Suryaa.co.in

Andhra Pradesh

ఈ–క్రాప్‌ నమోదు చేసుకుంటే చాలు పంట నష్టపరిహారం అందిస్తున్నాం

– రైతు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరమే లేదు
– రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

ఉచిత పంటల బీమా కోసం రైతు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ–క్రాప్‌ నమోదు చేసుకుంటే చాలు పంట నష్టపరిహారం అందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు.

మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లాలోని చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో డా.వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి బటన్‌ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు మరియు రాష్ట్ర కార్మిక, ఉపాధి, ఫ్యాక్టరీస్ శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్, రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు కె.వి.ఉష శ్రీ చరణ్, ప్రభుత్వ శాసనమండలి విప్ వెన్నపూస గోపాల్ రెడ్డి, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, ఎంపీలు గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మాలగుండ్ల శంకర నారాయణ, శ్రీధర్ రెడ్డి, సిద్ధారెడ్డి, తిప్పేస్వామి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర పాఠశాలల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమీషన్ సీఈఓ ఆలూరి సాంబశివారెడ్డి, ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమీషనర్ హరికిరణ్, వ్యవసాయ శాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ పూనం మాలకొండయ్య, ఏడిసిసి బ్యాంక్ ఛైర్మన్ లిఖిత, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి, ఇంచార్జి జాయింట్ కలెక్టర్ నవీన్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చేలోగా ఏదైనా ప్రకృతి విపత్తుతో నష్టపోతే రైతులపై ఆర్థికభారం తగ్గించేందుకు, రైతులకు అండగా ఉండేందుకు డాక్టర్‌ వైయస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. గతంలో పంటలకు బీమా చేయించుకోవడం కష్టతరంగా ఉండేదని, రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగి నష్టపోయేవారని, ప్రస్తుతం అలాంటి కష్టాలు లేవన్నారు. ఈ–క్రాప్‌ నమోదు చేయించుకుంటే చాలు పంట నష్టపరిహారం అందించే విధంగా సీఎం ఆలోచన చేసి ఈ రోజు వైయస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ–క్రాప్‌ నమోదు చేసుకుంటే బీమా రక్షణ కల్పిస్తూ పరిహారం అందిస్తున్నామన్నారు.

గత ప్రభుత్వం హయాంలో ఉన్న బకాయిలు చెల్లిస్తూ.. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఒక్క విడతలోనే రూ. 2,977.82 కోట్లు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఉచిత పంటల బీమా పథకం కింద అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ఇందుకోసం నిర్ధిష్టమైన సూచనలు చేశారని, ప్రతి ఒక్కరికి నియమ నిబంధనలు అనుసరించి పరిహారం ఇవ్వాలని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. ఇప్పటికే వైయస్‌ఆర్‌ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం కింద రూ.23,875 కోట్లు ఇచ్చామని,. సున్నా వడ్డీకి సంబంధించి పంట రుణాలు ఇస్తున్నామని, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు తోడుగా నిలుస్తున్నాన్నారు.

వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు చేసి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని, రైతుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నామన్నారు. ఇటీవల జరిగిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, కౌలు రైతులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన రుణాలు అందించాలని కోరారన్నారు. వైయస్‌ఆర్‌ యంత్రసేవా పథకం కింద ఇటీవల ఒకే విడతలో 4 వేల ట్రాక్టర్లతో పాటు 320 వరి కోత యంత్రాలకు 40 శాతం సబ్సిడీపై నిధులు విడుదల చేశామన్నారు.

ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి తట్టుకోలేక ప్రతిపక్షం పస లేని ఆరోపణలు చేస్తోందన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని విశ్వసించిన వ్యక్తిగా సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రైతు పక్షపాతిగా, రైతులకు అండగా నిలుస్తున్నారని, రైతుల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు మీ అందరి ఆశీస్సులు అందించాలని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కోరారు.

కరువు ప్రాంతానికి నీరందించిన అపర భగీరథుడు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి
గ్రామ స్వరాజ్యం, సామాజిక న్యాయం దేశానికే ఆదర్శం : రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
కరువు కటకాలతో అల్లాడిపోయే ప్రాంతానికి సాగు, తాగునీరు అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి రుణపడి ఉంటామని రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. గ్రామ స్వరాజ్యం, సామాజిక న్యాయం, సంక్షేమం, అభివృద్ధిలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. వైయస్‌ఆర్‌ ఉచిత పంట బీమా కింద జిల్లాకు రూ.900 కోట్లను అందజేస్తూ, అందులో రూ.116 కోట్లను రాప్తాడు నియోజకవర్గానికి అందజేస్తున్నందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మా ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన పేరూరు డ్యామ్‌కు హంద్రీనీవా నీరు అందించిన అపర భగీరథుడు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అన్నారు.

చిత్రావతి వరదల్లో చిక్కుకున్న పది మందిని కాపాడేందుకు సీఎం చూపిన తెగువ, సాహసం మరువలేనిదన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో పేరూరు డ్యామ్‌కు నీరు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ రూ.800 కోట్ల దుర్వినియోగానికి పాల్పడ్డారని, అందులో నుంచి లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు మూడు రిజర్వాయర్లు మంజూరు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. వైయస్‌ఆర్‌ జలకళ ద్వారా రైతులకు సాగునీరు అందించే కార్యక్రమం చేశారన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో 2001లో మూతపడిన రామగిరి బంగారు గనులను మళ్లీ తెరిపిస్తున్నందుకు రుణపడి ఉంటామన్నారు.

గ్రామాలకు స్వరాజ్యం రావాలన్న గాంధీ కలలను నిజం చేశారని, డాక్టర్‌ అంబేద్కర్‌ సామాజిక న్యాయం తీసుకురావాలని కన్న కలలు పుస్తకాలకే పరిమితమైతే.. సీఎం జగనన్న సామాజిక న్యాయాన్ని ఆచరణలో చేసి చూపించారన్నారు. ఈ దేశ చరిత్రలోనే నిలిచిపోయే పాలన అందిస్తున్నారన్నారు. నిరుపేదలకు 15 వేల ఇళ్లు ఇచ్చారని, జగనన్న కాలనీల్లో ఆలమూరులో చెన్నై సిల్క్స్‌ సంస్థ 7 వేల మందికి ఉపాధి కల్పిస్తామని ముందుకువచ్చిందని, దానికి అనుమతులు ఇచ్చేసి.. నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పించాలని కోరుతున్నామన్నారు.

రాప్తాడు ఏపీఐఐసీ పార్కులో కొన్ని సాఫ్ట్‌వేర్‌ సంస్థలు ముందుకు వస్తున్నాయని, ఐటీ ఇండస్ట్రీకి అనుమతించాలని, అదేవిధంగా రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాలకు మంచినీటి సౌకర్యం కోసం రూ.20 కోట్లు మంజూరు చేయాలని కోరుతున్నాం’ అని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు.

LEAVE A RESPONSE