడు మా మధ్య మంచి సంభాషణ జరిగింది. ఆమె భారత మూలాలున్న అమెరికన్.

పెప్సీ లీడర్ గా ఉన్నావు…ఫ్యామిలీ ఎలా ఉంది అని అడిగినప్పుడు ఆమె చాలా గొప్ప విషయం చెప్పారు. నా ఇంట్లో నీ కీరిటం అక్కడే వదిలేయ్. ఇంట్లోకి రాగానే తల్లి, భార్య, చెల్లెగా నీ మీద ఆశలు, బాధ్యతలు ఉంటాయి. ఇది భారతీయత అన్నారు.మహిళల పట్ల మన దృక్పథం మారాలి. అది ఇంటి నుంచే మొదలు కావాలి. వారిని పురుషులతో సమానంగా చూడాలి.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ ప్రభుత్వంలో గత 8 ఏళ్లలో జరిగిన విషయాలు చెబుతాను.ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవించే మహిళలు, పుట్టే నవజాత శిశువులకు ఇచ్చే కేసిఆర్ కిట్ వల్ల 30 నుంచి 52 శాతానికి ప్రభుత్వ దవకాహనాల్లో ప్రసవాలు పెరిగాయి.

నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్నది మారింది.శిశు మరణాలు కూడా తగ్గాయి. వెయ్యికి 39 ఉంటే అవి ఇప్పుడు 23 కి తగ్గాయి. అదేవిధంగా ప్రసవ సమయంలో తల్లుల మరణాలు 92 నుంచి 63 కి తగ్గాయి. నియో నాటల్ మరణాలు 25 నుంచి 16 కి తగ్గాయి.

పేదింటి ఆడపిల్ల పెళ్లి కోసం తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మీ పథకం సామాజిక రుగ్మతలను తగ్గించింది. కళ్యాణ లక్ష్మి వల్ల బాల్య వివాహాలు తగ్గాయి.సంస్కార వంతమైన్ ప్రభుత్వాలు గొప్ప పనులు చేస్తాయి. అందులో ఆరోగ్య లక్ష్మి పథకం చాలా ముఖ్యమైంది.21 లక్షల మందికి ఈ పథకం కింద రోజు భోజనం పెడుతున్నాం. దీనివల్ల మహిళలు, పిల్లల్లో పోషకాహారం లభిస్తోంది.అమ్మ ఒడి వాహనాల ద్వారా గర్భం దాల్చిన మహిళలను ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకెళ్ళి ప్రసవాలు చేస్తున్నాము.

జర్నలిస్టులు మీ వృత్తిపరంగా ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఎత్తి చూపడం తప్పదు. దీనిని మేము స్వాగతిస్తాం. కానీ ప్రజల కోసం ప్రభుత్వం చేసే మంచి కూడా చెప్పండి అని విజ్ఞప్తి. నేను రోజు ఉదయం దాదాపు 13 పేపర్లు చదువుతాను. వాటిల్లో కొన్నిటిలో కేవలం వ్యతిరేక వార్తలే ఉంటాయి. ఇక టీవీలు చూడడం మానేశా. ఉదయమే చాలా గందరగోళం నడుస్తుంది అక్కడ.

కేసిఆర్ తల్లి వలె వారికి అండగా నిలుస్తున్నారు: మంత్రి సత్యవతి రాథోడ్
మహిళా జర్నలిస్టుల ను సన్మానించుకోవడం గొప్ప కార్యక్రమం.మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.నేటి సన్మాన గ్రహీతలైన మహిళా జర్నలిస్టులకు అభినందనలు.సమాజంలో జరుగుతున్న సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి పరిష్కారం మార్గం చూపే వారు జర్నలిస్టులు.ప్రతి రోజు మా మహిళా జర్నలిస్టులు వివిధ అంశాలను సమాజానికి తెలియజెప్పడమే కాదు… వారిని కూడా గౌరవించాలి అని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మహిళా జర్నలిస్టుల తరపున మంత్రి కేటిఆర్ కి, అధికారులకు ధన్యవాదాలు.

ఈ కార్యక్రమం వల్ల చాలా రోజుల తరవాత మహిళా జర్నలిస్టులతో ఒకరికొకరం కలుసుకోవడం బాగుంది.తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తే ఆనందంగా ఉందని, నాతో నేడు కొంతమంది సీనియర్ జర్నలిస్టులు అనడం చాలా సంతోషంగా అనిపించింది.మాటలు కాదు చేతల్లో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇస్తోంది అన్నారు.

ఈ బడ్జెట్ లో మహిళా విశ్వ విద్యాలయం కోసం రూ.100 కోట్లు ఇవ్వడం.. ఇందుకు కృషి చేసిన.సీఎం కేసిఆర్ , హరీష్ రావు , కేటీఆర్ , సబితా ఇంద్రారెడ్డి కి ధన్యవాదాలు.ఆడపిల్ల అవసరాలు తెలుసుకొని పరిష్కరించడంలో సీఎం కేసిఆర్ తల్లి వలె వారికి అండగా నిలుస్తున్నారు.మారుమూల ప్రాంతాల్లోని ఆడపిల్లల ఆరోగ్యం కోసం న్యూట్రిషన్ కిట్ ఇవ్వడం వారి పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధకు నిదర్శనం. ఈరోజు మహిళా జర్నలిస్టులను సన్మానించుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.

మహిళా విశ్వ విద్యాలయం క్రెడిట్ కేటిఆర్ దే: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
జర్నలిజంలో ఉన్న మహిళల్నినేడు సత్కరించుకోవడం ఒక మంచి జ్ఞాపకం.మేము కార్యక్రమాలకు వెళ్లినప్పుడు అక్కడ మహిళా సోదరీమణుల కోసం మా కనులు వెతుకుతుంటాయి. ఒక్కరు కనిపించినా ప్రాణం లేచి వస్తుంది.మీ అందరికీ అభినందనలు.

అప్పుడప్పుడు ఇక్కడ కూడా వివక్ష ఉంటుందా అని ఆలోచిస్తుంటాము. కానీ జర్నలిజంలో కూడా పురుషులతో పోటీ పడి ముందుకు వెళ్తున్నందుకు అభినందనలు.బడ్జెట్ లో మహిళా విశ్వ విద్యాలయం ప్రకటించిన సీఎం కేసిఆర్ కి, సహకరించిన కేటిఆర్ కి ధన్యవాదాలు. ఈ విశ్వవిద్యాలయ ప్రకటన క్రెడిట్ కేటిఆర్ దే.తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తరవాత ప్రభుత్వంలోని కార్యక్రమాలు చూస్తున్నాం.

మంచినీటి కోసం గతంలో ఎంతో దూరం వెళ్ళే పరిస్తితి నుంచి ఇప్పుడు ఇంటి దగ్గర నల్లా నీళ్ళు చూస్తున్నాం.కేజీ నుంచి పీజీ వరకు విద్య కోసం గురుకులాలు ఏర్పాటు చేసి విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో చూపించారు.ఇలా ఒక్కో అడుగులో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

కళ్యాణ లక్ష్మి ఇచ్చినపుడు పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రుల కళ్ళలో ఆనంద భాష్పాలు చూస్తున్నప్పుడు మా కళ్లు కూడా చెమ్మగిల్లుతాయి. మా మహిళా జర్నలిస్టులు అర్ధరాత్రి వరకు పనిచేసి ధైర్యంగా ఇంటికి వెళ్తున్నారు అంటే మా షి టీమ్స్ ను అభినందించాలి. షి టీమ్స్ మహిళలకు పెద్ద భరోసాగా మారాయి.

మహిళలు ఉపాధి కోసం తాపత్రయం పడుతుంటారు. అలాంటిది వి.హబ్ , పారిశ్రామిక వాడలు ఏర్పాటుచేయడం ద్వారా వారిని పారిశ్రామికవేత్తలు చేయడం చాలా గొప్ప విషయం.

మహిళల అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం ఇలా అనేక కార్యక్రమాలు చేస్తోంది.మన అమ్మ, అమ్మమ్మలు ఒకప్పుడు ఇంటిని చూసుకునేవారు. కానీ నేటి మహిళలను చూస్తుంటే శక్తి లాగా పని చేస్తున్నారు. రెండు చేతులతో 8 చేతుల శక్తివలె పనులు చేస్తున్నారు.ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా ఇంకా మీరంతా వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను.

ఈ కార్యక్రమంలో జాతీయ ఛానెళ్లు, పత్రికలు, రాష్ట్ర ఛానళ్లు, పత్రికలలో పనిచేసిన జర్నలిస్టులు, ఫ్రీ లాన్స్ జర్నలిస్టులుగా ఉన్న 84 మందిని మంత్రులు సన్మానించి గౌరవించారు. వారందరితో కలిసి ఫోటోలు దిగారు. సెల్ఫీలకు ఫోజులు ఇచ్చారు. వారిలో కలిసి హైటీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE