– రైతుల గురించి మాట్లాడే అర్హత ప్రతిపక్ష నేతకు, ఆ పార్టీకి లేదు
– ప్రతిపక్ష నేతకు ఎప్పటికీ అధికారం రాదన్న ప్రస్టేషన్ తోనే ముఖ్యమంత్రిపై నొటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు
– చంద్రబాబు 14 ఏళ్ల పరిపాలనలో ఏనాడైనా పంట సీజన్ ముగిసేలోపు నష్టపరిహారం అందించారా..?
– ఈ సీజన్ ముగిసేలోపే రైతులకు అందాల్సిన పరిహారాన్ని, ఆర్థిక సహాయాన్ని జగనన్న ప్రభుత్వం అందిస్తోంది
– హోంమంత్రి తానేటి వనిత స్పష్టీకరణ
రైతుల గురించి మాట్లాడే అర్హత ప్రతిపక్ష నేతకు గానీ, ప్రతిపక్ష పార్టీకి గానీ లేదని రాష్ట్ర హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత అన్నారు. ప్రతిపక్ష నేతకు వయసైపోయి, ఇక ఎప్పటికీ అధికారం రాదన్న ఫ్రస్టేషన్ తో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని తెలిపారు. మాటి మాటికీ సైకో అంటున్నారని.. ఈ రాష్ట్రంలో ముసలి సైకో ఎవరో..? పిల్ల సైకో ఎవరో..? ప్రజలందరికీ తెలుసు అన్నారు. హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం రాత్రి మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ… అకాల వర్షాల కారణంగా రైతుల బాధలను ఆసరాగా తీసుకుని రాజకీయం చేస్తున్న చంద్రబాబుని, లోకేష్ ని చూసి జనం ఛీ కొడుతున్నారని తెలిపారు. ఆకస్మాత్తుగా ఇప్పుడు రైతుల మీద ముసలి కన్నీరు కారుస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు.. ఆయన 14 ఏళ్ల పరిపాలనలో ఏనాడైనా పంట సీజన్ ముగిసేలోపు నష్టపరిహారం అందించారా..? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఏడాదిలో రైతులకు ఇవ్వాల్సిన ఇన్ పుట్ సబ్సిడీని రెండేళ్లయితే కానీ ఇవ్వని చంద్రబాబు నాయుడు ఇప్పుడు సిగ్గులేకుండా ముఖ్యమంత్రిని వారం రోజుల్లోనే ఇచ్చేయాలని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రూ.2వేల 500 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ ఎగ్గొట్టిన ప్రతిపక్ష నేత దరిద్రపు పాలనను ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని తెలిపారు. ఈ రోజు వర్షాలకు దెబ్బ తిన్న ధాన్యం, ప్రతి పంటను ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని.. గత ప్రభుత్వం ఏనాడైనా ఇలా కొనుగోలు చేసిందా ప్రజలు గమనించాలని కోరారు. చంద్రబాబు నాయుడు హాయాంలో మిల్లర్లు, దళారులతో కలిసి రైతులను దోచుకున్నారని తెలిపారు.
కానీ నేడు జగనన్న ప్రభుత్వమే రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తోందన్నారు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, ధాన్యం కొనుగోలు డబ్బులు, విత్తన రాయితీ ఇలా..అన్ని కలిపి 5వేల 900 కోట్ల రూపాయలకు ఎగనామం పెట్టిన చంద్రబాబు నాయుడు మళ్లీ రైతుల కోసం మాట్లాడటానికి సిగ్గులేదా…? అని ప్రశ్నించారు. ఆయన ఎన్ని డ్రామాలాడినా… రైతులకు ఈ ప్రభుత్వం ఎంత మానవత్వంతో ఆదుకుంటుందో అందరికీ తెలుసన్నారు. రైతుల కోసం దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిలా ఆలోచించే వారే లేరని తెలిపారు. కరోనా సమయంలో చంద్రబాబు, ఆయన తనయుడు హైదరాబాద్ లోని తమ 500 కోట్ల ఇంద్ర భవనంలో పడుకుంటే.. మనసున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతుల పంటలను కొనుగోలు చేయించారని, అది జగనన్న అంటే అన్నారు. ఖచ్చితంగా రైతుల దెబ్బతిన్న పంటను కొనుగోలు చేస్తామని, ఈ సీజన్ ముగిసేలోపే వారికి అందాల్సిన పరిహారాన్ని, ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తామని తెలిపారు. రైతులెవ్వరూ అధైర్యపడాల్సిన పనిలేదని మంత్రి తానేటి వనిత హామీ ఇచ్చారు.