– గుంటనక్క చేష్టలతో రాజకీయ రంగు పులుముకుంది
– గన్మెన్లను తీసుకోకపోవడం రాధాకృష్ణ వ్యక్తిగతం
– పరిణామాలన్నింటినీ రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
విజయవాడ, జనవరి 4: వంగవీటి రాధాకృష్ణకు ఎటువంటి హాని జరగకూడదనే కోణంలోనే తాను, సీఎం జగన్మోహనరెడ్డి చూశామని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మంగళవారం విజయవాడలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు మండలం చినగొన్నూరులో జరిగిన వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తనతో పాటు వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారని తెలిపారు. నాపై రెక్కీ జరిగిందని, హతమార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వంగవీటి రాధాకృష్ణ తన సమక్షంలోనే ప్రకటించడం జరిగిందన్నారు. ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తాను మరుసటి రోజు సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్ళానని తెలిపారు. వంగవీటి రాధాకృష్ణ కుటుంబ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే ఇద్దరు గన్మెన్లను కేటాయించాలని ఆదేశించారన్నారు. రెక్కీ వ్యవహారంపై విచారణ జరిపి నివేదికను అందజేయాలని ఇంటిలిజెన్స్ డీజికి ఆదేశాలు ఇచ్చారన్నారు. దీనిలో నష్టాలు, ప్రయోజనాల గురించి ఆలోచనలు చేయలేదన్నారు. వంగవీటి రాధాకృష్ణ ప్రతిపక్ష టీడీపీలో పనిచేస్తున్నప్పటికీ ఆయన ఎవరిపై ఆరోపణలు చేస్తున్నారో తెలియదన్నారు. రంగా కుటుంబం బ్యాగ్రౌండ్ ను చూసి వంగవీటి రాధాకు రక్షణ ఉండాలని, ఎటువంటి హాని జరగకూడదని తనతో పాటు సీఎం జగన్ కూడా స్పందించారన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన గన్ మెన్లు తీసుకోవాలని, పోలీసుల సూచనలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని వంగవీటి రాధాను కోరానన్నారు. గన్మెన్లను తీసుకోవడం, తీసుకోకపోవడం వంగవీటి రాధాకృష్ణ వ్యక్తిగతమని అన్నారు. రాష్ట్రంలో కొన్ని గుంటనక్కలు, శవాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే కొన్ని పార్టీలు ఉన్నాయన్నారు. హత్యలు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నించే పార్టీలు కూడా ఉన్నాయన్నారు. ఎటువంటి కార్యక్రమం జరిగినా మనకు, మన పార్టీకి ఏదైనా ప్రయోజనం ఉంటుందా అని చూసే గుంటనక్క ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉంటుందన్నారు. ఆ గుంటనక్క రంగప్రవేశం చేసి డీజీపీకి లేఖలు రాయడం, ఆ లేఖల్లో సీఎం జగన్మోహనరెడ్డిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీస్ సిబ్బందిని తప్పుపట్టడం వంటి చేష్టల కారణంగా ఈ వ్యవహారం రాజకీయంగా రంగు పులుముకుందన్నారు. వంగవీటి రాధ పార్టీ వేరు, తన పార్టీ వేరని అన్నారు.
సీఎం జగన్మోహనరెడ్డి కోసం తాను పనిచేస్తానని, ఆయనకు ఎటువంటి మచ్చ రాకూడదని భావిస్తానన్నారు. జగన్ ప్రభుత్వం పది కాలాల పాటు ఉండాలని కోరుకుంటానన్నారు. కొన్ని మీడియా సంస్థలు, చంద్రబాబు, ఆయన పార్టీ ఇన్విష్టిగేషన్ చేసి రెక్కీ చేసిన వారిని పట్టుకున్నట్టుగా మాట్లాడడం జరుగుతోందన్నారు. వంగవీటి రాధాకృష్ణకు ఏదైనా జరిగితే ప్రయోజనం కలిగేది చంద్రబాబుకేనని అన్నారు. చంద్రబాబు లాంటి గుంట నక్కలు రాష్ట్రంలో ఇంకా బతికి ఉన్నారని, ఏమైనా చేసి ఎవరి మీదకైనా తోయగల్గిన సామర్ధ్యం చంద్రబాబుకు ఉందని, అతని దగ్గర డబ్బా ఛానల్స్, సొల్లు పేపర్లు ఉన్నాయని సీఎం జగన్మోహనరెడ్డికి చెప్పానన్నారు. వేగంగా సీఎం జగన్ స్పందించారని, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలను రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారని మంత్రి కొడాలి నాని చెప్పారు.