-వ్యాపారస్తుల సమస్యలు పరిష్కరిస్తాం
-గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్
-చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో సమావేశం
చాలామంది నాయకులు రాజకీయాల్లో పెట్టిన ఖర్చును ఎన్నికల తర్వాత వ్యాపారస్తులపై మోపుతుంటారు…మాకు అలాంటి అవసరం లేదు…చిన్నచిన్న వ్యాపారులు పడే ఇబ్బందులకు పరిష్కారం చూపిస్తామని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో శనివారం వ్యాపారులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వ్యాపారస్తులే లక్ష్యంగా కొందరు రాజకీయ నాయకులు దండుకుంటున్నారని, టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కరూ ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ వన్‌టౌన్‌లో ప్రశాంతంగా జీవించే వ్యాపారస్తుల ఆస్తులను కొందరు నాయకులు కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఒక చేతకాని దద్దమ్మ పాలనలో గుంటూరు ప్రజలు అవస్థలు పడుతున్నారని విమర్శించారు. పెమ్మసాని అడుగుజాడల్లో నడుస్తూ పెద్ద వారికి తమ్ముడిగా..చిన్నవారికి అన్నగా సేవలందిస్తానని హామీ ఇచ్చారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి మాట్లాడుతూ అందరి సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కరిస్తానని, రాజకీయాల్లో తానేమి సంపాదించాలన్న ఉద్దేశంతో రాలేదని, సేవ చేయాలని ఉద్దేశంతో వచ్చానని వివరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, మిర్చి మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ కొత్తూరి వెంకట్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.