Suryaa.co.in

National

‘అగ్నిపథ్‌’పై రెండేళ్లు అధ్యయనం చేశాం.. వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు

– లెఫ్టినెంట్ జనరల్ అనిల్‌పురి

న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకం ఇప్పటికిప్పుడు తీసుకొచ్చినదీ ఏమీ కాదని, రెండేళ్లుపాటు సమగ్ర అధ్యయనం చేసిన అనంతరం దానిని తీసుకొచ్చినట్టు మిలటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్‌పురి తెలిపారు. ‘అగ్నిపథ్’పై త్రివిధ దళాధిపతులు సమగ్ర అధ్యయనం చేశారని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. అనుభవం, యువశక్తికి ప్రాధాన్యం ఇస్తామని, సైన్యంలోకి వచ్చి వెళ్లేందుకు అవకాశాలు పెంచామని అన్నారు. యువ జవానులు సైన్యంలోకి వస్తే సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తారని అన్నారు. అగ్నివీరులు సైన్యంలో కొనసాగేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. కరోనా కారణంగా రెండేళ్లపాటు ఆర్మీ నియామకాలు జరగలేదని, ఈసారి ఎక్కువమంది సైన్యంలో నియమిస్తామన్నారు.

ఈ నెల 24 నుంచే నావికాదళం, వాయుసేనలో నియామక ప్రక్రియ చేపడతామని అనిల్‌పురి తెలిపారు. అగ్ని‌వీరులకు ఇచ్చే అలవెన్సులలో ఎలాంటి తేడాలు ఉండబోవన్న ఆయన.. విధుల్లో వారు ప్రాణాలు కోల్పోతే కోటి రూపాయల పరిహారం ఇస్తామన్నారు. అగ్నివీరుల విషయంలో సర్వీసు నిబంధనల్లో ఎలాంటి తేడా ఉండబోదని స్పష్టం చేశారు. నావికాదళంలో 21 నవంబరులోగా అగ్నివీర్ తొలి బ్యాచ్ సిద్ధమవుతుందన్నారు. నాలుగున్నరేళ్ల సర్వీసు తర్వాత వారికి ధ్రువీకరణ పత్రం ఇస్తామని, ఆ తర్వాత వారు కొనసాగాలా? వద్దా? అనేది వారి ఇష్టమని పేర్కొన్నారు.

అగ్నిపథ్ సంస్కరణ 1989 నుంచి చర్చల్లో ఉన్నట్టు లెఫ్టినెంట్ జనరల్ అనిల్‌పురి పేర్కొన్నారు. త్రివిధ దళాల్లో ఇకపై రెగ్యులర్ నియామకాలు ఉండవని, అగ్నిపథ్ పథకం ద్వారా మాత్రమే నియామకాలు జరుగుతాయని స్పష్టం చేశారు. గతంలో రెండు పరీక్షలు పూర్తిచేసుకున్నవారు కూడా అగ్నిపథ్ పథకంలో చేరాల్సిందేనని తేల్చి చెప్పారు. అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని అనిల్‌పురి స్పష్టం చేశారు. సాధారణ సైనికులతో సమానంగా అగ్నివీరుల సర్వీసు నిబంధనలు ఉంటాయన్నారు. అంతేకాదు, పోలీసు సేవల కోసం అగ్నివీరులను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతామన్నారు.

ఎయిర్‌ఫోర్స్ అగ్నివీరుల కోసం జూన్ 24న నోటిఫికేషన్ విడుదలవుతుందని, జూలై 24న రాతపరీక్ష, డిసెంబర్ 30లోపు శిక్షణ ప్రారంభమవుతుందని అన్నారు. నావికాదళం అగ్నివీరుల కోసం జూన్ 25న ప్రకటన విడుదల చేస్తామన్నారు. నెల రోజుల్లోగా నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. నవంబర్‌ 21 నాటికి అగ్నివీర్‌ తొలి బ్యాచ్‌ సిద్ధమవుతుందన్నారు. నేవీలో అగ్నివీరుల విషయంలో లింగభేదం లేదన్నారు. భారత సైన్యానికి క్రమశిక్షణ అవసరమని అన్నారు. విధ్వంసాలకు పాల్పడిన వారికి ఆర్మీలో అవకాశమే లేదన్నారు. అగ్నివీరుల విషయంలో ఒక అండర్ టేకింగ్ ఉంటుందని, తాము ఆందోళనల్లో పాల్గొనలేదని అండర్ టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుందని అనిల్‌పురి పేర్కొన్నారు.

సైన్యాన్ని యువకులతో నింపాలన్నదే లక్ష్యం. ఆర్మీలోకి వచ్చి వెళ్లేందుకు చాలా అవకాశాలు కల్పించాము. మా కంటే ఇప్పడున్న యువత చాలా శక్తివంతమైనది. సెల్‌ఫోన్లు, డ్రోన్లతో యువత అద్భుతాలు చేస్తున్నారు. రానున్న కాలంలో టెక్నాలజీదే ప్రముఖ పాత్ర. నేటి యువతకు టెక్నాలజీపై మంచి పట్టుంది. ఈసారి ఎక్కువ మందిని నియమించాలని భావించాము. అగ్నివీర్‌లు సైన‍్యంలో కొనసాగే వీలుంది. ‘అగ్నివీర్స్’ దేశ సేవలో తన జీవితాన్ని త్యాగం చేస్తే కోటి రూపాయల పరిహారం అందుతుంది.

ప్రస్తుతం 46వేల మంది అగ్నివీర్‌ల నియామకం చేపడుతున్నాము. భవిష్యత్తులో ఈ సంఖ్య 1.25 లక్షలకు చేరుతుంది. అగ్నివీర్‌లకు వివిధ మంత్రిత్వ శాఖలు ప్రత్యేక రిజర్వేషన్లను కల్పించాయి. ఆందోళనలకు ముందే ఈ నిర‍్ణయం తీసుకున్నాము. ఈ నెల 24 నుంచి తొలి బ్యాచ్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. జూలై 24 వరకూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, ఫేజ్‌-1 ఆన్‌లైన్‌ టెస్టు ఉంటుంది. డిసెంబర్‌ 30 నాటికి తొలిబ్యాచ్‌ ట్రైనింగ్‌కు వెళ్తారు’’ అని స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE