Suryaa.co.in

Andhra Pradesh

కులమతాలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వం తో ముందుకు సాగాలి

– విజయవాడలో భిన్నత్వంలో ఏకత్వం సదస్సు
– హాజరైన స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి ఫరూక్,రవిశంకర్

విజయవాడ: కుల మతాలకతీతంగా, జాతి వైషమ్యాలను పక్కనపెట్టి ప్రతి ఒక్కరూ ముందుకు సాగినప్పుడే శాంతి సౌభ్రాతృత్వంతో కూడిన సమాజం ఆవిష్కృతమవుతుందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు.

బుధవారం విజయవాడలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భిన్నత్వంలో ఏకత్వం సదస్సు జరిగింది. సదస్సుకు ముఖ్య అతిథులుగా శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడారు. కుల మతాలను, వర్గవైషమ్యాలను రెచ్చగొట్టి కొందరు తమ స్వార్థం కోసం కుట్రలు పన్నేవారు ఉన్నారని, అలాంటి వారి ని పట్టించుకోకుండా కుల మతాలకతీతంగా మిత్ర బంధంతో, సోదర భావంతో ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు.

తనకు బైపాస్ సర్జరీ జరిగినప్పుడు నంద్యాలలో గురుమూర్తి అనే ఆర్యవైశ్య కులానికి చెందిన తన చిన్ననాటి మిత్రుడు రక్తదానం చేశాడని ఫరూక్ గుర్తు చేసుకున్నారు.

శాసన సభాపతిగా ఉన్న అయ్యన్నపాత్రుడు తో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 40 సంవత్సరాలుగా ఇప్పటివరకు కుల మతాలను పక్కనపెట్టి స్నేహబంధంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. గతంలో తామిద్దరం మంత్రివర్గంలో ఉన్నప్పుడు విజయవాడలో పక్కపక్క ఇళ్ళలోనే ఉండేవారమని, తామీద్దరికీ ఒక్క వ్యక్తే వంట చేసేవారని, ప్రస్తుతం కూడా పక్కపక్క ఇళ్లలోనే ఉన్నామని, ఒకే వంట మనిషి చేతి వంట తింటున్నామని, స్నేహానికి కులాలు మతాలు అడ్డు రావని అన్నారు.

భిన్నత్వంలో ఏకత్వంలా కుల మత జాతి బేధాలను పక్కన పెట్టాలని, మనమంతా మనుషులం అని, ఒకే రక్తమని మంత్రి ఫరూక్ ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పోలీట్ బ్యూరో సభ్యుడు మాజీ ఎమ్మెల్సీ టిడి జనార్ధన్, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫరూక్ షుబ్లీ తదితరులు హాజరయ్యారు

LEAVE A RESPONSE