తిరుపతి: ప్రపంచంలో భారతదేశం ఉన్నత స్థితిలోకి రావడంతోపాటు ప్రపంచానికి మన దేశం ఏమి ఇవ్వగలమనే అంశంపై దృష్టి పెట్టాలని ప్రజలకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ సూచించారు.
తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో “భారతీయ విజ్ఞాన్ సమ్మేళనం” కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్రసింగ్ లతో కలిసి ప్రారంభించారు.
భారతీయ విజ్ఞాన సమ్మేళనం లక్ష్యం జ్ఞానమని పేర్కొంటూ దీనిని ప్రపంచంలోని అందరికీ దగ్గర చేయాల్సి ఉందని డా. భగవత్ తెలిపారు. భారతీయుల డీఎన్ఏలో మాత్రమే ధర్మ దృష్టి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక, సామాజిక, ధర్మ జ్ఞానాల్లో సంపూర్ణంగా మనం ప్రపంచానికి శక్తిని, దృష్టిని ఇవ్వాల్సి ఉందని ఆయన తెలిపారు.
భారతదేశం కేవలం ఒక మహాశక్తిగా మాత్రమే కాకుండా ‘విశ్వగురువు’గా నిలబడాలని, ప్రపంచంలోని సమస్యలకు పరిష్కారం చూపాలని ఆయన చెప్పారు.
భౌతిక, ఆర్థిక, సామరిక శక్తులతో పాటు ధర్మ శక్తిని కూడా ప్రపంచానికి ఇవ్వాలని చెబుతూ అప్పుడే ఈ ప్రపంచం సుందరమైనదిగా మారుతుందని తెలిపారు. ఆ గొప్ప కార్యానికి విజ్ఞాన భారతి ఒక చిన్న ప్రారంభం కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో అభివృద్ధితోపాటే వినాశనం సైతం వచ్చేసిందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శాస్త్ర విజ్ఞానంతోనే మానవాళికి సదుపాయాలు కలుగుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆహారం, నిద్ర, మైధునం జంతువులకు ఆనందాన్ని ఇస్తాయని పేర్కొంటూ జంతువు కంటే మనిషి భిన్నమైన వాడని తెలిపారు.
ఏ జంతువు ఆత్మహత్య చేసుకోదని పేర్కొంటూ శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ ఉన్నదని తెలిసిన వాడు మనిషని ఆయన తెలిపారు. భౌతిక అవసరాలు తీర్చుకోవడం మాత్రమే వికాసం కాదని పేర్కొంటూ సమాజంలో సుఖంగా ఉన్నవాళ్లు దుఃఖంతో ఉన్నవారంటూ రెండు వర్గాలుగా తయారు కాకూడదని హితవు పలికారు.
మనుషులంతా సుఖంగా ఉండాలని కోరుకోవాలని, అహంకారంతో ఉండకూడదని ఆయన సూచించారు. భౌతిక అంశాల జ్ఞానాన్ని విజ్ఞానమని, అంతర్ జ్ఞానాన్ని జ్ఞానమని అంటారని వివరించారు.
విజ్ఞానంతో మాత్రమే కొట్టుకుపోకూడదని చెప్పారు. ఎవరికి ఏ భాష వచ్చొ ఆ భాషను ప్రజలకు అందుబాటులోకి తీసుకుపోవాల్సి ఉందని తెలిపారు. అప్పుడే అందరిలో బుద్ధి వికాసం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మనిషిలోని క్షమాగుణమే అతడిని ఉన్నత స్థితిలో నిలుపుతుందని మోహన్ భగవత్ స్పష్టం చేశారు.
“అందరం కలిసి జీవించాలి. పరస్పర సహకారంతో, సమాజం గురించి ఆలోచిస్తూ ముందుకు సాగాలి” అని డా. భగవత్ సూచించారు. కాబట్టి ఆధునిక సైన్స్‌లో మంచి విషయాలను తీసుకుంటూనే, మన దగ్గర ఉన్న విశిష్టమైన జ్ఞానాన్ని కూడా జోడించాలని చెప్పారు.
భౌతిక జగత్తు జ్ఞానాన్ని పొంది మృత్యువును జయించి, ఆధ్యాత్మిక జగత్తులో అమరత్వాన్ని పొందడమే భారతీయ జీవన విధానం అని తెలిపారు.