– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కోదాడ: సూర్యపేట జిల్లా కోదాడలో ఇటీవల పోలీసుల లాకప్ డెత్‌లో మృతి చెందిన దళిత యువకుడు కర్ల రాజేష్ కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్లయ్య యాదవ్, గాదరి కిషోర్ కుమార్, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. దళిత యువకుడు రాజేష్‌ను చిత్రహింసలకు గురిచేసి అన్యాయంగా హత్య చేశారని కేటీఆర్ ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే రాజేష్ ప్రాణాలు బలయ్యాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే మరియు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ లాకప్ డెత్‌కు బాధ్యులైన డీఎస్పీ, ఎస్ఐ, సీఐలను వెంటనే డిస్మిస్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో మరియమ్మ అనే దళిత మహిళ మృతి చెందిన సందర్భంలో రూ.35 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి, కుటుంబానికి ఉద్యోగం కల్పించి, బాధ్యులైన పోలీస్ అధికారులను డిస్మిస్ చేశామని గుర్తు చేశారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కిస్తూ బాధ్యులను కాపాడుతోందని ఆయన విమర్శించారు. ఈ ఘటనకు కారణమైన శ్రీధర్ రెడ్డి అనే డీఎస్పీకి ప్రమోషన్ ఇచ్చి తన వద్దే ఉంచుకోవడం ఎంత అన్యాయమని, ఈ అంశంలో మంత్రి ఉత్తమ్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
రాజేష్ తల్లి పడుతున్న క్షోభను ఎవరూ తీర్చలేరని కేటీఆర్ భావోద్వేగంగా పేర్కొన్నారు. ఈ అంశాన్ని రేపు అసెంబ్లీలో కూడా లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీస్తామని, అవసరమైతే ఢిల్లీ దాకా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున రాజేష్ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై ఎంఆర్పీఎస్ నాయకుడు మంద కృష్ణ చేపట్టిన పోరాటం అభినందనీయమని, వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.